పట్టణాలకు ప్రత్యేక బస్సులు!

1 Mar, 2020 04:05 IST|Sakshi

ప్రపంచ బ్యాంకుతో కలసి కేంద్రం కొత్త ప్రాజెక్టుకు ప్రణాళిక

ఐదేళ్ల పాటు నష్టాలను భరించేందుకు వయబిలిటీ గ్యాప్‌ ఫండ్‌

కిలోమీటరుకు రూ.7 చొప్పున ‘నష్ట పరిహారం’..

కొత్త బస్సుల నిర్వహణకు కావాల్సిన మౌలిక వసతులకు ప్రత్యేక నిధులు

సగం మొత్తాన్ని గ్రాంటుగా ఇవ్వనున్న కేంద్ర ఉపరితల రవాణా శాఖ

ఆ బస్సులన్నీ అద్దె ప్రాతిపదికన నిర్వహించనున్న ప్రైవేటు ఆపరేటర్లు

ప్రతిపాదనకు పచ్చజెండా ఊపాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరిన కేంద్రం

సాక్షి, హైదరాబాద్‌: ఇక పట్టణాల్లో అద్దె బస్సులు రాజ్యమేలబోతున్నాయి. నగరాలు, పట్టణాల్లో ప్రజా రవాణా భారీ నష్టాలతో ఆర్టీసీ కుదేలవుతున్న వేళ.. వాటిని పూడ్చేందుకు కేంద్రం ఓ అడుగు ముందుకేసింది. ప్రపంచ బ్యాంకు చేయూతతో ప్రత్యేక ప్రాజెక్టును తెస్తోంది. ఇందులో భాగంగా ఆర్టీసీ ఆధ్వర్యంలో ప్రధాన పట్టణాల మధ్య అద్దె బస్సులను భారీగా తిప్పేందుకు వీలుగా రంగం సిద్ధం చేస్తోంది. వీటి నిర్వహణతో వచ్చే నష్టాలను ఐదేళ్లపాటు భరించేందుకు సమాయత్తమైంది. ఈలోపు వాటి నష్టాలను పూడ్చుకునేలా రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుంది. ఐదేళ్ల కాలానికి గాను రూ.75 వేల కోట్లను ఇందు కోసం ఖర్చు చేయనున్నారు. ఈ మొత్తాన్ని ఆయా రాష్ట్రాల డిమాండ్‌ ఆధారంగా పంచుతారు.

ప్రాజెక్టులో భాగస్వామ్యం అయ్యేందుకు ఉన్న సంసిద్ధతను తెలపాల్సిందిగా కేంద్ర ఉపరితల రవాణా శాఖ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది. ప్రభుత్వం ఓకే అంటే అందులో భాగస్వామ్యం ఉంటుంది. పట్టణ ప్రాంతంలో ప్రత్యేకంగా తిప్పే బస్సుల నిర్వహణతో వచ్చే నష్టాలతో పాటు, వాటి నిర్వహణకు సంబంధించిన మౌలిక వసతుల కల్పనకు అయ్యే వ్యయంలో సగభాగాన్ని భరించేందుకు వీలుగా గ్రాంట్లు అందించనుంది. ఈ ప్రాజెక్టులో భాగంగా వచ్చే బస్సులన్నీ ఆర్టీసీ సొంత బస్సులుగా కాకుండా పూర్తిగా అద్దె ప్రాతిపదికన ప్రైవేటు ఆపరేటర్లే నిర్వహించనున్నారు. వెరసి ప్రజా రవాణా సంస్థలో అద్దె బస్సుల హవా మరింతగా పెరగనుంది.  

ప్రపంచ బ్యాంకు సాంకేతిక సహకారంతో.. 
ప్రపంచవ్యాప్తంగా పట్టణీకరణ అత్యంత వేగంగా పెరుగుతోంది. కానీ, పెరుగుతున్న జనాభాకు వీలుగా ఆయా ప్రాంతాల్లో ప్రజా రవాణా విస్తరించటం లేదని  ప్రపంచ బ్యాంకు ప్రత్యేక అధ్యయనాలతో తేల్చింది. దీన్ని మార్చాలంటే పట్టణ ప్రాంతాల్లో ప్రజా రవాణాను బలోపేతం చేయాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా మన దేశంతో కూడా అవగాహనకు వచ్చింది. కేంద్ర ఉపరితల రవాణాశాఖ ఆధ్వర్యంలో ఈ బృహత్‌ ప్రాజెక్టును చేపట్టబోతోంది. ఇందుకు సంబంధించి తన వంతుగా సాంకేతిక సహకారాన్ని ఉచితంగా అందించటంతో పాటు కేంద్రానికి అవసరమైన కొంత ఆర్థిక చేయూతను అందించేందుకు ముందుకొచ్చింది. ఈ మేరకు వచ్చే ఐదేళ్లలో పట్టణ ప్రజా రవాణా రూపురేఖలు మార్చాలన్నది ప్రణాళిక.

ఇందుకు ఐదేళ్ల కాలానికి రూ.75 వేల కోట్లు ఖర్చవుతాయని ఓ అంచనా. దీనికి కేంద్రం కూడా సానుకూలంగా ఉండి, రాష్ట్ర ప్రభుత్వాలను భాగస్వాములు చేయాలని నిర్ణయించింది. దీనికి సంబంధించి తాజాగా ఢిల్లీలో ప్రపంచ బ్యాంకు ఆధ్వర్యంలో సదస్సు నిర్వహించి రాష్ట్ర ప్రభుత్వాలకు ఈ ప్రాజెక్టు వివరాలు వెల్లడించింది. ప్రయోగాత్మకంగా దీన్ని అమలు చేసేందుకు మహారాష్ట్ర, ఏపీలను ఎంపిక చేసి, మిగతా రాష్ట్రాలు సమ్మతిని తెలపాల్సిందిగా కేంద్రం కోరింది. ప్రాజెక్టులో చేరేందుకు ఉన్న అభ్యంతరాలను తెలపాల్సిందిగా సూచించింది. ఈ సమావేశానికి టీఎస్‌ఆర్టీసీ తరుఫున పలువురు హాజరయ్యారు. దీనిపై కేంద్రానికి తుది నిర్ణయం వెల్లడించాల్సి ఉంది.

పదేళ్లు భరించాలి.. 
ఈ సమావేశంలో పేర్కొన్న వయబిలీటీ గ్యాప్‌ ఫండ్‌ను ఐదేళ్లు కాకుండా పదేళ్లు భరించాలని సమావేశంలో వివిధ రాష్ట్రాల ప్రతినిధులు కోరారు. దీనిపై ఇంకా కేంద్రం నిర్ణయం తీసుకోలేదు. ఇక బస్సులను కూడా తమ ప్రాంతాలకు సూటయ్యే వాటిని తామే సమకూర్చుకునే వెసులుబాటు కల్పించాలని కూడా కోరారు. గతంలో జేఎన్‌ఎన్‌యూఆర్‌ఎం పథకం కింద నాసిరకమైన బస్సులు సరఫరా కావటంతో అవి కేవలం మూడేళ్లకే పాడై ఆ తర్వాత భారీ నష్టాలు మూటగట్టినట్టు వారు కేంద్రం దృష్టికి తెచ్చారు. అందుకోసం నాణ్యమైన బస్సులను తామే సమకూర్చుకుంటామని, అందుకయ్యే వ్యయాన్ని కేంద్రం భరించాలని కోరారు. దీనిపై కేంద్రం నిర్ణయం తెలపాల్సి ఉంది.      

మరిన్ని వార్తలు