కదంతొక్కిన ‘పామాయిల్’ కార్మికులు

4 Jun, 2014 01:24 IST|Sakshi

అశ్వారావుపేట, న్యూస్‌లైన్: ఆయిల్‌ఫెడ్ ప్రభుత్వరంగ సంస్థకు చెందిన అశ్వారావుపేట పామాయిల్ పరిశ్రమలో జరిగిన అవకతవకలపై కార్మికులు కదంతొక్కారు. ఫ్యాక్టరీ ఎదుట మంగళవారం ఆందోళన నిర్వహించారు. వారికి వైఎస్‌ఆర్‌సీపీ తెలంగాణ రాష్ట్ర శాసనసభ పక్షనేత తాటి వెంకటేశ్వర్లు అండగా నిలిచారు. కాంట్రాక్టు కార్మికుల రెక్కల కష్టాన్ని దోచుకున్న వారి నుంచి తిన్నదంతా క క్కిస్తానని కార్మికులకు మద్దతుగా ఫ్యాక్టరీ ఎదుట బైఠాయించారు. కార్మికులకు న్యాయం జరిగే వరకు పోరాడుతానన్నారు. అశ్వారావుపేటలో సమస్య పరిష్కారం కాకపోతే హైదరాబాదులోని ఆయిల్‌ఫెడ్ ప్రధాన  కార్యాలయానికి కార్మికులకు తన సొంత ఖర్చులతో తీసుకెళ్లి ఆయిల్‌ఫెడ్ ఎండీతో మాట్లాడిస్తానన్నారు.

కార్మికుల కష్టార్జితం నుంచి మినహాయించుకున్న ప్రావిడెంట్‌ఫండ్(పీఎఫ్) సొమ్మును అణా పైసతో సహా తిరిగి ఇప్పిస్తానని హామీ ఇచ్చారు. ఫ్యాక్టరీలో పనిచేస్తున్న తమ పీఎఫ్ సొమ్మును కాంట్రాక్టర్లు దోచుకున్నారని ఫ్యాక్టరీ మేనేజర్ చంద్రశేఖరరెడ్డికి కార్మికులు వారం రోజుల క్రితం ఫిర్యాదు చేశారు. తమకు ఫీఎఫ్ డబ్బు ఒక్కపైస కూడా అందలేని ఆరోపించారు. ఇదే విషయాన్ని కార్మికులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు. పీఎఫ్ కార్యాలయం నుంచి కార్మికులు సాధించిన కొన్ని కీలకపత్రాలను మేనేజర్ చంద్రశేఖరరెడ్డికి తాటి అందజేశారు. పీఎఫ్ సొమ్ము ఇప్పించాలని కోరారు. ఫోర్‌మన్ విల్సన్‌రాజుపై దాడి చేసిన పాతకాంట్రాక్టర్ కుమారుడు మధుపై చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

 ఏడేళ్ల పీఎఫ్ చెల్లించాలి..
 2007లో అశ్వారావుపేటలో పామాయిల్ ఫ్యాక్టరీ ప్రారంభించినప్పటి నుంచి పనిచేసిన కార్మికులకు పీఎఫ్ సొమ్ము చెల్లించాలని కార్మికులు డిమాండ్ చేశారు. ఫోర్‌మన్ దాడిచేసిన దుండగులను అరెస్ట్ చేయాలని, విల్సన్‌రాజుపై బనాయించిన కేసును ఎత్తివేయాలని ని నాదాలు చేశారు. ఫ్యాక్టరీలో పనిచేస్తున్న కార్మికులను కాంట్రాక్టర్‌లు ఇచ్చినంత తీసుకుంటే ఉంచుతున్నారని, హక్కులపై ప్రశ్నిస్తే పనిలోనుంచి తీసేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పాత కాంట్రాక్టర్ కుమారుడు మధుకు అనుకూలంగా ఉన్నవారే ఫ్యాక్టరీలో ఉద్యోగం చే యాలని, అతని మాట వినకున్నా, చెప్పిన ట్టు చేయకపోయినా, అధికారులను బదిలీ చేయిస్తాడని కార్మికులు ఆరోపిస్తున్నారు. ఇందులో భాగంగానే విల్సన్ రాజును రౌడీలతో కొట్టించాడని అన్నారు. కార్మికుల ప్రశ్నలకు ఏమీ సమాధానం చెప్పాలో తెలియక మేనేజర్ చంద్రశేఖర్‌రెడ్డి మౌనంగా ఉండిపోయారు.

 తిన్నదంతా కక్కిస్తా: ఎమ్మెల్యే తాటి
  కార్మికులు, విల్సన్‌రాజు సమస్యలను విన్న ఎమ్మెల్యే ఫ్యాక్టరీ మేనేజర్ చంద్రశేఖర్‌రెడ్డి, డివిజనల్ అధికారి రమేష్‌కుమార్‌రెడ్డిలపై ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘రోజుకూలీ చేసుకునే వారిని మీ ఇష్టం వచ్చినట్లు దోచుకుంటూ పోతే ఊరుకునేదిలేదు. ఇంతకుముందు ఇక్కడ ఎవరున్నారో నాకు అనవసరం. ఈ ప్రజలు నన్ను నమ్మారు. నా ప్రజలను ఎవరు అన్యాయం చేసినా ఊరుకోను. కార్మికుల సొమ్ములు ఎవరెంత తిన్నారో అణాపైసాలతో సహా కక్కిస్తా.. కాంట్రాక్టర్లకు సహకరించిన అధికారులను వదిలిపెట్టేది లేదు.

 మీరు (మేనేజర్‌ను ఉద్దేశించి) ఎన్నిసార్లు సస్పెండ్ అయినా మళ్లీ అశ్వారావుపేటకే  ఎందుకు వస్తున్నారు..? ఆయిల్‌ఫెడ్‌లో మీకు ఎక్కడా ఉద్యోగం లేదా..? దేశంలో ఎన్నో ప్రభుత్వ ఫ్యాక్టరీలు ఉండగా.. ఎప్పుడూ అశ్వారావుపేట పామాయిల్ ఫ్యాక్టరీనే ఎందుకు వార్తల్లోకెక్కుతుంది..? మీరు ఇక్కడ ఎందుకోసం ఉంటున్నారో నాకు తెలుసు.. అంతా కక్కిస్తా.. మీ వైఖరి మార్చుకోకుంటే చాలా ఇబ్బంది పడతారు. ప్రతి నెల కాంట్రాక్టర్‌కు బిల్లులు చెల్లించేటపుడు పీఎఫ్ చెల్లింపును ఎందుకు పరిశీలిచడంలేదు.  కార్మికులకు పీఎఫ్ సొమ్ము తిరిగి ఇప్పించేంత వరకు ఇక్కడే కూ ర్చుంటాను’ అంటూ తాటి ఫ్యాక్టరీ గేటు ఎదుట బైఠాయించారు. ఫ్యాక్టరీలో ఆయిల్ రికవరీని త క్కువగా చూపుతూ ప్రైవేటు కంపెనీలతో కు మ్మక్కై రైతులకు అన్యాయం చేస్తున్న సంగతి తన దృష్టికి వచ్చిందన్నారు.  దీనిపై పూర్తిగా అధ్యయనం చేసి బాధ్యులపై చర్యలకు ప్రభుత్వాన్ని కోరతానన్నారు.

 రైతులు పండించే పామాయిల్ కు పూర్తి మద్దతు ధర సాధించడం తన లక్ష్యమన్నారు. హైదరాబాదులోని ప్రధాన కార్యాలయం నుంచి ఏ కార్మికునికి ఎంత పీఎఫ్ సొమ్ము అం దాలో లెక్కలతో సహా నెల రోజులలోపు వివరం గా తెలియజేస్తామని మేనేజర్ లిఖితపూర్వకంగా హామీ ఇవ్వడంతో ఎమ్మెల్యే ఆందోళన విరమించారు.

  ఈ ఆందోళనకు వైఎస్‌ఆర్‌సీపీ, టీడీపీ, టీఆర్‌ఎస్ నాయకులు మద్దతు తెలిపారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ కూడా అక్కడి వచ్చి కార్మికుల సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తానన్నారు. నారాయణ వెంట ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి సింగు నర్సింహరావు, సీపీఐ జిల్లా కార్యదర్శి బాగం హేమంతరావు ఉన్నారు. సంఘీభావం తెలిపిన వారిలో జెడ్పీటీసీ అంకత మల్లికార్జునరావు, ఆయిల్‌ఫాం రైతు సంఘం రాష్ట్ర నాయకులు మలిరెడ్డి పూర్ణచంద్రారెడ్డి, వైఎస్సార్‌సీపీ నాయకులు జూపల్లి రమేష్‌బాబు, జూపల్లి ప్రమోద్, నండ్రు రమేష్‌బాబు, టీడీపీ నాయకులు ఆలపాటి రామ్మోహనరావు, బండి పుల్లారావు, సీపీఎం నాయకులు బుడితి చిరంజీవి నాయుడు, టీఆర్‌ఎస్ నాయకులు కోటగిరి సీతారామస్వామి, జూపల్లి కోదండ వెంకటరమణారావు, చంటిబాబు  ఉన్నారు.

మరిన్ని వార్తలు