గిరిజనుల కోసం వర్కింగ్ హాస్టళ్లు!

29 Feb, 2016 03:15 IST|Sakshi

► హైదరాబాద్, వరంగల్, ఖమ్మంలలో పది హాస్టళ్ల నిర్మాణం
► పురుషులు, మహిళల కోసం అయిదేసి చొప్పున ఏర్పాటు

 సాక్షి, హైదరాబాద్: గిరిజనుల కోసం త్వరలోనే వ ర్కింగ్ మెన్స్, ఉమెన్స్ హాస్టళ్లను ఏర్పాటు చేయనున్నారు. ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగాలు చేస్తున్న గిరిజనుల కోసం ఈ హాస్టళ్లను నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తోంది. తమ సొంత ప్రాంతాలకు దూరంగా ఉంటూ  ఉద్యోగాలు చేస్తున్న వారికి ఆయా పట్టణాలు, ముఖ్యమైన ప్రాంతాల్లో ఈ హాస్టళ్లను నిర్మించాలనే ఆలోచనతో ఉన్నారు. రాష్ట్రంలో మొత్తం 10 వర్కింగ్ హాస్టళ్లను నిర్మించనుండగా, వాటిలో సగం పురుషులకు, సగం మహిళలకు ఏర్పాటు చేయనున్నారు. ముఖ్యంగా హైదరాబాద్, వరంగల్ నగరాలు, రంగారెడ్డి పరిసర ప్రాంతాలు, ఖమ్మం జిల్లాలో వీటి నిర్మాణానికి  స్థలాన్ని గుర్తించడంపై గిరిజనసంక్షేమ శాఖ దృష్టిని నిలిపింది.

హైదరాబాద్‌లో మహిళల కోసం 3, పురుషుల కోసం 3, వరంగల్‌లో మహిళల కోసం 1, పురుషుల కోసం 1, ఖమ్మం జిల్లాలో పురుషులకు 1, మహిళలకు 1 హాస్టల్  నిర్మించనున్నారు. ఒక్కో హాస్టల్‌లో 200 మంది భోజన, వసతి సౌకర్యాలను పొందేలా ప్రణాళికలను రూపొందించారు. ఇందుకు అవసరమైన ప్రతిపాదనలను సమర్పించాల్సిందిగా భద్రాచలం ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల ఎస్టీసంక్షేమ అధికారులు, వరంగల్ జిల్లా గిరిజన సంక్షేమ అధికారులను ఆదేశించింది. ఇందుకు సంబంధించి 2016-17 బడ్జెట్‌లో నిధులు కూడా కేటాయించేలా ఎస్టీ శాఖ ప్రతిపాదనలను సిద్ధం చేసింది.
 
విదేశీ వర్శిటీ ప్రవేశ పరీక్షలకు శిక్షణ
 విదేశీ విశ్వవిద్యాలయాల్లో ప్రవేశానికి అర్హత పొందేందుకు ఎస్టీ విద్యార్థులకు శిక్షణనిచ్చేందుకు శిక్షణాసంస్థలను ఎంపిక చేయాలని హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల ఎస్టీ సంక్షేమ అధికారులకు ఇదివరకే ఆదేశాలిచ్చారు. ఓవర్సీస్ విద్యానిధి కింద విదేశాల్లో ఉన్నతవిద్యను అభ్యసించేందుకు సంబంధించి అన్ని ఐటీడీఏల పరిధిలో, అన్ని జిల్లాల్లో విస్తృత ప్రచారాన్ని కల్పించాలని, అర్హులైన ఎస్టీ విద్యార్థులంతా దీనికి నమోదు చేసుకునేలా చూడాలని ఐటీడీఏ పీవోలు, డిప్యూటీ డైరెక్టర్లు, జిల్లా ఎస్టీసంక్షేమ అధికారులకు సూచించారు.
 
ప్రభుత్వ భవనాల్లోకి పోస్ట్ మెట్రిక్ హాస్టళ్లు
 రాష్ర్టంలోని పలు ప్రాంతాల్లో ప్రైవేట్ భవనాల్లో కొనసాగుతున్న పోస్ట్‌మెట్రిక్ హాస్టళ్లను ప్రభుత్వ భవనాల్లోకి తరలించాలని ఐటీడీఏ పీవోలు, డిప్యూటీడెరైక్టర్లు, డీటీడబ్ల్యూవోలకు ఎస్టీశాఖ ఉన్నతాధికారులు ఆదేశాలిచ్చారు. నిర్మాణంలో ఉన్న పోస్ట్ మెట్రిక్ హాస్టల్ భవనాలను త్వరితంగా పూర్తిచేసి పీవోలు, డీడీలు, డీటీడబ్ల్యూవోలకు అందజేయాలని ఇంజనీరింగ్ విభాగాన్ని ఆదేశించింది. వీటి నిర్మాణానికి స్థలం దొరకని చోట జిల్లా కలెక్టర్లతో సమన్వయం చేసుకుని అవసరమైన భూమిని గుర్తించి సేకరించాలని, కొత్త హాస్టళ్ల అవసరం ఉన్నచోట అందుకు అవసరమైన ప్రతిపాదనలను సమర్పించాలని అధికారులను ఎస్టీశాఖ ఆదేశించింది.
 

>
మరిన్ని వార్తలు