ఎన్‌డీఎస్‌ఎల్‌లో సమ్మెకు సిద్ధం

15 Nov, 2014 04:49 IST|Sakshi

బోధన్ : కార్మికుల వేతన సవరణ మూడేళ్లకొకసారి జరుగుతోంది. ఎన్‌డీఎస్‌ఎల్‌లో 2010లో వేతన సవరణ జరుగగా, 2013 సెప్టెంబర్ 30తో ముగిసింది. 2013 అక్టోబర్1 నుంచి కొత్త వేతన సవరణ జరుగాల్సి ఉండగా, ఇప్పటి వరకు పెండింగ్‌లో ఉంది. 2013-14 క్రషింగ్ సీజన్ ప్రారంభంలో కార్మిక సంఘాలు 2013 నవంబర్18న ఫ్యాక్టరీ అధికారులకు వేతన సవరణ చేపట్టాలని సమ్మె నోటీసు ఇచ్చాయి. అయితే ఫ్యాక్టరీ యాజమాన్యం స్పందించక పోవడంతో అప్పట్లో చర్చలు సఫలం కాలేదు.

 సమ్మె వల్ల తాము ఇబ్బందులు ఎదుర్కొంటామని రైతులు కోరగా కార్మిక సంఘాలు వెనక్కు తగ్గాయి. ఈ సందర్భంగా ఫ్యాక్టరీ యాజమాన్యం క్రషింగ్ సీజన్ ముగియగానే వేతన సవరణ పై చర్చలు జరుపుతామని, వేతన సవరణకు చర్యలు తీసుకుంటామని రాత పూర్వకంగా హామీ ఇచ్చిందని కార్మిక సంఘాల ప్రతినిధులు అంటున్నారు. కాగా ఆ తర్వాత వేతన సవరణ అంశం మూలపడింది. ఫ్యాక్టరీ యాజమాన్యం పట్టించుకోలేదు. కార్మిక సంఘాలు కార్మిక శాఖ అధికారుల దృష్టికి తీసుకెళ్లినప్పటికీ ఫలితం దక్కలేదు. ఎన్‌డీఎస్‌ఎల్‌లో 125 మంది వరకు పర్మినెంట్ కార్మికులు, సీజనల్ పర్మినెంట్ కార్మికులు 60 మంది వరకు ఉంటారు.

పర్మినెంట్ కార్మికులకు నెలకు రూ. 15 వేల నుంచి రూ. 16 వేల వరకు వేతనం ఉంటుంది. దీనిపై 50 శాతం పెంచాలని కార్మిక సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. వీరి డిమాండ్‌ను ఫ్యాక్టరీ యాజమాన్యం అంగీకరించే స్థితిలో లేదు. ప్రస్తుతం ఫ్యాక్టరీ యాజమాన్యం వేతన సవరణకు సానుకూలతతో లేదని కార్మిక సంఘాలు ఆరోపిస్తున్నాయి. గత్యంతరం లేని పరిస్థితిలో సమ్మె నోటీసు ఇచ్చామంటున్నారు. వేతన సవరణతో పాటు 15 శాతం హెచ్‌ఆర్‌ఏ పెంచాలని, ఇంక్రిమెంట్‌ను కనీసం రూ. 500 చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు.

వేతన సవరణ ఒప్పందం ముగిసి ఏడాది పైగా కావస్తున్నా ఫ్యాక్టరీ యాజమాన్యం స్పందించడం లేదని కార్మిక సంఘాలు మండి పడుతున్నాయి. 2014-15 క్రషింగ్ ప్రారంభానికి ఫ్యాక్టరీ యాజమాన్యం ఏర్పాట్లు చేస్తోంది. ఈ సందర్భంలో యాజమాన్యంపై ఒత్తిడి పెంచి వేతన సవరణ సాధించుకోవాలని కార్మిక సంఘాలు సమ్మె యోచనలో ఉన్నాయి. ఈ మేరకు ఎన్‌డీఎస్‌ఎల్ కార్మిక సంఘాలు శుక్రవారం యాజమాన్యానికి సమ్మె నోటీసు అందించాయి.

వేతన సవరణతో పాటు మరో 40 డిమాండ్ల పరిష్కరించాలని కార్మిక సంఘాలు కోరుతున్నాయి. ఎన్‌డీఎస్‌ఎల్ స్టాఫ్ అండ్ వర్కర్స్ యూనియన్(సీఐటీయూ),ఎన్‌డీఎస్‌ఎల్ ఎంప్లాయీస్ యూనియన్(బీఎంఎస్) సుగర్‌ఫ్యాక్టరీ మజ్దూర్ సభ ప్రతినిధులు ఫ్యాక్టరీ వైస్ ప్రెసిడెంట్ జానకీ మనోహర్‌కు సమ్మె నోటీసు అందించారు. డిసెంబర్ 5 లోపు వేతన సవరణతో పాటు ఇతర డిమాండ్లను పరిష్కరించక పోతే సమ్మె చేపడుతామని హెచ్చరించారు. ఫ్యాక్టరీ యాజమాన్యం మాత్రం స్పష్టత ఇవ్వడం లేదు.

 కార్మికుల బతుకులు దయనీయం
 ప్రభుత్వ రంగ సంస్థలో ఉన్న నిజాం షుగర్ ఫ్యాక్టరీని 2002 సంవత్సరంలో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 51 శాతం ప్రైవేట్, 49 శాతం ప్రభుత్వ వాటాలతో ప్రైవేటీకరించారు. రూ. 350 కోట్ల నిజాంషుగర్స్‌ను ప్రైవేట్ సంస్థకు అప్పగించారు. ఫ్యాక్టరీ ప్రైవేట్ సంస్థ గుప్పెట్లోకి వెళ్లిన తర్వాత వీఆర్‌ఎస్ పేరుతో వందలాది మంది కార్మికులు తొలగించబడ్డారు. ప్రస్తుతం పని చేస్తున్న కార్మికుల బతుకులు దయనీయంగా మారాయి. ఇటు కార్మికులు,అటు రైతులు ఇబ్బందుల పాలైయ్యారు.

 ఫ్యాక్టరీ యాజమాన్యం సానుకూలంగా స్పందించాలి
 ఫ్యాక్టరీ యాజమాన్యం వేతన సవరణ, ఇతర డిమాండల పై సానుకూలంగా స్పందించాలని సీఐటీయూ అనుబంధ ఎన్‌డీఎస్‌ఎల్ స్టాఫ్ అండ్ వర్కర్స్ యూనియన్ ప్రధాన కార్యదర్శి కుమార్ స్వామి డిమాండ్ చేశారు. కార్మికుల సంక్షేమం యాజమాన్యం బాధ్యతని అన్నారు. యాజమాన్యం దిగిరాకపోతే సమ్మెకు చేపడుతామని తెలిపారు.

 మీడియాను అనుమతించని ఫ్యాక్టరీ అధికారులు.
 కార్మిక సంఘాల ప్రతినిధులు సమ్మెనోటీసు ఇచ్చేందుకు ఫ్యాక్టరీ లోపలికి వెళ్లగా, ఈవిషయం తెలుసుకుని మీడియా ప్రతినిధులు అక్కడికి వెళ్లారు. ఫ్యాక్టరీ లోపలికి మీడియాను అనుమతించ లేదు.

మరిన్ని వార్తలు