నీరందేదెన్నడు..!

12 Mar, 2016 02:39 IST|Sakshi
నీరందేదెన్నడు..!

సాక్షి ప్రతినిధి, ఆదిలాబాద్ : ఆయకట్టు లేని చెరువుల ఎంపిక.. అసంపూర్తిగా మొదటి విడత పనులు.. నేతలే బినామీ పేర్లతో కాంట్రాక్టర్లు.. పర్సంటేజీల్లో మునిగి తేలుతున్న కొందరు అధికారులు.. స్థూలంగా చెప్పాలంటే మిషన్ కాకతీయ పథకం అమలు తీరు జిల్లాలో అస్తవ్యస్తంగా తయారైంది. చిన్న నీటి వనరుల అభివృద్ధే ధ్యేయంగా ప్రభుత్వం మిషన్ కాకతీయ పథకాన్ని ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తోంది. చెరువుల పునరుద్ధరణ పనుల కోసం ఏటా రూ.వందల కోట్లు వెచ్చిస్తోంది. ఈ పథకానికి శ్రీకారం చుట్టి ఏడాది పూర్తవుతున్న నేపథ్యంలో జిల్లాలో అమలు తీరును పరిశీలిస్తే..

మొదటి విడతకే మోక్షం లేదు..
జిల్లాలో మొత్తం 1,491 చెరువులున్నట్లు నీటి పారుదల శాఖ గుర్తించింది. మొదటి విడతలో 20 శాతం అంటే 558 చెరువులను ఈ పథకం కింద ఎంపిక చేసింది. సుమారు రూ.166 కోట్ల అంచనా వ్యయంతో ఈ పనులు చేపట్టారు. ఏడాది కాలంగా కనీసం 200 చెరువుల పనులను కూడా పూర్తి చేయలేకపోయారు. సుమారు 71 చెరువులు వచ్చే జూన్ నాటికి పూర్తవుతాయని నీటి పారుదల శాఖ అధికారులు భావిస్తున్నారు. 75 శాతం వరకు పనులు పూర్తయిన చెరువులు సుమారు 200 వరకు ఉంటాయని అధికారులు పేర్కొంటున్నారు.

మరో 80 చెరువుల పనులు 50 శాతం వరకు జరిగాయని చెబుతున్నారు. పనులు చేసేందుకు కేవలం మూడు నెలలే గడువుంది. వర్షాలు కురిస్తే ఈ చెరువుల పనులు చేయడానికి వీలుండదు. ఈ మూడు నెలల్లో పనులు వేగవంతం చేయని పక్షంలో మొదటి విడతలో చేపట్టిన చెరువుల పనులు వచ్చే ఏడాది వరకు కొనసాగనున్నాయి.

 రెండో విడతలో 191 మంజూరు..
రెండో విడతలో 522 చెరువులను పునరుద్ధరించాలని నిర్ణయించారు. ఈ మేరకు నీటి పారుదల శాఖ అధికారులు అంచనాలను తయారు చేసి, సుమారు రూ.200 కోట్లతో ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. ఇప్పటివరకు కేవలం 191 చెరువులకు ప్రభుత్వం నిధులు మంజూరు చేస్తూ పలు ఉత్తర్వులు జారీ చేసింది. ఇందులో 151 చెరువులకు టెండరు ప్రక్రియను పూర్తి చేశామని అధికారులు చెబుతున్నారు.

 అమలు తీరు అస్తవ్యస్థం..
ఏడాది కాలంలో ఈ పథకం అమలు తీరును పరిశీలిస్తే.. అధికార టీఆర్‌ఎస్ పార్టీ నేతలే బినామీ పేర్లతో గుత్తేదార్లుగా అవతారమెత్తారు. ఒక్కో చెరువుకు పోటీపడి 20 శాతం వరకు లెస్‌కు టెండర్లు దాఖలు చేసి పనులు దక్కించుకున్నారు. కానీ పనులు సకాలంలో పూర్తి చేయడంలో విఫలమవుతున్నారు. నేతలే కాంట్రాక్టర్లు కావడంతో అధికారులు తమకెందుకొచ్చిన తంటా అనే ధోరణితో ‘మామూలు’గా సరిపెడుతున్నారు. దీంతో ఈ పనులు సకాలంలో పూర్తి కాలేకపోతున్నాయి.

రెండో విడత చెరువుల ప్రతిపాదనల బాధ్యతలను ఆయా నియోజకవర్గ ఎమ్మెల్యేలకు అప్పగించింది. కొన్ని చోట్ల ఒక్క ఎకరం కూడా ఆయకట్టు లేని చెరువులను ప్రతిపాదించడం తీవ్ర విమర్శలకు దారితీసింది. కనీసం ఒక్క రైతుకు కూడా మేలు చేయని పనులకు అధికారులు కళ్లు మూసుకుని రూ.లక్షల నిధులతో అంచనాలను రూపొందించడం ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసే ప్రయత్నాలేననే ఆరోపణలు గుప్పుమంటున్నాయి. కేవలం తమ అనుచరులకు పనులు కల్పించేందుకే ఇలా ఆయకట్టు చెరువులను ఎంపిక చేశారనే విమర్శలు వెల్లువెత్తాయి. ఆదిలాబాద్ వంటి మున్సిపల్ పట్టణాల్లోని ఆయకట్టు లేని చెరువులను రెండో విడతలో ఎంపిక చేయడం ఇందుకు ఉదాహరణగా చెప్పవచ్చు.

మిషన్ కాకతీయ పథకం కేవలం నేతలకే కాదు, కొందరు నీటిపారుదల శాఖ అధికారులకు కూడా కాసుల పంట పండిస్తోంది. బిల్లుల చెల్లింపుల్లో పర్సంటేజీల పర్వం యథేచ్ఛగా కొనసాగుతోంది. ఈ చెరువు పనుల బిల్లులు చెల్లించేందుకు ఓ కాంట్రాక్టర్ వద్ద ఏకంగా రూ.లక్ష లంచం తీసుకుంటూ మంచిర్యాల ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ వినోద్‌కుమార్, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ బాలసిద్దులు ఏసీబీకి చిక్కడం ఈ పర్సంటేజీల బాగోతాన్ని బజారుకీడ్చింది. 2015 డిసెంబర్‌లో మంచిర్యాల నీటిపారుదల శాఖ కార్యాలయంపై పంజా విసిరిన ఏసీబీ ఈ ఇద్దరు అధికారులను రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకుంది.

మరిన్ని వార్తలు