ఏళ్లుగా ఇలాగే..

10 Feb, 2018 18:21 IST|Sakshi
పనులు కాని కాలక్షేప మండపం

కురవి ఆలయంలో పూర్తికాని అభివృద్ధి పనులు

అర్ధంతరంగా నిర్మించి వదిలేసిన కాంట్రాక్టర్లు

రూ.5కోట్లు మంజూరైనా ప్రయోజనం శూన్యం

జాతర సమీపిస్తున్నా పట్టించుకోని అధికారులు

కురవి(డోర్నకల్‌): రాష్ట్రంలోనే ప్రసిద్ధి చెందిన మండలకేంద్రంలోని వీరభద్రస్వామి ఆలయంలో పెండింగ్‌లో ఉన్న అభివృద్ధి పనులకు కొన్నేళ్లుగా మోక్షం లభించడంలేదు. దివంగత సీఎం డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖరరెడ్డి హయాంలో ఆలయ అభివృద్ధికి రూ.కోటిన్నర నిధులను కేటాయించిన విషయం తెలిసిందే. అయితే ఈ పనులను కాంట్రాక్టర్లు పూర్తి చేయకుండా అర్ధంతరంగా వదిలేశారు. ఇన్నేళ్లుగా పనులు సగంలో ఉన్నాయి. అయితే ఆలయానికి ఏటా భక్తుల సంఖ్యతోపాటు ఆదాయం కూడా పెరుగుతోంది. ఈమేరకు సౌకర్యాలు మెరుగుపడటం లేదు. 2015–2016 ఆర్థిక సంవత్సరంలో రూ.2,18,68,925 ఆదాయం రాగా, ఖర్చు రూ.2,16,61,101గా నమోదైంది. దీంతో ఆదాయంలో ఖర్చు మినహాయిస్తే ఆలయ అభివృద్ధికి మిగులు లేకపోయింది.

గత మహాశివరాత్రి సందర్భంగా సీఎం కేసీఆర్‌ వీరభద్రస్వామి వారికి కోరమీసాలు సమర్పించి మొక్కు చెల్లించారు. ఇదే సమయంలో ఆలయ అభివృద్ధికి రూ.5 కోట్లు విడుదల చేస్తామని నిధులను మంజూరు చేశారు. ఏడాది కావస్తున్నా ఇందుకు సంబంధించిన అభివృద్ధి పనులు మాత్రం అలాగే ఉన్నాయి. దీంతో ఈ శివరాత్రికి కూడా భక్తులు ఇబ్బందులు పడే పరిస్థితి నెలకొంది. శివరాత్రిని పురస్కరించుకొని ఈనెల 12న కురవి జాతరకు అంకురార్పణ జరగనుంది. రెండుసార్లు టెండర్లు పిలువడానికే కొద్ది నెలలు సమయం పట్టగా, కాంట్రాక్టర్‌ పనులను నేటికీ మొదలు పెట్టలేదు. జనవరి 12న రాష్ట్ర మంత్రులు తన్నీరు హరీష్‌రావు, అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి, తుమ్మల నాగేశ్వర్‌రావు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. దీనికితోడు టెండర్‌ దక్కించుకున్న కాంట్రాక్టర్‌ నేటికీ ఒప్పందం కుదుర్చుకోలేదు. శంకుస్థాపన తర్వాత వెంటనే పనులు మొదలు పెట్టి ఉంటే ఈ 25 రోజుల్లో సత్రాల వద్ద బంజార సత్రం నిర్మాణం పూర్తయ్యేది. ఈ జాతరలో వేలాది మంది గిరిజన భక్తులు సేదతీరేవారు. కానీ మళ్లీ పాత ఇబ్బందులే ఉండనున్నాయి.

పెండింగ్‌లో ఉన్న పనులు
రూ.48లక్షలతో నిర్మించిన ప్రాకార మండపం 95శాతం పనులు పూర్తయ్యాయి. కాలక్షేప మండపానికి రూ.41.60లక్ష లు కేటాయించగా పనులు మాత్రం స్లాబ్‌ లెవల్‌ వరకు నిర్మించారు. ఆలయ ఆవరణ పూర్తిగా ఫ్లోరింగ్‌ చేసేందుకు రూ.30లక్షలు కేటాయించగా 1శాతం పనులు కాలేదు. ప్రాకార మండపంపై సాలారం కట్టాల్సి ఉంది. ఆ పనులు మొదలు పెట్టకపోవడంతోపాటు ప్రాకార మండపాన్ని సైతం పూర్తి చేయలేదు. దీంతో రెండు పనులను పూర్తి చేయాల్సి ఉంది. ఆలయ ఆవరణలో చేయాల్సిన గ్రానైట్‌ రాయితో చేయాల్సిన ఫ్లోరింగ్‌ పూర్తి కాలేదు. పనులు పెండింగ్‌లో ఉండడంతో అభివృద్ధి కనిపించడంలేదు.

రూ.5కోట్ల పనుల వివరాలు
వీరభద్రస్వామి ఆలయానికి సీఎం కేసీఆర్‌ మంజూరు చేసిన రూ.5కోట్ల అభివృద్ధి పనులను వివిధ పనులకు కేటాయించారు. ప్రాకార మండపానికి (బ్యాలెన్స్‌పని) రూ.75లక్షలు, ఆలయ ఆవరణలో గ్రానైట్‌ ఫ్లోరింగ్‌కు రూ.50లక్షలు, మూడు స్టోర్స్‌ రాజగోపురానికి రూ.30లక్షలు, మినీ రాజగోపురానికి రూ.10లక్షలు, యాగశాలకు రూ.10లక్షలు, రథశాలకు రూ.10.50లక్షలు, నవగ్రహ మండపానికి రూ.3.50లక్షలు, భద్రకాళీ ఆలయ ప్రాకారానికి రూ.13.50లక్షలు, బంజార సత్రానికి రూ.1కోటి, కల్యాణకట్ట పనులకు రూ.16లక్షలు, మరుగుదొడ్ల నిర్మాణాలకు రూ.17.50లక్షలు, కాలక్షేప మండపానికి రూ.25లక్షలు, వీరభద్రస్వామి సత్రానికి రూ.60లక్షలు, రెండవ బంజార సత్రానికి రూ.48లక్షలు, ఆంజనేయ స్వామి ఆలయానికి రూ.3.50లక్షలు, నాగమయ్య ఆలయానికి రూ.13లక్షలు, రథం నిలిపే స్థలానికి ప్రహరీకి రూ.14.50లక్షలు కేటాయించి టెండర్లు పూర్తి చేశారు.

మరిన్ని వార్తలు