సీఎం ఆదేశిస్తే గానీ..

23 Jan, 2019 13:50 IST|Sakshi
నిజామాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ డిప్యూటీ మేయర్‌ ఫయిమ్‌కు చెందిన బిలాల్‌ సామిల్‌లో తనిఖీలు చేస్తున్న అటవీశాఖ అధికారులు

కలప స్మగ్లింగ్‌పై సమన్వయంతో చర్యలకు ఉపక్రమించిన అటవీ, పోలీసు శాఖ అధికారులు నిర్మల్‌ జిల్లా సోన్‌ వద్ద ఇటీవల రూ.16 లక్షల విలువైన కలపను పట్టుకున్నారు. కూపీ లాగడంతో జిల్లాలో డొంక కదులుతోంది. నిజామాబాద్, ఆర్మూర్‌ డివిజన్‌ కేంద్రాలుగా కలప స్మగ్లింగ్‌ జోరుగా సాగుతుండగా.. అక్రమార్కులకు ఆదిలాబాద్, నిర్మల్‌ అటవీ ప్రాంతంలో కలప స్మగ్లింగే జీవనాధారంగా చేసుకున్న ముల్తానీలతో నేరుగా సంబంధాలు ఉన్నాయి. 

సాక్షిప్రతినిధి, నిజామాబాద్‌ : సామిల్లుల కలప స్మగ్లింగ్‌పై ఎట్టకేలకు అధికార యంత్రాంగం దృష్టి సారించింది. సాక్షాత్తు ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావు ఆదేశించడంతో అటవీ, పోలీసుశాఖలు సంయుక్తంగా కలప అక్రమ రవాణాపై దృష్టి సారించాయి. ఇన్నాళ్లూ మామూళ్ల మత్తులో ఉన్న అటవీశాఖ అధికార యంత్రాంగం సామిల్లుల్లో జరుగుతున్న అక్రమాలను చూసీచూడనట్లు వదిలేసింది. ప్రతినెలా రూ.లక్షల్లో మామూళ్లు దండుకుంటున్న కొందరు అటవీశాఖ అధికారులు సామిల్లులు, టింబర్‌ 

డిపోల్లో నామమాత్ర తనిఖీలు చేపట్టి చేతులు దులుపుకున్నారు. దీంతో నిజామాబాద్, ఆర్మూర్‌ డివిజన్‌ కేంద్రాలుగా కలప స్మగ్లింగ్‌ జోరుగా సాగుతోంది. ఆదిలాబాద్, నిర్మల్‌ అటవీ ప్రాంతంలో కలప స్మగ్లింగే జీవనాధారంగా చేసుకున్న ముల్తానీలతో నేరుగా సంబంధాలు పెట్టుకున్న కొందరు సామిల్లుల యజమానులు రూ.లక్షలు విలువ చేసే టేకు కలపను స్మగ్లింగ్‌ చేసి పెద్ద మొత్తంలో దండుకుంటున్నారు. అటవీశాఖ అధికారులు కనుసన్నల్లో, పోలీసు శాఖ అండదండలతో ఈ దందా యథేచ్ఛగా సాగుతూ వస్తోంది. కొన్నేళ్లుగా సాగుతున్న ఈ దందాపై ‘సాక్షి’ వరుస కథనాలను ప్రచురించింది. దీంతో అప్పట్లో పలు సామిల్లుల్లో తూతూ మంత్రంగా తనిఖీలు నిర్వహించిన అటవీశాఖ అధికారులు, ఆ తర్వాత చేతులు దులుపుకున్నారు.

తాజాగా ‘అటవీ’ అక్రమాలపై ఉక్కుపాదం మోపాలని సీఎం కేసీఆర్‌ ఆదేశించడంతో అటవీ, పోలీసు శాఖలు సమన్వయంతో చర్యలకు ఉపక్రమించాయి. ఇందులో భాగంగా కలప అక్రమ రవాణా కూపీ లాగడంతో జిల్లాలోని స్మగ్లింగ్‌ డొంక కదులుతోంది. ఆదిలాబాద్‌ అటవీ ప్రాంతం నుంచి నిజామాబాద్‌కు టేకు కలప వాహనాలు వస్తున్నాయన్న సమాచారం మేరకు నిఘా పెట్టిన ఇరు శాఖల అధికారుల బృందం జిల్లా సరిహద్దుల్లోని సోన్‌ చెక్‌పోస్టు వద్ద మాటువేసి పట్టుకున్నాయి. సుమారు రూ.16 లక్షలకు పైగా విలువ చేసే టేకు కలపను తరలిస్తున్న వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ కలప స్మగ్లింగ్‌ చేస్తున్న వారిని అదుపులోకి తీసుకుని విచారించగా.. నిజామాబాద్‌ నగరంలోని పలు సామిల్లులకు ఈ కలప అక్రమ రవాణా అవుతున్నట్లు గుర్తించారు. దీంతో ఆయా సామిల్లులపై కేసులు నమోదు చేసి, తనిఖీలు చేపట్టారు.
 
పోలీసు అండదండలు..? 
జిల్లాలో సాగుతున్న కలప స్మగ్లింగ్‌కు ఇటు పోలీసుశాఖలో కొందరు ఉన్నతాధికారుల అండదండలున్నట్లు తేటతెల్లమైంది. సోన్‌లో పట్టుబడిన కలప వాహనాన్ని స్వయంగా ఓ ఏఎస్‌ఐ వాహనం ముందు కారులో ఉండి స్మగ్లింగ్‌ చేయిస్తున్నట్లు పోలీసుల విచారణలో వెలుగుచూడటం గమనార్హం. దీన్ని బట్టి పోలీసుశాఖలోని కొందరు ఈ కలప స్మగ్లర్లతో అంటకాగుతున్నట్లు బహిర్గతమైంది.

ప్రతినెలా రూ.కోటి పైగా మామూళ్లు..? ప్రతినెలా రూ.కోటి పైగా మామూళ్లు..? 

జిల్లాలో మొత్తం 95 వరకు సామిల్లులున్నాయి. మరో 15 టింబర్‌ డిపోలున్నాయి. ఒక్క నిజామాబాద్‌ నగరంలోనే 41 వరకు ఇవి ఉంటాయి. గతంలో టేకు, నాన్‌ టేకు పర్మిషన్లు వేర్వేరుగా ఇచ్చేవారు. ప్రస్తుతం అన్ని సామిల్లులకు టేకు కలప కోసే అధికారాలను కట్టబెట్టారు. ఆయా సామిల్లుల నుంచి కొందరు అధికారులు ప్రతినెలా పెద్ద మొత్తంలో మామూళ్లు దండుకోవడం జిల్లాలో పరిపాటిగా తయారైంది. సామిల్‌ టర్నోవర్‌ను బట్టి ఒక్కో సామిల్‌ నుంచి ప్రతినెలా రూ.లక్ష వరకు పోగేస్తున్నారు. ఇలా అన్ని సామిల్లుల నుంచి ప్రతినెలా రూ.కోటికిపైగా మామూళ్లు చేతులు మారుతున్నాయనే ఆరోపణలు గుప్పుమంటున్నాయి. స్థాయిని బట్టి అధికారులకు ప్రతినెలా ఠంచనుగా ముడుపులు అందడంతో నిర్ణీత వ్యవధిలో సామిల్లుల్లో జరపాల్సిన తనిఖీలు, ఇన్‌స్పెక్షన్లను అధికారులు మమ అనిపిస్తున్నారనే విమర్శలు గుప్పుమంటున్నాయి.  

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా