-

‘ఉపాధి’ ఊసేది!

27 Jun, 2019 12:31 IST|Sakshi

పనులు లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న కూలీలు

వర్షాలు లేక వలసబాట

సాక్షి, ధరూరు: వలసలను నివారించి ఉన్న ఊళ్లోనే ఉపాధి పనులు కల్పించాలనే సంకల్పంతో ప్రారంభమైన జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పనులు ఆ శాఖ అధికారులు తీరు కారణంగా నీరుగారిపోతోంది. నియోజకవర్గంలోని నాలుగు మండలాల్లో ఉపాధి హామీ పనులు జోరుగా సాగుతుండగా.. మండలంలో మాత్రం పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. ముందు నుంచి ఆ శాఖ అధికారులు మండలంలో కూలీలకు పనులు కల్పించడంలో నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారు. అసలే వర్షాలు లేక ఇళ్ల ఉంటున్నామని, దీంతో జీవనోపాధికి ఇబ్బందిగా ఉందని ఉపాధి పనులు ప్రారంభించాలని అధికారులను కోరుతున్నా పట్టించుకోవడం లేదని ఆయా గ్రామాల ఉపాధి కూలీలు ఆరోపిస్తున్నారు. 

మండలంలో ఇదీ పరిస్థితి...
మండలంలో మొత్తం 28 పంచాయతీలకు గాను 18 వేల జాబ్‌ కార్డులు ఉన్నాయి. గ్రామాల్లో నామమాత్రంగా పనులు కల్పింస్తున్నారు. కూలీలకు పూర్తిస్థాయిలో పనులు కల్పించాలనే ఆలోచన కలగడం లే దు. 28 పంచాయతీలకు గాను దాదాపు స గం గ్రా మాల్లో పనులు జరగడం లేదు. పనులు కల్పించాలని ఉపాధి ఏపీఓను, ఫీల్డ్‌ అసిస్టెంట్లను కోరుతున్నా.. పట్టించుకోవడం లేదనే ఆరోపణలు ఉన్నా యి. వర్షాలు కురవకపోవడంతో కూలీలు ఇళ్లలో ఉంటున్నారు. కనీసం ఉపాధి పనులైనా కల్పిస్తే జీవనం గడుస్తుందని కూలీలు భావిస్తున్నారు. 

కలెక్టర్‌ను కలిసేందుకు.. 
ఉపాధి పనులు ప్రారంభించాలని రెండు నెలలుగా ఈజీఎస్‌ అధికారులను కోరుతున్నా.. ప్రారంభం చేయడం లేదని కోతులగిద్ద, అల్వాలపాడు, మైలగడ్డ గ్రామాల కూలీలు ఆరోపిస్తున్నారు. వర్షాలు లేక పనులు దొరక్క ఇబ్బందులు పడుతున్నామని పలుమార్లు, ఈజీఎస్‌ ఏపీఓ అనిల్, ఎంపీడీఓ జబ్రాను కోరుతున్నా వారి నుంచి ఎలాంటి స్పందన రావడం లేదని ఆరోపిస్తున్నారు. రేపు మాపు అంటూ పబ్బం గడుపుతున్న అధికారుల తీరును నిరసిస్తూ.. జిల్లా కేంద్రంలో నిర్వహించే ప్రజావాణిలో కలెక్టర్‌ను కలిసి తమ గోడును చెబుతామని కూలీలు వాపోతున్నారు.

ఎమ్మెల్యే హెచ్చరించినా..
గత నెలలో జరిగిన మండల సర్వసభ్య సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి ఉపాధి అధికారుల తీరుపై అసహనం వ్యక్తం చేశారు. పనులు కల్పించకపోతే ఎదురయ్యే పరిణామాలకు తాము బాధ్యులం కాదని హెచ్చరించినా.. వారిలో మార్పు రావడం లేదు. కార్యాలయానికి వచ్చి కేవలం హాజరు వేసుకుని వెళ్తున్న ఆ శాఖ అధికారులకు నిద్ర మత్తు వీడడం లేదని మండల ప్రజలు ఆరోపిస్తున్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో.. వరుస ఎన్నికల నేపధ్యంలో కేవలం ఉపాధి శాఖలో మాత్రమే నిధులు ఉన్నాయని, కొన్ని వందల రకాల పనులు కల్పించే అవకాశాలు ఉన్నా.. ఎందుకు పనులు కల్పించడం లేదో అర్థం కావడంలేదని వారి తీరుపై సభలోనే ఎమ్మెల్యే గట్టిగా హెచ్చరించారు. కానీ ఈజీఎస్‌ అధికారులు మాత్రం పాత పద్ధతినే అవలంభిస్తున్నారు.

అధికారులు పట్టించుకోవడం లేదు 
నెల రోజులుగా ఉపాధి కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నా పట్టించుకోవడం లేదు. రేపు మాపు అంటూ కాలయాపన చేస్తున్నారు. గ్రామంలో పనులు లేక జీవనోపాధికి ఇబ్బందిరంగా ఉంది. ఈసారి వర్షాలు కురవలేదు. మున్ముందు ఇంకెన్ని ఇబ్బందులు పడాలో తెలియడం లేదు. ప్రజావాణిలో కలెక్టర్‌ను కలిసి గోడును వెళ్లబోసుకోవాలనుకుంటున్నాం. 
– సారంబండ వెంకటేష్, కోతులగిద్ద  

మరిన్ని వార్తలు