బతుకు చేదు!

15 Apr, 2017 03:11 IST|Sakshi
బతుకు చేదు!

- తేలని నిజాం షుగర్స్‌ భవితవ్యం
- లేఆఫ్‌తో ఉపాధి కోల్పోయిన కార్మికులు
- చెప్పులు కుడుతూ.. కూలికెళ్తూ..
- స్వాధీనం హామీని విస్మరించిన సీఎం కేసీఆర్‌
- 17న బోధన్‌లో పాదయాత్ర, బహిరంగ సభ


చెప్పులు కుడుతున్న ఇతని పేరు వి.సాయిలు. నిజాం షుగర్‌ ఫ్యాక్టరీలో పర్మినెంట్‌ కార్మికుడు. భార్య లక్ష్మి, కూతురు, కుమారునితో చింత లేకుండా జీవితం గడిచిపోయేది. అయితే ఫ్యాక్టరీకి లేఆఫ్‌ ప్రకటించి మూసేయడం.. సాయిలు జీవితాన్ని తలకిందులు చేసింది. ఒకవైపు ఫ్యాక్టరీ మూతపడటంతో ఏ దారీ లేక కుల వృత్తి అయిన మోచీ పనినే మళ్లీ మొదలుపెట్టాడు. బోధన్‌ ఆర్టీసీ కొత్త బస్టాండ్‌లో చెప్పులు కుడుతూ.. పాలిష్‌ చేస్తూ.. ఆ వచ్చే కాస్త డబ్బుతోనే కుటుంబాన్ని పోషించుకోవాల్సిన దుస్థితి సాయిలుది.

ఇతని పేరు ఈరవేణి సత్యనారాయణ. నిజాం షుగర్‌ ఫ్యాక్టరీలో ఎలక్ట్రిషియన్‌ విభాగంలో టర్బన్‌ ఆపరేటర్‌గా పనిచేసేవాడు. కానీ ఫ్యాక్టరీకి లేఆఫ్‌ ప్రకటిచడంతో వేతనం ఆగిపోయి.. కుటుంబ పోషణ భారంగా మారింది. నెల క్రితం వరకూ బోధన్‌లోని ఓ సినిమా «థియేటర్‌లో గేట్‌ కీపర్‌గా రోజుకు రూ.115 కూలీ పనిచేసేవాడు. ఉదయం 10.30 గంటల నుంచి రాత్రి 11 వరకు డ్యూటీ చేయాల్సి రావడంతో అక్కడ మానేసి ఓ వాటర్‌ ప్లాంట్‌లో పనికి చేరాడు. రోజుకు వంద కూలీ ఇస్తున్నారు. కూలీ పనికి పోతేనే కుటుంబం గడిచే పరిస్థితి కావడంతో ఆ వంద కోసం రోజంతా చెమటోడుస్తున్నాడు.

బోధన్‌: నిజామాబాద్‌ జిల్లా బోధన్‌లో నిజాం షుగర్‌ ఫ్యాక్టరీ(ఎన్‌ఎస్‌ఎఫ్‌) భవితవ్యం ఎటూ తేలకపోవడంతో కార్మికుల బతుకులు చేదెక్కుతున్నాయి. ఈ ఫ్యాక్టరీని 1938లో నిజాం పాలకులు నెలకొల్పారు. ఫ్యాక్టరీ ఆవిర్భావంతో ఈ ప్రాంతమంతా చెరకు తోటలతో పచ్చదనం వెల్లివిరిసింది. చెరకు రైతులు, కార్మికుల కుటుంబాలు సంతోషంగా జీవనం సాగించాయి. ఆసియా ఖండంలోనే అతిపెద్ద వ్యవసాయ ఆధారిత పరిశ్రమగా ఈ ఫ్యాక్టరీ ఎదిగింది. ఇదంతా గత వైభవం. ఫ్యాక్టరీ టీడీపీ హయాంలో ప్రైవేటుపరం కాగా, తదనంతర పరిణామాల్లో యాజమాన్యం లేఆఫ్‌ ప్రకటించడంతో రైతులు, కార్మికుల జీవితాలు ఛిద్రమయ్యాయి. పచ్చని చెరకు తోటలు కనుమరుగయ్యాయి.

