బాధ్యతగా పనిచేయండి

15 Jun, 2016 23:55 IST|Sakshi

ఉపాధ్యాయులు విధులకు  సక్రమంగా హాజరుకావాలి
వైద్యులు లేని పీహెచ్‌సీలు ఉండకూడదు
నిరుపేదలకు రుణాలు ఇవ్వకుంటే  చర్యలు తప్పవు
ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి
వాడీవేడీగా ఐటీడీఏ 58వ పాలకమండలి సమావేశం

 

ఏటూరునాగారం : ‘‘ఏజెన్సీ పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులు మీటింగుల పేరిట ఐటీడీఏ చుట్టూ తిరుగుతూ బాతాకానీలు కొట్టొద్దు.. విధులకు సక్రమంగా హాజరై గిరిజన విద్యార్థుల కు మెరుగైన బోధనలు అందించాలి.. లేకుంటే కఠిన చర్యలు తీసుకుంటాం’’ అని డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి హెచ్చరించారు. కలెక్టర్, ఐటీడీఏ చైర్మన్ వాకాటి కరుణ అధ్యక్షతన బుధవారం మండల కేంద్రంలో గిరిజనాభివృద్ధి సంస్థ 58 పాలకమండలి సమావేశం వాడీవేడీగా జరిగింది. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం శ్రీహరి విద్యా, వైద్యం పనితీరుపై సుదీర్ఘంగా ప్రసంగించారు. ఏజెన్సీలో బడిబాటలో చేపట్టిన విద్యార్థుల ఎన్‌రోల్‌మెంట్ వివరాలు చెప్పాలని డీఈఓ రాజీవ్, డీడీ పోచంను కోరగా... వారు ఎలాంటి సమాధానం చెప్పలేదు. సమగ్రమైన సమాచారం లేకుండా సమావేశానికి ఎందుకు వస్తారని ఆయన వారిపై మండిపడ్డారు. అనంత రం డిప్యూటీ సీఎం మాట్లాడుతూ ఉపాధ్యాయులు, అధికారులు బాధ్యతగా పనిచేసి ఐటీడీఏ లక్ష్యాన్ని నెరవేర్చాలని ఆదేశించారు. కాగా, సమావేశంలో విద్య, వైద్యం, ఆర్‌ఓఎఫ్ ఆర్, హరితహారం, ఇంజినీరింగ్, ఈఎస్‌ఎస్ రుణాలపై డిప్యూటీ సీఎం శ్రీహరి, గిరిజన సంక్షేమశాఖ మంత్రి అజ్మీరా చందూలాల్, ఎంపీలు పసునూరి దయాకర్, అజ్మీరా సీతారాంనాయక్, ఎమ్మెల్యేలు రెడ్యానాయక్, బానోతు శంకర్‌నాయక్‌తోపాటు జెడ్పీ చైర్‌పర్సన్ జి. పద్మ చర్చించారు.

 

హరితహారంతో పచ్చదనాన్ని నింపాలి..
హరితహారం పథకంతో ఏజెన్సీలోని పల్లెలను పచ్చదనంతో నింపాలని కలెక్టర్ కరుణ సభ్యులను కోరారు. ఈ ఏడాది జిల్లాలో 3.50 కోట్లతో మొక్కలు నాటేందుకు ప్రణాళిక సిద్ధం చేశామన్నారు. లక్నవరం, మేడారం ప్రాంతాల్లో లక్ష మొక్కలు నాటుతున్నామని, వరంగల్ స్మృతివనానికి ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. డిప్యూటీ సీఎం శ్రీహరి మాట్లాడు తూ ప్రభుత్వం ఈ ఏడాది జిల్లాలోని ప్రతి ఒక్కరికి పండ్ల మొక్కలను ఉచితంగా అందజేస్తుందన్నారు. 2005 లోపు పోడు భూమిలో సాగు చేసుకుంటున్న రైతుల జోలికి ఎవ రూ వెళ్లవద్దని, 2005 తర్వాత పోడు చేసిన బడావ్యక్తులు, ఉద్యోగుల నుంచి భూముల ను స్వాధీనం చేసుకోవాలని డిప్యూటీ సీఎం డీఎఫ్‌ఓ కిషన్‌ను ఆదేశించారు. కాగా, మం త్రి చందూలాల్ మాట్లాడుతూ కొత్తగూడలో డీఎఫ్‌ఓ కిషన్ ఆగడాలు రోజురోజుకు మితి మీరిపోతున్నాయని ఆరోపించారు. దీనిపై డీఎఫ్‌ఓ కిషన్ మాట్లాడుతూ 2012-16లో 52 వేల హెక్టార్లలో పోడు నరికివేతకు గురైందన్నారు. సర్వాపురంలో 200, కామారం, పూనుగొండ్లలో 100 హెక్టార్ల అడవి పోడుకు గురైందని వివరించారు. అనంతరం డిప్యూటీ సీఎం మా ట్లాడుతూ జాయింట్ టీం ఏర్పాటు చేసి సమస్యాత్మకమైన మండలాల్లో పర్యటించి పోడు ఎందుకు జరుగుతుందనే విషయాన్ని తెలుసుకుని  పరిష్కరిం చాలని ఆదేశించారు. కాగా, 2013-14లో మంజూరైన పోస్టుమెట్రిక్ హాస్టళ్ల నిర్మాణానికి సంబంధించిన స్థలాల ఎంపిక ఇప్పటి వరకు పూర్తి కాకపోవడంపై డిప్యూటీ సీఎం.. ఈఈ కోటిరెడ్డిపై మండిపడ్డారు.


