ఇచ్చోడ టు ఇందూరు

11 Feb, 2019 08:31 IST|Sakshi
ఇచ్చోడ మండలంలోని అడవిలో దాచి ఉంచిన కలపను పరిశీలిస్తున్న ఎస్పీ వారియర్‌(ఫైల్‌)

ఇచ్చోడ(బోథ్‌): ఆదిలాబాద్‌ జిల్లాలోని అడవుల నుంచి కలప రవాణా దందా ఇచ్చోడ నుంచి ఇందూర్‌ వరకు నిరా టంకంగా సాగుతోంది. జిల్లాలోని కేశవపట్నం, గుండాల, ఎల్లమ్మగూడ, జోగిపేట్‌ ప్రాంతాల్లో నివసించే ముల్తానీలు కలప స్మగ్లింగ్‌ గ్యాంగ్‌లుగా ఏర్పడి కోట్ల రూపాయల కలపను జిల్లా సరిహద్దులు దాటిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. కలప తరలింపులో సిద్ధహస్తులుగా పేరున్న ముల్తానీలకు నిజామాబాద్‌లో కలప దందా విక్రయాలు చేసే సామిల్‌ యజమానులు అండగా ఉండడంతో దందా సాగుతోంది.

ఈ ముల్తానీలు ఎవరు?
పాకిస్తాన్‌ ముల్తాన్‌ ప్రావిన్స్‌ (రాష్ట్రంలో)లోని ముస్లింలలో గిరిజన తెగకు చెందిన ముల్తానీలు దేశానికి స్వాతంత్రం రాక ముందు ఇక్కడి ప్రాంతానికి వలస వచ్చారు. మహారాష్ట్రలోని కిన్వట్‌ తాలుకా చికిలి, ఆదిలాబాద్‌ జిల్లాలోని ఇచ్చోడ   మండలం కేశవపట్నం, గుండాల, ఎల్లమ్మగూడ, జోగిపేట్‌లో స్థిరనివాసం ఏర్పాటు చేసుకున్నారు. స్వాంతంత్రం రాక ముందు ముల్తాన్‌ రాష్ట్రం అవిభక్త భారత్‌లో భాగంగా ఉండేది. దీంతో ముల్తానీలు అక్కడి నుంచి కూలీనాలీ చేసుకుంటూ సంచార జీవితం ప్రారభించారు. పొట్ట చేతబట్టుకొని అడవుల గుండా గుడారాలు ఏర్పాటు చేసుకుంటూ ఈ ప్రాంతానికి చేరుకున్నారు. పాకిస్తాన్‌ ప్రత్యేక దేశంగా ఆవిర్భవించింది. ఇక్కడి వారు ఇక్కడే ఉండిపోయారు. కేశవపట్నం, గుండాల నుంచి జోగిపేట్, బావోజీపేట్, ఎల్లమ్మగూడలకు విస్తరించారు. వీరు నివసించే ప్రాంతాల్లో దట్టమైన అటవీ ప్రాంతాలుగా ఉండేవి. దీంతో ముల్తానీలు కలప రవాణానే ఉపాధిగా మార్చుకున్నారు.

ముందు నుంచి నేరప్రవృత్తే...
అక్రమంగా కలప రవాణాకు పాల్పడే ముల్తానీలు ముందు నుంచి నేరప్రవృత్తి కలిగిన వారే ఎక్కువ. కలప రవాణా ప్రారంభం మొదట్లో చుట్టు పక్కల ప్రాంతాల్లో గృహ నిర్మాణం, ఇతర అవసరాలకోసం కలపను రవాణా చేసే వారు. ముందుగా కలప రవాణా ఎడ్లబండ్ల ద్వారా ప్రారంభమైంది. దాదాపుగా 20కిపైగా ఎడ్లబండ్ల ద్వారా కలపను తీసుకెళ్లి చుట్టుపక్కల ప్రాంతాల్లో  విక్రయించే వారు. కలప రవాణాలో అడ్డువచ్చిన వారిని భయాందోళనకు గురి చేసి అడ్డుతొలగించేవారు. ఈ రవాణా రాత్రి వేళల్లోనే కొçనసాగేది. కాలక్రమంలో వాహనాల్లో హైదరాబాద్‌ లాంటి ప్రాంతాలకు కలపను తరలించడం ప్రారంభించారు. జాతీయ రహదారిలో వెళ్తున్న వాహనాలు హైజాక్‌ చేసి కలపను జిల్లా సరిహద్దులు దాటవేయడం చేశారు.