ప్రైవేటీకరించిన చంద్రబాబు సర్కారు
నిజాం షుగర్‌ ఫ్యాక్టరీని 2002లో అప్పటి చంద్రబాబు ప్రభుత్వం, ప్రైవేట్‌ కంపెనీకి భాగస్వామ్యం కల్పించి జాయింట్‌ వెంచర్‌ పేరుతో ప్రైవేటీకరించారు. దీంతో ఫ్యాక్టరీ నిజాం దక్కన్‌ షుగర్స్‌ లిమిటెడ్‌ (ఎన్‌డీఎస్‌ఎల్‌)గా రూపాంతరం చెందింది. 2015 డిసెంబర్‌ 23న ఎన్‌డీఎస్‌ఎల్‌ యాజ మాన్యం లేఆఫ్‌ ప్రకటించింది. బోధన్‌తో పాటు ప్రస్తుత జగిత్యాల జిల్లా ముత్యంపేట, వికారాబాద్‌ జిల్లాలోని ముంబోజిపల్లి యూనిట్లకు కూడా దీనిని వర్తింప చేసింది. దీంతో 305 మంది కార్మికులు రోడ్డున పడ్డారు. లేఆఫ్‌తో 2015–16, 2016–17 క్రషింగ్‌ సీజన్‌ కూడా నిలిచిపోయింది. దీంతో ఉద్యోగ భద్రత కల్పించాలని, బకాయి వేతనాలు చెల్లించాలని కార్మికులు పలువురు మంత్రులను వేడుకోగా.. బకాయి వేతనాలు చెల్లిస్తామని హామీ ఇచ్చారు. అయితే 16 నెలలు గడుస్తున్నా వేతనాలు అందలేదు. 3 ఫ్యాక్టరీల కార్మికులకు రూ.8 కోట్ల వరకు బకాయి వేతనాలు రావాల్సి ఉంది.

సీఎం కేసీఆర్‌ హామీ..
అధికారం చేపట్టిన వెంటనే ఫ్యాక్టరీని స్వాధీనం చేసుకుని ప్రభుత్వ హయాంలో నడుపుతామని కేసీఆర్‌ ఎన్నికల సందర్భంగా హామీ ఇచ్చారు. టీఆర్‌ఎస్‌ అధికారం చేపట్టి మూడేళ్లవుతున్నా ఈ హామీ నెరవేరలేదు. ఫ్యాక్టరీని ప్రభుత్వం నడపటం సాధ్యం కాదని, మహారాష్ట్ర తరహాలో సహకార రంగంలో రైతులు ముందుకు వస్తే ఆధునీకరించి ఫ్యాక్టరీని అప్పగిస్తామని కేసీఆర్‌ అసెంబ్లీలో ప్రకటించినా.. ఇప్పటివరకు విధివిధానాలు ప్రకటించలేదు.

17న బోధన్‌లో పాదయాత్ర..
ఎన్‌డీఎస్‌ఎల్‌ను స్వాధీనం చేసుకుని ప్రభుత్వమే నడపాలని, లేఆఫ్‌ ఎత్తివేసి వెంటనే పునరుద్ధరించాలని, కార్మికులకు బకాయి వేతనాలు చెల్లించి ఆదుకోవాలనే డిమాండ్లతో నిజాం షుగర్స్‌ రక్షణ కమిటీ, అఖిలపక్ష పార్టీలు ఏడాదిగా ఆందోళనలు సాగిస్తున్నాయి. టీజేఏసీ, నిజాంషుగర్స్‌ రక్షణ కమిటీ, అఖిల పక్షం ఆధ్వర్యంలో ఈ నెల 17న పాదయాత్ర, బహిరంగ సభ తలపెట్టారు. ఈ కార్యక్రమానికి టీజేఏసీ చైర్మన్‌ ప్రొఫెసర్‌ కోదండరాం హాజరుకానున్నారు.

మరిన్ని వార్తలు