లారీలను వెంబడించి పట్టుకున్న ఎమ్మెల్యే

9 Aug, 2018 09:28 IST|Sakshi
లారీలో తరలిస్తున్న కలపను పరిశీలిస్తున్న ఎమ్మెల్యే టీఆర్‌ఆర్, అధికారులు 

అర్ధరాత్రి కలప అక్రమ రవాణా

సహజ సంపదను కాపాడాలని టీఆర్‌ఆర్‌ పిలుపు

పరిగి వికారాబాద్‌ : ‘చెట్లన్నీ నరుక్కుంటూ పోతే మొక్క లు నాటి ఏంలాభం.. నాటుడు తక్కువైంది.. నరుకుడు ఎక్కువైంది’. అని పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తంచేశారు. అక్రమంగా కలప తరలిస్తున్నారంటూ మంగళవారం అర్ధరాత్రి కొంతమంది యువకులు ఇచ్చిన సమాచారంతో బయలుదేరిన ఆయన లారీలను వెంబడిస్తూ వెళ్లారు. ఇదే సమయంలో ఫారెస్టు అధికారులకు సమాచారం అందించడంతో వారు సైతం ఎమ్మెల్యేకు జతకలిశారు.

కుల్కచర్ల మండలం ఇప్పాయిపల్లిగేట్‌ సమీపంలో షాద్‌నగర్‌ వైపు వెళ్తున్న నాలుగు లారీలను పట్టుకున్నారు. అనంతరం వీటిని పరిగి రేంజర్‌ కార్యాలయానికి తరలించారు. ఫారెస్టు ఆఫీసులో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అసిస్టెంట్‌ ఫారెస్టు రేంజర్‌ శ్రీవాణి వివరాలు వెల్లడించారు. ముజాహిద్‌పూర్‌ పరిసరాల్లోని అటవీ ప్రాంతం తో పాటు వ్యవసాయ పొలాల్లోని చెట్లను నరికి లారీల్లో తరలిస్తున్నట్లు తెలిపారు. ఇందులో మామిడి, యూకలిప్టస్, వేప, తుమ్మ తదితర చెట్ల మొదళ్లు, దుంగలు ఉన్నట్లు స్పష్టంచేశారు.

ఎమ్మెల్యే టీఆర్‌ఆర్‌ మాట్లాడుతూ.. ఎన్నిసార్లు హెచ్చరించినా కలప అక్రమ రవాణా ఆగడం లేదని మండిపడ్డారు. మొరం, మట్టి, కలప తదితర సహజ వనరులు తరలిపోతున్నా యని పేర్కొన్నారు. ఇలాంటి సంఘటనలు కనిపిస్తే వెంటనే పోలీసులు, రెవె న్యూ, అటవీశాఖల అధికారులకు సమాచారం అందించాలని యువత, మహిళలను కోరారు. అటవీశాఖ అధికారులు మహిళా ఆఫీసర్లైనా బాగా స్పందిస్తున్నారని కితాబిచ్చారు. ఈ కార్యక్రమంలో నాయకులు సత్యనారాయణరెడ్డి, టీ.వెంకటేశ్, ఫారెస్టు అధికారులు ఉన్నారు.

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా