ఏడుపాయల అభివృద్ధికి కృషి

2 Apr, 2018 11:43 IST|Sakshi
ఘనపురం ఆనకట్టను పరిశీలిస్తున్న కలెక్టర్‌ 

 దుర్గమ్మను దర్శించుకున్న కలెక్టర్‌ ధర్మారెడ్డి

 జిల్లా దేవాదాయ శాఖపై సమీక్ష

 ప్లాస్టిక్‌ నిషేధించాలని  సిబ్బందికి ఆదేశం

 ఘనపురం   ప్రాజెక్ట్‌ పరిశీలించిన కలెక్టర్‌

  ఘనంగా సన్మానించిన ఆలయ చైర్మన్‌

పాపన్నపేట(మెదక్‌): తెలంగాణలో ప్రసిద్ధిగాంచిన ఏడుపాయల అభివృద్ధికి తనవంతు కృషి చేస్తానని కలెక్టర్‌ «ధర్మారెడ్డి ప్రకటించారు. ఆదివారం ఆయన మొదటి సారి ఏడుపాయలకు వచ్చి దుర్గమ్మ తల్లి దర్శనం చేసుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ పాలక వర్గ చైర్మన్‌ ఆలయ మర్యాదల ప్రకారం స్వాగతం పలికారు. అనంతరం వేద పండితులు శాస్త్రయుక్తంగా పూజలు నిర్వహించారు. అనంతరం ఆయన ఏడుపాయల పూర్వ చరిత్రను అడిగి తెలుసుకున్నారు.  చైర్మన్‌ విష్ణువర్దన్‌రెడ్డి ఆయనను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలోని దేవాదాయ శాఖ పరిధిలోని ఆలయాలు, వాటి ఆదాయ మార్గాలు, సిబ్బంది సంఖ్య, సేవలు, భక్తులకు మౌలిక సౌకర్యాల గురించి అడిగి తెలసుకున్నారు.
బకాయిలు చెల్లించాలి..
చైర్మన్‌ మాట్లాడుతూ ఏడుపాయలకు 12.5 ఎకరాల అటవీ భూమి అవసరమైనందున, ఈ మేరకు అటవీభూమిని కేటాయించాల్సిందిగా కోరారు. అయితే ఈ విషయమై అటవీ శాఖ అధికారులతో మాట్లాడుతానని కలెక్టర్‌ హామీ ఇచ్చారు. ఏడుపాయలకు ఏటా వచ్చే ఆదాయం, ఖర్చు, నగదు డిపాజిట్లు, చేపట్టిన మౌలిక సౌకర్యాల గురించి ఆరా తీశారు.   మొండి బకాయిలపై అవసరమైతే పోలీసు కేసులు నమోదు చేయించాలన్నారు.

ఏడుపాయల్లో పరిశుద్ధ్యాన్ని పరిరక్షించేందుకు ప్లాస్టిక్‌ నిషేధించాలని ఆదేశించారు. ఇందులో తడి, పొడి చెత్తను వేరువేరుగా సేకరించాలని సూచించారు. అనంతరం ఘనపురం ఆనకట్టను పరిశీలించారు.  ప్రాజెక్టు నిల్వ నీటి సామర్థ్యం, నీటి విడుదల తదితర విషయాలను  తెలసుకున్నారు.  కార్యక్రమంలో మెదక్‌ ఆర్డీఓ మెంచు నగేశ్, అసిస్టెంట్‌ కమిషనర్‌ కృష్ణ ప్రసాద్, ఈఓ వెంకట్‌ కిషన్‌రావు, డైరెక్టర్లు జ్యోతి అంజిరెడ్డి, దుర్గయ్య, నాగప్ప, నారాయణ, సంగప్ప, గౌరీ శంకర్, గౌరీశంకర్, సిబ్బంది రవికుమార్, శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.   
 

మరిన్ని వార్తలు