పని ఎక్కువ.. జీతం తక్కువ..

7 Mar, 2018 08:21 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

శాతవాహనయూనివర్సిటీ: ప్రైవేటు ఇంజినీరింగ్, డిగ్రీ కళాశాలల్లో పనిచేస్తున్న అధ్యాపకుల పరిస్థితి ఆగమ్యగోచరంగా మారుతోంది. పేరుగొప్ప ఊరు దిబ్బ అన్నట్లు తయారైంది.  చెప్పుకునేందుకు అసోసియేట్, అసిస్టెంట్‌ ప్రొఫెసర్లు, లెక్చరర్ల హోదా అయినా.. సమయానికి వేతనాలు అందని దుస్థితి. ‘వారికేం.. వేలల్లో సంపాదిస్తారు..’ అనే పేరు తప్ప.. నెల గడిచినా.. జీతం ఎప్పుడొస్తుందోనని ఎదురుచూపులు తప్పడం లేదు. ఫీజు బకాయిల సాకుతో యాజమాన్యాలు నెలల తరబడి వేతనాలు ఇవ్వకపోవడంతో కొందరికి ఇల్లు గడవడమే గగనమవుతోంది. ‘బాగా’నే ఇస్తున్నట్లు రికార్డుల్లో రాసుకుంటున్న యాజమాన్యాలు.. ఇచ్చేది మాత్రం అందులో 25శాతానికి మించడం లేదు. పరీక్షల్లో ఇన్విజిలేషన్‌ చేసినందుకు అధ్యాపకులకు ఇచ్చే రెమ్యునరేషన్‌ కూడా తీసుకుంటున్నారనే ఆరోపణలు ఉన్నాయి.  

నెలల తరబడి పెండింగ్‌
జిల్లాలో మొత్తం 15 ఇంజినీరింగ్‌ కళాశాలలున్నాయి. ఇందులో 13 ప్రైవేట్‌వే.. డిగ్రీ కళాశాలలు 129 ఉండగా 104 ప్రైవేట్‌వే.. వీటిలో మొత్తం 10వేలకుపైగా ఉద్యోగులుగా పనిచేస్తున్నారు. ఇంజినీరింగ్‌ కళాశాలల్లో కొన్నిమాత్రమే క్రమం తప్పకుండా అధ్యాపకులకు వేతనాలు ఇస్తున్నాయి. మిగితా వాటిలో రెండు, మూడునెలలపాటు  పెండింగ్‌లో ఉంటున్నట్లు తెలుస్తోంది. డిగ్రీలో 80 శాతం కళాశాలలు సమయానికి జీతాలివ్వడం లేదనే అపవాదు ఉంది. ఇంక్రిమెంట్ల విషయంలోనూ సరైన సమయానికి ఇవ్వకుండా శ్రమదోపిడీ చేస్తున్నాయని ఉద్యోగులు వాపోతున్నారు.

రికార్డుల్లో నాలుగురెట్లు
వేతనాలు సక్రమంగా చెల్లించని కొన్ని కళాశాలలు అధికారులు తనిఖీలకు వచ్చినప్పుడు మాత్రం ప్రతినెలా వేతనాలు చెల్లిస్తున్నట్లు రికార్డులు చూపిస్తున్నాయి. వేతనాలు తీసుకుంటున్నట్లు ఉద్యోగుల నుంచి సంతకాలు తీసుకుంటున్నాయి. సంతకం పెట్టకపోతే ఉద్యోగం పోతుందనే భయంతో ఎదురుప్రశ్నించలేకపోతున్నారు. రికార్డుల్లో చూపించే వేతనాలు మాత్రం వాస్తవంగా వారికి చెల్లించే వేతనాలతో పొల్చితే మూడు, నాలుగు రెట్లు ఉంటున్నాయి. ఈ మేరకు వేతనాల రిజిస్టర్లు సాధరణరోజుల్లో, అ«ధికారుల తనిఖీలకు సంబంధించి వేరువేరుగా నిర్వహిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఇంజినీరింగ్‌ కళాశాలల్లో కొన్ని మూడు నుంచి ఆర్నెల్లకోమారు మాత్రమే జీతాలు ఇస్తున్నట్లు తెలిసింది. ఒక కళాశాలకు చెందిన అధ్యాపకుడిని ఇంక్రిమెంట్లు వస్తాయా..? వేతనాలు నెలనెలా ఇస్తారా..? అని అడిగితే ‘ఇంక్రిమెంట్ల సంగతి దేవుడెరుగు.. వేతనాలు నెలనెలా ఇస్తే అదే మహాభాగ్యం అంటూ నిట్టూర్చాడు. 

రెమ్యూనరేషన్‌కూ ఎసరు
ఇంజినీరింగ్, డిగ్రీ కళాశాలల్లో సెమిస్టర్‌ పరీక్షలు నిర్వహించినప్పుడు.. ఇంటర్నల్‌ ప్రయోగపరీక్షలు నిర్వహించినప్పుడు అధ్యాపకులకు కొంత రెమ్యూనరేషన్‌ వస్తుంది. ఈ మొత్తాన్నీ ఇవ్వకుండా యాజమాన్యాలే మింగేస్తున్నాయని చర్చ అధ్యాపకుల్లో జరుగుతోంది. మరోవైపు రెమ్యూనరేషన్‌ ఇచ్చినట్లు సంతకాలు తీసుకుంటున్నట్లు సమాచారం. ఇలా ఏళ్ల తరబడి రెమ్యూనరేషన్‌ ఇవ్వకుండా ముఖం చాటేస్తున్న ప్రముఖ కళాశాలలు ఉన్నాయంటే అతిశయోక్తికాదు. తనిఖీ అధికారులు పరీక్షల విభాగం జోలికి వెళ్లడం లేదనే ఆరోపణలున్నాయి. ఫీజు రీయింబర్స్‌మెంట్‌ సమయానికి రావడం లేదన్న సాకుతో ఉద్యోగులకు నెలనెలా జీతాలివ్వడం లేదని తెలుస్తోంది.  
రెమ్యునరేషన్‌ ఇవ్వడం లేదు

–గోపాల్, లెక్చరర్‌
జిల్లా వ్యాప్తంగా పలు కళాశాలల్లో జీతాలు సరిగా ఇవ్వకపోవడంతో బతుకు బండి నడపడం చాలా ఇబ్బందిగా ఉంది. ఫీజు రీయింబర్స్‌మెంట్‌తో సంబంధం లేకుండా కళాశాల యాజమాన్యాలు జీతాలివ్వాలి. అలాగే ఇంటర్నల్, చివరి పరీక్షలకు సంబంధించిన రెమ్యూనరేషన్‌ వెంటనే చెల్లించాలి. 

మరిన్ని వార్తలు