పని ఎక్కువ...జీతం తక్కువ

12 Mar, 2018 08:15 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

సీఆర్పీల వేతన వెతలు.. ఉద్యోగ భద్రత కరువు 

విద్యాశాఖలో ఉపాధ్యాయులు, సిబ్బందితో సమానంగా పనిచేస్తున్న క్లస్టర్‌ రిసోర్స్‌ పర్స న్స్‌ (సీఆర్పీ)ను ప్రభుత్వం విస్మరిస్తోంది. మండల విద్యాశాఖాధికారుల పరిధిలో పనిచేసే సీఆర్పీలు రోజురోజుకూ పనిభారం పెరిగి తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు. స్కూల్‌ అసి స్టెంట్‌లతో సరిపోయే అర్హతలతో నియమితులైన సీఆర్పీలకు సమాన పనికి సమాన వేతనం అందని ద్రాక్షగానే మిగిలింది. డిగ్రీ, బీఎడ్, టెట్, పీజీ చేసిన వారు కూడా సీఆర్పీలుగా పనిచేస్తున్నా.. వారికి చాలీచాలని వేతనాలే అందుతున్నాయి. అరకొరగా ఇస్తున్న వేతనాలు రవాణా ఖర్చులకే సరిపోతుండడంతో జీవనోపాధికి నానాపాట్లు పడుతున్నారు.  
   –  సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట నుంచి ఎర్ర శ్రీనివాస్‌

సీఆర్పీ వ్యవస్థ ఏర్పడిందిలా..
గతంలో ప్రభుత్వ ఉపాధ్యాయులను రాత పరీక్ష ద్వారా ఎంపిక చేసి డిప్యూటేషన్‌పై ఎమ్మార్పీ (మండల రిసోర్స్‌ పర్సన్‌)లుగా నియమించే వారు. పాఠశాలలు దెబ్బతింటున్నాయనే ఉద్దే శంతో ఆ వ్యవస్థను రద్దు చేసి కాంట్రాక్ట్‌ విధా నంలో ఆరేళ్ల క్రితం (2012లో) సీఆర్పీ వ్యవస్థ ను రూపొందించింది ప్రభుత్వం. డీఎస్సీ కమిటీ ఇంటర్వూ్యలు నిర్వహించి, అందులో ఉత్తీర్ణత, రూల్‌ ఆఫ్‌ రిజర్వేషన్, రోస్టర్, మెరిట్‌ ప్రకారం సీఆర్పీలను నియమించారు. నియామక సమ యంలో రూ.5,500 వేతనం. అందులోనే టీఏ బిల్లు ఇచ్చేవారు. క్రమంగా.. 2013లో రూ. 7 వేలు,  2014లో 8,500 చెల్లించారు. ప్రస్తుతం  రూ.15వేలు చెల్లిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 2298 మంది సీఆర్పీలు పనిచేస్తున్నారు. 

ఇవీ డిమాండ్‌లు..:
ఉద్యోగ భద్రత కల్పించాలి.  వేతనం రూ. 28,940 స్కూల్‌ అసిస్టెంట్‌ పోస్టు కేటగిరి ప్రకారం ఇవ్వాలి. ఇన్సూరెన్స్, ఆరోగ్యకార్డులు, పీఎఫ్‌ వంటి సౌకర్యాలు కల్పించాలి. హెచ్‌ఆర్‌ పాలసీ అమలు చేయాలి. ఏడాదికి 22 సాధారణ సెలవులు ఇవ్వాలి. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు హక్కు కల్పించాలి. కేజీ నుంచి పీజీ విద్యలో భాగస్వాములను చేయాలి.

వేతన వ్యత్యాసం
వివిధ రాష్ట్రాలలో సీఆర్పీలకు ఇచ్చే వేతనాలకు, తెలంగాణ రాష్ట్రంలో ఇచ్చే వేతనాలకు వ్యత్యాసం భారీగా ఉంది. ఉత్తరాఖండ్‌లో రూ. 75 వేలు, గుజరాత్‌లో రూ. 55,640, హర్యానాలో రూ.54వేలు, తమిళ నాడులో రూ. 51 వేలు, హిమాచల్‌ప్రదేశ్‌లో రూ. 57,390, సిక్కింలో రూ. 60,500 చొప్పున చెల్లిస్తున్నారు. తెలంగాణలో అన్ని రాష్ట్రాల కంటే తక్కువగా వేతనం కేవలం రూ.15 వేలు మాత్రమే చెల్లిస్తున్నారు. 

ఇవీ సీఆర్పీల విధులు..

- సీఆర్పీలను స్కూల్‌ కాంప్లెక్స్‌లకు అనుసంధానించారు. ఒక్కో సీఆర్పీ దాదాపు 15 నుంచి 18 పాఠశాలలను పరిశీలించాల్సి ఉంటుంది. 
- ఏదో ఒక స్కూల్‌ను ప్రార్థన సమయంలో సందర్శించి ఉపాధ్యాయులు, విద్యార్థుల హాజరు నమోదు చేసుకొని వాట్సాప్‌లో అధికారులకు పంపాలి. 
- మండల వనరుల కేంద్రానికి, పాఠశాలలకు అనుసంధాన కర్తగా పని చేస్తూ సమాచారాన్ని అధికారులకు ఎప్పటికప్పుడు పంపుతూ ఉండాలి.
- ఏకోపాధ్యాయ పాఠశాలల్లో ఉపాధ్యాయుడు సెలవు పెడితే సీఆర్పీ విధులు నిర్వర్తించాలి.
- కాంప్లెక్స్‌ సమావేశాల నిర్వహణకు సహకరించాలి.
- సర్వశిక్షా అభియాన్‌తోపాటు ఇతర విద్యాశాఖ కార్యక్రమాలను చేపట్టాలి.
- మధ్యాహ్న భోజన పథకం అమలును పరిశీలించాలి. 
- బడి బయట పిల్లలను బడిలో చేర్పించడం, రెగ్యులర్‌గా రాని వారిని వచ్చేలా చేయడం వీరి విధి కూడా..
- పాఠశాలలో నిధుల వినియోగాన్ని సమీక్షించాలి.  
- క్లస్టర్‌ స్థాయిలో ఎగ్జిబిషన్‌ మేళాలు నిర్వహించడానికి స్కూల్‌ కాంప్లెక్స్‌ హెచ్‌ఎంలకు సహకరించాలి.
- వేసవి బడులను నిర్వహించాలి.

మరిన్ని వార్తలు