అంబేద్కర్‌ ఆశయాలను కొనసాగిస్తున్నాం..

30 Apr, 2018 08:12 IST|Sakshi
అంబేద్కర్‌ విగ్రహానికి నివాళులు అర్పిస్తున్న మంత్రి జోగు రామన్న

ఆదిలాబాద్‌ రూరల్‌ : అంబేద్కర్‌ ఆశయాలకు అనుగుణంగా టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం కృషి చేస్తోందని రాష్ట్ర అటవీ పర్యావరణ, బీసీ సంక్షేమ శాఖ మంత్రి జోగు రామన్న అన్నారు. ఆదివారం ఆదిలాబాద్‌ రూరల్‌ మండలం కుంభఝరి, శివ్‌ఘాట్, మావల మండలం పిట్టలవాడలో నిర్వహించిన అంబేద్కర్‌ జయంతి వేడుకల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఆయా ప్రాంతాల్లో అంబేద్కర్‌ చిత్రపటాలు, విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ బడుగు, బలహీన వర్గాల అభివృద్ధి కోసం సీఎం కేసీఆర్‌ కృషి చేస్తున్నారని అన్నారు.

ఎస్టీ, ఎస్సీ, బీసీ, మైనార్టీలకు అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి ఉపాధి కల్పిస్తోందని పేర్కొన్నారు. ప్రభుత్వం ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలను ప్రజలు సద్వినియోగం చేసుకుని ఆర్థికంగా అభివృద్ధి చెందాలని అన్నారు. రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ బాబా సాహెబ్‌ అంబేద్కర్‌ చదువుతోనే చరిత్రలో నిలిచిపోయారని, ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలు తల్లిదండ్రులు వారి పిల్లలకు ఉన్నత చదువులు చదివించాలని అన్నారు.

పేదవారు ఉన్నత చదువులు చదువుకోవడానికి ప్రభుత్వం గురుకుల పాఠశాలలను ఏర్పాటు చేసిందన్నారు. ప్రైవేటు పాఠశాలలకు దీటుగా కార్పొరేట్‌ స్థాయిలో సౌకర్యాలు కల్పిస్తోందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మావల గ్రామ పంచాయతీ సర్పంచ్‌ రఘుపతి, కుంభఘరి గ్రామ పంచాయతీ సర్పంచ్‌ లాయరి లక్ష్మి, టీఆర్‌ఎస్‌ పార్టీ మండల అధ్యక్షుడు నల్ల రాజేశ్వర్, దళిత సంఘాల నేతలు తదితరులు పాల్గొన్నారు.

>
మరిన్ని వార్తలు