డ్రగ్స్ మాఫియా చేతిలో మన కార్మికులు

30 Mar, 2015 00:33 IST|Sakshi
డ్రగ్స్ మాఫియూ చేతిలో మన కార్మికులు

ఇండియా నుంచి గల్ఫ్‌కు మందుల అక్రమ రవాణా
గుట్టుచప్పుడు కాకుండా   జోరుగా సాగుతున్న దందా

 
మోర్తాడ్: ఉపాధి కోసం పొట్ట చేత బట్టుకుని గల్ఫ్ బాట పట్టిన తెలంగాణ కార్మికులకు అదనపు ఆదాయం ఆశ చూపుతూ డ్రగ్స్ మాఫియా తమ గుప్పిట్లో పెట్టుకుంటోంది. అలా వారి చేతుల్లో చిక్కుకున్న కార్మికులు పోలీసులకు చిక్కుతున్నారు. ఇటీవల నిజామాబాద్ జిల్లా మోర్తాడ్, బాల్కొం డకు చెందిన ఇద్దరు ఇలాగే దుబాయ్ పోలీసులకు చిక్కారు. వారిని అక్కడి జైలుకు పంపినట్టు సమాచారం. కామారెడ్డి కేంద్రంగా బంగ్లాదేశ్‌కు సాగిన పెన్సిడిల్ మందు అక్రమ రవాణా సంఘటనను మరచిపోకముందే ఈ ఘటన వెలుగు చూసింది. గతంలోనూ కమ్మర్‌పల్లికి చెందిన ఒక యువకుడి వద్ద గల్ఫ్‌లో నిషేధించిన మందులు లభించడంతో అతన్ని దుబాయ్ పోలీసులు అరెస్టు చేశారు. ఇండియా నుంచి ఉపాధి కోసం వచ్చే కార్మికులతో గల్ఫ్‌లో నిషేధించిన మందులను పార్శిల్ రూపంలో డ్రగ్స్ మాఫియా రవాణా చేయిస్తోంది.

మందుల పార్శిల్ తెచ్చిన కార్మికులకు నజరానా ఇస్తుంది. ఇలా తెచ్చిన మందులను మాఫియా గల్ఫ్‌లో ఎక్కువ ధరకు విక్రయిస్తుందనే విషయం ప్రచారంలో ఉన్నా, వాస్తవానికి మందులను వేరే విధంగా వినియోగిస్తారని కూడా అంటున్నారు. గల్ఫ్ పోలీసులకు ఇటీవల చిక్కిన మోర్తాడ్, బాల్కొండ వ్యక్తులతోపాటు జిల్లాకు చెందిన దాదాపు మరో 15 మంది మాఫియా చేతిలో కీలు బొమ్మలుగా మారి జైలుకు వెళ్లినట్టు తెలిసింది. గల్ఫ్‌కు వెళ్లే కార్మికులు  ఈ అక్రమ దందాలో చిక్కుకోకుండా  ప్రభుత్వం చర్యలు చేపట్టాలి.
 

మరిన్ని వార్తలు