అటవీఅధికారులపైనా వేటు..!

25 Jan, 2019 11:06 IST|Sakshi
వేణుబాబు, రవిమోహన్‌భట్‌, శ్రీనివాస్

సాక్షిప్రతినిధి, నిజామాబాద్‌ : కలప స్మగ్లింగ్‌పై ఉక్కుపాదం మోపుతున్న ప్రభుత్వం.. అటవీశాఖ ఉన్నతాధికారులపైనా చర్యలకు ఉపక్రమించింది. స్మగ్లర్లతో అంటకాగారానే ఆరోపణలున్న ఉన్నతాధికారులను సస్పెండ్‌ చేస్తూ నిర్ణయం తీసుకుంది. నిజామాబాద్‌ ఎఫ్‌డీఓ వేణుబాబు, ఫారెస్ట్‌ రేంజ్‌ ఆఫీసర్‌ (నార్త్‌) రవిమోహన్‌భట్, డిప్యూటీ రేంజ్‌ ఆఫీసర్‌ శ్రీనివాస్‌లను సస్పెండ్‌ చేసింది. ఈ మేరకు గురువారం అటవీశాఖ పీసీసీఎఫ్‌ ప్రశాంత్‌కుమార్‌ఘా ఆదేశాలు జారీ చేశారు.

అటవీశాఖలో ఓ ఎఫ్‌డీఓ స్థాయి అధికారిపై వేటు వేయడం తొలిసారి కావడంతో ఆశాఖ వర్గాల్లో కలకలం రేగుతోంది. జిల్లాలో సామిల్లుల్లో రూ.కోట్లలో అక్రమ కలప దందా సాగుతున్నా.. చూసీ చూడనట్లు వదిలేశారనే ఆరోపణలపై ఈ ముగ్గురు ఉన్నతాధికారులపై వేటు పడింది. తరచూ ఆదిలాబాద్‌ జిల్లా నుంచి అక్రమ కలప నిజామాబాద్‌కు వస్తున్నట్లు ఈ అధికారులకు సమాచారం ఉన్నప్పటికీ.. ఎలాంటి చర్యలు తీసుకోలేదనే ఆరోపణలు.. విధి నిర్వహణలో అలసత్వం వంటి అంశాలను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. కలప స్మగ్లర్లకు సహకరిస్తున్న ఏఆర్‌ ఎస్‌ఐ షకీల్‌పై సైతం కేసు నమోదు చేసిన పోలీసులు, ఆయను సస్పెండ్‌ చేస్తూ పోలీసుశాఖ నిర్ణయం తీసుకున్న విషయం విధితమే. షకీల్‌ను అరెస్టు చేసేందుకు పొలీసులు ప్రత్యేక చర్యలు చేపట్టారు.
 
సామిల్లుల లైసెన్సులు రద్దు.. 
కలప స్మగ్లింగ్‌కు పాల్పడుతున్న నాలుగు సామిల్లుల లైసెన్సులను సైతం రద్దు చేయాలని అటవీశాఖ నిరయం తీసుకుంది. నిజామాబాద్‌ సామిల్, బిలాల్‌ సామిల్, సోహైల్‌ సామిల్, దక్కన్‌ సామిల్‌ల లైసెన్సులు రద్దు చేయనున్నారు. గురువారం జిల్లా అటవీశాఖ అధికారులు షోకాజ్‌ నోటీసులు జారీ చేశారు. సామిల్లు నిబంధనలను ఉల్లంఘించి నిల్వ ఉంచిన అక్రమ కలపను కనుగొన్న అధికారులు ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు.

శాఖా పరమైన విచారణ.. 
జిల్లాలో యథేచ్ఛగా కలప స్మగ్లింగ్‌ కొనసాగుతున్నప్పటికీ చెక్‌ పెట్టాల్సిన అటవీశాఖ అధికారులు అక్రమార్కులతో అంటకాగడాన్ని ఎట్టకేలకు అటవీశాఖ తీవ్రంగా పరిగణించింది. ముగ్గురు అధికారులను సస్పెండ్‌ చేసిన అటవీశాఖ ఈ వ్యవహారంపై శాఖా పరమైన విచారణ కూడా నిర్వహించనుంది. జిల్లాలో కలప స్మగ్లింగ్‌ య«థేచ్చగా సాగుతోంది. ఆదిలాబాద్‌ అటవీ ప్రాంతంలో ముల్తానీలతో నేరుగా సంబంధాలు పెట్టుకున్న జిల్లాకు చెందిన స్మగ్లర్లు ఇచ్చోడ, పెంబీ వంటి దట్టమైన అటవీప్రాంతాన్ని మైదానంగా మార్చేశారు. ఒక్కో సామిల్లులో ప్రతినెలా రూ.కోటికిపైగా విలువైన కలప అక్రమ దందా కొనసాగుతోంది. అటవీ, పోలీసుశాఖ ఉన్నతాధికారుల అండతో స్మగ్లర్లు తమ దందాను కొనసాగించారు. ఎట్టకేలకు ఈ కలప స్మగ్లింగ్‌పై సర్కారు దృష్టి సారించడం., నిర్మల్‌ పోలీసులకు చిక్కిన కలప వ్యాన్‌ కేసు ఆధారంగా తీగలాగడంతో ఈ స్మగ్లర్ల డొంక కదిలింది.

కొనసాగిన తనిఖీలు.. 
ఆదివారం నుంచి సామిల్లుల్లో కలప నిల్వలు, రికార్డులను పరిశీలిస్తున్న అధికారులు గురువా రమూ తనిఖీలను కొనసాగించారు. దీంతో మిగిలిన సామిల్లుల యజమానులు అన్ని సర్దుకుంటున్నట్లు సమాచారం. అక్రమ కలపను గుట్టు చప్పుడు కాకుండా సామిల్లుల నుంచి తరలించి, రికార్డులను సర్దేసుకుంటున్నట్లు తెలుస్తోంది.

మరిన్ని వార్తలు