నాగ్‌పూర్‌ నుంచి హైదరాబాద్‌ వైపు వెళ్లే లారీలు ఇక్కడి ప్రాంతాల్లో నిలిపిన సమయంలో లారీలు ఎత్తుకెళ్లి కలప తరలించేవారు. స్మగ్లర్ల ఫొటోలు పలు దాబా హోటళ్ల వద్ద ప్రదర్శించారు. కొద్ది రోజులకు లారీల హైజాక్‌ నిలిచిపోయింది. ముల్తానీలు దందా కొనసాగించడానికి మరో పద్ధతి ఎంచుకున్నారు. జాతీయ రహదారిలోని దాబా హోటల్లో మకాం వేసి కలప స్మగ్లింగ్‌కు అణువుగా ఉన్న లారీ డ్రైవర్లను మచ్చిక చేసుకొని కూరగాయాలు హైదరాబాద్‌కు తరలించాలని నమ్మించి డబ్బు ఆశ చూపేవారు. జాతీయ రహదారికి పర్‌లాంగ్‌ దూరంలో కూరగాయలు ఉన్నాయని నమ్మించి తీసుకెళ్లిన లారీలో అరగంటలోనే కలప లోడ్‌ చేసి డ్రైవర్లను బెదిరించి తరలించేవారు. ఇలా తరలిస్తున్న క్రమంలో కొన్ని వందల లారీలు పట్టుబడిన సంఘటనలు ఉన్నాయి. 

సినిమాను తలపించేలా స్మగ్లింగ్‌
కొన్ని ఏళ్ల నుంచి కలప రవాణా ఆధారంగా జీవిస్తున్న ముల్తానీలు సినిమాను తలపించేలా స్మగ్లింగ్‌కు పాల్పడుతున్నట్లు తెలుస్తోంది. ఇందుకు సెల్‌ఫొన్‌ వ్యవస్థ వీరికి అండగా ఉంటోంది. రాత్రి సమయంలో అటవీ, పోలీస్‌ అధికారులకు తప్పుడు సమాచారం ఇచ్చి మరోచోట నుంచి కలపను తరలిస్తున్నారు. కొన్ని సందర్భాల్లో అధికారులను నమ్మించడానికి చిన్న వాహనంలో కలప ఉంచుతున్నట్లు తెలుస్తోంది. చిన్న వాహనాన్ని మండలకేంద్రానికి తరలించేలోపే మరోచోట నుంచి పెద్ద మొత్తంలో కలపను సరిహద్దులు దాటిస్తున్నారు.

ఏడాదిలో రూ.50 లక్షల కలప పట్టివేత
2018లో జనవరి నుంచి నవంబర్‌ వరకు దాదాపుగా రూ.50 లక్షల కలపతోపాటుగా 18 వాహనాలు అటవీ, పోలీసుశాఖ అధికారులు పట్టుకున్నారు. ఈ ప్రకారం మరో పదోవంతు రూ.5 కోట్ల విలువైన కలప ఇచ్చోడ ప్రాంతం నుంచి ఇతర ప్రాంతాలకు తరలివెళ్లినట్లు తెలుస్తోంది. ఈ పదేళ్లలో నిజామాబాద్‌ వ్యాపారుల కనుసన్నల్లో రూ.50 కోట్ల కలప తరలిపోయినట్లు సమాచారం.

