కొత్త ఏడాదిలో కొండపోచమ్మకు..

14 Nov, 2019 02:59 IST|Sakshi

డిసెంబర్‌ 25 నాటికి గజ్వేల్‌కు గోదావరి జలాలు

సీఎం ఆదేశాలతో తరలింపు పనులు వేగవంతం

మిడ్‌మానేరులో 15 టీఎంసీలు చేరగానే దిగువకు పంపింగ్‌

ప్యాకేజీ– 10, 11, 12లో పంపులు సిద్ధం చేసిన ఇంజనీర్లు

సాక్షి, హైదరాబాద్‌: కాళేశ్వరం ఎత్తిపోతల పథకం ద్వారా గోదావరి జలాల తరలింపులో మరో కీలక ఘట్టం ఆరంభం కానుంది. ఇప్పటి వరకు మిడ్‌మానేరుకు పరిమితమైన గోదావరి జలాలు దాని దిగువకు సైతం రానున్నాయి. ఈ నెలాఖరులోగానే మిడ్‌మానేరు నుంచి దాని దిగువన ఉన్న పంపుల ద్వారా కొండపోచమ్మ సాగర్‌ వరకు నీటిని ఎత్తిపోసే పనులు ప్రారంభం కానున్నాయి. అనంతగిరి, రంగనాయక్‌సాగర్‌ రిజర్వాయర్‌లను నింపుతూ, మల్లన్నసాగర్‌ ఫీడర్‌ చానల్‌ ద్వారా గోదావరి నీటిని గజ్వేల్‌ నియోజకవర్గంలోని కొండపోచమ్మ వరకు డిసెంబర్‌ ఆఖరు నాటికి తరలించాలని ఇప్పటికే సీఎం కేసీఆర్‌ ఆదేశించడంతో ఆ దిశగా పనులు ముమ్మరంగా జరుగుతున్నాయి.  

 కొత్త ఏడాదిలో గజ్వేల్‌లో జల జాతర..
మిడ్‌మానేరులో ఇప్పటికే నీటి నిల్వ చేయాల్సి ఉన్నా, రిజర్వాయర్‌ కట్ట నిర్మాణంలో కొంత సీపేజీలు ఉండటంతో వాటి మరమ్మతు పనులతో ఆలస్యమైంది. ఇప్పడు అవి కొలిక్కి రావడంతో దాన్ని నింపే ప్రక్రియ మొదలైంది. ప్రాజెక్టులో 25 టీఎంసీలకు గానూ ప్రస్తుతం 3.5 టీఎంసీల నిల్వ ఉంది. రోజుకు ఒక టీఎంసీ చొప్పున ఎగువ నుంచి పంపింగ్‌ చేస్తున్నారు. ప్రాజెక్టు 20 రోజుల్లో నిండే అవకాశం ఉంది. రిజర్వాయర్లో 15 టీఎంసీలు నీరు చేరగానే ప్యాకేజీ–10 నుంచి ఎత్తిపోతల ఆరంభం చేయాలని సీఎం ఆదేశించారు.

మిడ్‌మానేరు కింద కొండపోచమ్మ సాగర్‌ వరకు 50 కిలోమీటర్ల ప్రధాన కెనాల్‌ పరిధిలో ప్యాకేజీ–10, 11, 12, 13, 14 ప్యాకేజీలు ఉండగా, ఇవన్నీ యుద్ధ ప్రాతిపదికన జరుగుతున్నాయి. ప్యాకేజీ–10లో అప్రోచ్‌ చానల్, గ్రావిటీ కెనాల్‌ ఇతర నిర్మాణాలతో పాటు 7.65 కిలోమీటర్ల టన్నెల్‌ పనులు పూర్తయ్యాయి. ఇక్కడ 4 మోటార్లు అమర్చాల్సి ఉండగా అన్నీ పూర్తయ్యాయి. 3.5 టీఎంసీల అనంతగిరి రిజర్వాయర్‌ నిర్మాణం పూర్తయింది. ప్యాకేజీ–11లో అన్ని పను లు పూర్తవగా, 8.41 కిలోమీటర్ల టన్నెల్‌ పనులు, లైనింగ్‌ పనులు రికార్డు సమయంలో పూర్తి చేశారు. ఇక్కడ 4 మోటార్లలో అన్నీ సిధ్ధమయ్యాయి. 3 టీఎంసీల రంగనాయక్‌ సాగర్‌ రిజర్వాయర్‌ పని పూర్తయింది.

ప్యాకేజీ–12లో 16. 18 కిలోమీటర్ల టన్నెల్‌ పనులు పూర్తికాగా, 8 పంపుల్లో అన్నీ సిద్ధమైనా కొన్ని పనులను ఈ నెలాఖరుకి పూర్తి చేయనున్నారు. ఇదే ప్యాకేజీలో ఉన్న కొమరవెల్లి మల్లన్న సాగర్‌ పనులు ఇప్పుడే మొదలయ్యాయి. ఇక్కడ భూసేకరణ సమస్యగా ఉండటంతో రిజర్వాయర్‌ పనులు పూర్తి కాకున్నా 18 కిలోమీటర్ల మేర ఫీడర్‌ చానల్‌ ద్వారా 15 టీఎంసీల సామర్ధ్యంతో చేపడుతున్న కొండపోచమ్మ సాగర్‌ రిజర్వాయర్‌కు తరలించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. కనిష్టంగా 400 చెరువులు నింపేలా ప్రణాళిక పెట్టుకున్నారు.   

లిఫ్ట్‌ కోసం సిద్ధ్దమైన పంపులు
కాళేశ్వరం ప్రాజెక్టు మొదటి దశలో మేడిగడ్డ(లక్షి్మ), అన్నారం (సరస్వతి), సుందిళ్ల (పార్వతి) బ్యారేజీ, పంప్‌హౌస్‌ల నుంచి ఎత్తిపోసే గోదావరి నీళ్లు ఎల్లంపల్లి బ్యారేజీకి చేరతాయి. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్లలోని మోటార్ల ద్వారా రోజుకు 2 టీఎంసీల నీటిని ఎత్తిపోసేలా అంతా సిద్ధం చేసి ఉంచారు. సుందిళ్ల పంప్‌హౌస్‌లో మాత్రం ఒక్క పంపునకు డ్రైరన్‌ పూర్తవ్వగా, వెట్‌రన్‌ నిర్వహించాల్సి ఉంది. దాన్ని ఈ నెల చివరి వారంలో సిద్ధం చేయనున్నారు.

ఈ పనులు పూర్తయితే గోదావరి నీళ్లు ఎల్లంపల్లికి చేరతాయి. ఇక ఎల్లంపల్లి దిగువన ప్యాకేజీ–6, 7, 8 ఉండగా, వాటిలోని పంపులన్నీ సిద్ధమయ్యాయి. ఎల్లంపల్లి నుంచి మిడ్‌మానేరుకు నీటి తరలింపు ఆరంభమైంది. దీంతో మిడ్‌మానేరు నుంచి దాని కింద ఉన్న  30వేల ఎకరాల ఆయకట్టుకు నీటిని తరలించనున్నారు. అనంతరం ప్రాజెక్టులో నీటి నిల్వలు సుమారు 15 టీఎంసీలు చేరిన వెంటనే అక్కడి నుంచి దిగవకు పంపింగ్‌ ఆరంభించనున్నారు.

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా