దోచేస్తున్నారు..! 

18 Jun, 2019 12:02 IST|Sakshi
అడవిలో నరికిన కలప   

ఇష్టారాజ్యంగా కలప అమ్మకాలు 

ప్రభుత్వ ఆదాయానికి గండి

వేలంలో మాయాజాలం..అనుకూల వ్యాపారులకే అందలం

సాక్షి, కొత్తగూడెం: అటవీ సంపదను రక్షించడంతో పాటు అడవిలోని కలపను అమ్మగా వచ్చిన మొత్తాన్ని ప్రభుత్వానికి అందించాల్సిన అధికారులు.. ఆ డబ్బును సొంతానికి వాడుకోవడం అనేక విమర్శలకు తావిస్తోంది. జిల్లాలోని దమ్మపేట, ములకలపల్లి, పాల్వంచ రేంజ్‌ల పరిధిలో కొందరు అధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండికొడుతున్నారనే ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి.

ఈ నేపథ్యంలో నేరుగా అటవీ శాఖ ప్రిన్సిపల్‌ చీఫ్‌ కన్జర్వేటర్‌ ఆఫ్‌ విజిలెన్స్‌ దాడులు చేయించారు. ఈ దాడుల్లో ఎఫ్‌డీఓ, ఎఫ్‌ఆర్‌ఓలకు సంబంధించిన అనేక విషయాలు వెలుగులోకి వచ్చాయి. అక్రమ కలప లారీలను పట్టుకోవడంతో పాటు మరికొన్ని వాస్తవాలు సైతం తెలుసుకున్నట్లు సమాచారం. దమ్మపేట రేంజ్‌లోని పూసుగుంట, ఆర్లపెంట సెక్షన్‌ల పరిధిలో నుంచి సరిహద్దు ఏపీలోకి యథేచ్ఛగా కలప రవాణా చేసినట్లు తెలుస్తోంది.

సీతారామ కెనాల్‌ అలైన్‌మెంట్‌లో వచ్చిన కలపను పట్టాభూముల పర్మిట్ల మీద ముందుగా మాట్లాడుకున్న ఏపీలోని వ్యాపారులకు నేరుగా అమ్ముకున్నట్లు సమాచారం. ఏపీ దగ్గరగా ఉండడం, మధ్యలో ఒకే చెక్‌పోస్ట్‌ ఉండడం, అదీ వీరి పరిధిలోనే ఉండడంతో ఆడిందే ఆటగా మారింది. అలాగే ఒకే పర్మిట్‌పై రెండు లారీ లోడ్లు పంపినట్లు తెలుస్తోంది. ఇక సీతారామ కెనాల్‌పై చెట్లు నరికించేందుకు కూలీలను ఉపయోగిస్తే ప్రభుత్వం ఖర్చులు ఇస్తుంది.

అలా కాకుంగా ఏపీకి చెందిన తమకు అనుకూలమైన వ్యాపారులతోనే కలప నరికించడంతో పాటు సదరు కలపను నేరుగా వారే తీసుకెళ్లేలా ఏర్పాట్లు చేసుకుని, కూలీ ఖర్చులు మాత్రం ఈ అధికారులే తీసుకోవడం గమనార్హం. ఈ క్రమంలో వారం రోజుల క్రితం సదరు వ్యాపారి తీసుకెళుతున్న కలప లారీని కిందిస్థాయి బీట్, సెక్షన్‌ అధికారులు పాల్వంచ డిపోకు తరలించగా, ఈ లారీ కలపను నేరుగా అనధికారికంగా ఐటీసీకి అమ్మడం విశేషం.

కిందిస్థాయి సిబ్బందిని మాత్రం ఇతర అంశాల నెపంతో పరోక్షంగా ఇబ్బందుల పాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఖమ్మం జిల్లాకు చెందిన మరో ఇద్దరు ఎఫ్‌ఆర్‌ఓల సహకారంతో కొన్నిసార్లు కలపను ఖమ్మం, సత్తుపల్లి సామిల్లులకు సైతం పంపుతుండడం గమనార్హం. ఇక రైతులకు చెందిన చేదు వేప (సాధారణ) కలప అమ్మకానికి అటవీశాఖ అనుమతులతో పనిలేదు. వీఆర్‌ఓ, ఎఫ్‌బీఓ సంతకంతో రవాణా చేయవచ్చు. దీంతో ఇటీవల ఫలానా పట్టాభూమి అనేది లేకుండా 5 లారీల వేప రవాణా చేసినట్లు సమాచారం. ఈ వేప టన్ను రూ.8 వేలు. ఒక్కో లారీకి 30 టన్నుల కలప ఉంటుంది. 

ధర ఎక్కువ.. చూపింది తక్కువ.. 
ములకలపల్లి రేంజ్‌ ఒడ్డుగూడెం డిపోలో ఆక్షన్‌ సేల్‌లో భాగంగా వెదురుబొంగు ధర ఎక్కువగా పలికినప్పటికీ.. తక్కువగా చూపారనే  ఆరోపణలు ఉన్నాయి. వెదురుబొంగుకు ఒక్కొక్కటి రూ.80 ఉండగా, వేలంలో రూ.120 వచ్చినట్లు తెలుస్తోంది. కానీ పోటీ లేదని, రూ.80 మాత్రమే పలికిందని చూపడం గమనార్హం. బయట ఒక్కో వెదురుబొంగుకు రూ.180 వరకు ఉంది. దీంతో ప్రభుత్వానికి 20 నుంచి 30 శాతం ఆదాయం పోతోంది. ఇక టేకు కలప అయితే నేరుగా ఇంటికే తీసుకెళ్లినట్లు ఆరోపణలు ఉన్నాయి.

స్పాట్‌ ఆక్షన్‌ వద్ద ఎఫ్‌డీఓ ఉండి బిడ్‌ జాబితా రాయాల్సి ఉంటుంది. అయితే సదరు వేలందారులతో కుమ్మక్కై కార్యాలయానికి వెళ్లి రాసుకున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ అంశాలన్నీ విజిలెన్స్‌ అధికారులు సేకరించినట్లు తెలుస్తోంది. ఇప్పటికే జిల్లా ఉన్నతాధికారులపై ప్రిన్సిపల్‌ చీఫ్‌ కన్జర్వేటర్‌ ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. దీనిపై జిల్లా అటవీ అధికారి శివాల రాంబాబును వివరణ కోరగా వ్యాపారులతో కుమ్మక్కు అయినట్లు, అక్రమాలకు పాల్పడినట్లు రుజువైతే శాఖాపరమైన చర్యలు తీసుకుంటామన్నారు.

మరిన్ని వార్తలు