వందలకుపైగా వాహనాల నంబర్‌ ప్లేట్లు..
నిజామాబాద్‌లోని పలు సామీల్‌లలో అటవీ శాఖ, పోలీసుశాఖ తనిఖీలు నిర్వహించగా వందల కొద్ది వాహనాల నంబర్‌ప్లేట్లు లభించడంతో ముల్తానీలకు వ్యాపారులు సహకరిస్తున్నారని తేలింది. ఇచ్చోడ ప్రాంతంలో పట్టుబడ్డ వాహనాలకు పైన ఒకనంబర్‌ ప్లేట్, కింది భాగంలో మరోనంబర్‌ ప్లేట్, వాహనంలో మరో నంబర్‌ ప్లేట్‌ లభించిన సంఘటనలు కూడా అనేకం ఉన్నాయి. 

నిజామాబాద్‌ వ్యాపారుల కీలకపాత్ర.. 
ముల్తానీలు సాగిస్తున్న కలప స్మగ్లింగ్‌కు పదేళ్ల నుంచి నిజామాబాద్‌కు చెందిన  కలప వ్యాపారులు రంగంలోకి దిగారు. దీంతో ముల్తానీల కలప రవాణా జోరందుకుంది. కలప రవాణా చేయడానికి అక్కడి వ్యాపారులే వాహనాలు సమకుర్చడం, స్మగ్లింగ్‌లో ముల్తానీలకు నూతన పద్ధతులు నేర్పించడంతో అక్రమ కలప రవాణాకు అడ్డూఅదుపు లేకుండాపోయింది. పదేళ్లుగా ఇచ్చోడ ప్రాంతం నుంచి వేల కోట్ల కలప జిల్లా సరిహద్దులు దాటి పోయింది. సెల్‌ఫోన్‌ వ్యవస్థ అందుబాటులోకి రావడం. కలపతో లోడ్‌ చేసిన వాహనాన్ని జాతీయ రోడ్డుపైకి ఎక్కించి, ఆదిలాబాద్‌ జిల్లాలోని చెక్‌పోస్టులతోపాటుగా నిర్మల్, నిజామాబాద్‌ సరిహద్దులోని సోన్‌ చెక్‌పోస్టులు కలప వాహనాలు దాటే వరకు  నిజామాబాద్‌ కలప వ్యాపారులు చూసుకోవడంతో కలప దందా ఊపందుకుంది. ముల్తానీలు నివాసమంటున్న గ్రామాల్లో వందలకుపైగా గ్యాంగ్‌లుగా ఏర్పడి దట్టమైన అడవిలోని విలువైన టేకు కలప నరికి తరలించడానికి పూనుకున్నారు. 

చెక్‌పోస్టులపైనే అనుమానాలు
కొన్నేళ్లుగా జిల్లా సరిహద్దుల నుంచి కలపతో వాహనాలు దాటిపోతూనే ఉన్నా జాతీయ రహదారిపై ఉన్న ఇస్‌పూర్, మొండిగుట్ట చెక్‌పోస్టుల వద్ద ఇప్పటి వరకు ఒక్క వాహనం కూడా పట్టుపడకపోవడంతో, చెక్‌పోస్టుల నిర్వహణపై పలు అనుమానాలకు తావిస్తోంది. అటవీ«శాఖకు చెందిన కొంతమంది  సిబ్బంది సహకరిస్తుండడంతోనే ఈ వ్యవహారం మూడు పువ్వులు ఆరు కాయలుగా కొనసాగిస్తున్నట్లు సమాచారం.

కలప అక్రమ నివారణకు పూర్తిస్థాయిలో చర్యలు 
కలప అక్రమ నివారణకోసం ప్రభుత్వం పూర్తిస్థాయి చర్యలు తీసుకుంటోంది. కలప స్మగ్లర్లపై ప్రభుత్వం సీరియస్‌గా ఉంది. స్మగ్లింగ్‌కు పాల్పడితే ఎంతటివారైనా ఉపేక్షించేది లేదు. స్మగ్లింగ్‌ అడ్డుకోవడానికి పోలీస్, ఫారెస్టుశాఖ సమన్వయంగా అడవుల్లో పెట్రోలింగ్‌ నిర్వహిస్తున్నాం. – చంద్రశేఖర్, ఎఫ్‌డీవో 

మరిన్ని వార్తలు