ఇదిలా ఉండగా, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు ప్రభుత్వం సబ్సిడీ రుణాలు మంజూరు చేస్తుంటే బ్యాంకు అధికారులు ఎందుకు ఇవ్వ డం లేదని డిప్యూటీ సీఎం.. ఎల్‌డీ బ్యాంకు మేనేజర్‌ను ప్రశ్నించారు. కాగా, తాడ్వాయి మండలంలోని కాటాంంలో ఉండాల్సిన బ్యాంకును పస్రాలో ఎందుకు ఏర్పాటు చేశార ని గిరిజన సంక్షేమశాఖ మంత్రి చందూలాల్ .. మేనేజర్‌ను ప్రశ్నించారు. ఈఎస్‌ఎస్ రుణాలు 1736 మందికి రూ. 12.74 కోట్లు ఇచ్చామని చెప్పడం తప్పా.. అవి ఇంతవరకు గ్రౌండింగ్ కాలేదని ఎమ్మెల్యే రెడ్యా నాయక్ సభ దృష్టికి తీసుకొచ్చారు. రుణాలు గ్రౌండింగ్ చేసే సమయంలో స్థానిక ఎమ్మెల్యేలను భాగస్వాములు చేయాలని డిప్యూటీ సీఎం.. కలెక్టర్‌ను ఆదేశించారు. ఏజెన్సీలోని విద్య, వైద్యంపై సమగ్ర సమీక్ష చేసేందుకు మరో మూడు నెలల్లో సమావేశం ఏర్పాటు చేయాలని డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి అధికారులకు సూచించారు. ఇదిలా ఉండగా, సమావేశం ప్రారంభంలో జెడ్పీ ఫ్లోర్‌లీడర్ సకినాల శోభన్, స్థానిక జెడ్పీటీసీలు మాట్లాడుతూ ములుగు నియోజకవర్గాన్ని సమ్మ క్క, సారలమ్మ పేరిట జిల్లాగా ఏర్పాటు చేయాలని కోరారు. సమావేశంలో ఐడీటీఏ పీఓ అమయ్‌కుమార్, ఆర్డీఓ మహేందర్‌జీ, ఎంపీపీలు, జెడ్పీటీసీ సభ్యులు, వివిధశాఖల అధికారులు పాల్గొన్నారు.

 

అక్రమాలు జరిగిన పనులకు ఆమోదం..!
ఐటీడీఏలోని వివిధ గ్రాంట్ల ద్వారా చేపట్టిన అభివృద్ధి పనుల్లో అక్రమాలు జరిగినట్లు ఆరోపణలు వచ్చినా వాటిపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంపై గిరిజన సంఘాల నాయకులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. కా గా, ఇలాంటి పనులకు వ్యయం చేసినట్లు పాలకమండ లి సమావేశంలో సభ్యులు ఆమోదం తెలుపడం దారు ణమని వారు వాపోయారు. ఐటీడీఏ సబ్‌ప్లాన్ పరిధిలోని మండలాల్లో ఉపాధిహామీలో వందల కోట్లతో మెటల్‌రోడ్లు నిర్మించారు. ఇవి పూర్తిగా నాసిరంగా ఉన్నాయని ఆయా గ్రామాల ప్రజలు అధికారులకు పలుమార్లు ఫిర్యాదు చేశారు. అయినప్పటికీ వాటిపై ఎలాంటి  విచారణ  చేపట్టలేదు. ఏజెన్సీ అభివృద్ధి పనుల్లో చోటుచేసుకున్న అవినీతిపై ఎలాంటి చర్చ లేకుండా సమావేశం ముగించడం గమనార్హం.

 
చర్చకు రాని అంశాలు..
మత్స్య, పట్టుపరిశ్రమ, ఎన్‌ఆర్‌జీఎస్, వ్యవసాయ, ఉద్యానవనశాఖలపై మంత్రులు, సభ్యులు చర్చించలేదు. గిరిజనుల అభివృద్ధి కోసం నెలకొల్పిన ఐటీడీఏ ద్వారా పై శాఖలను రూపొందించి వాటిద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా లబ్ధి చేకూర్చాలి. అయితే కొన్ని సం వత్సరాలుగా వాటి నిర్వహణను ఎవరూ పట్టించుకోకపోవడంతో శాఖలు పూర్తిగా నిర్వీర్యమవుతున్నాయని గిరిజన సంఘాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి.

 

మరిన్ని వార్తలు