'చెత్త' రికార్డు!

11 Mar, 2020 01:26 IST|Sakshi

ఘన వ్యర్థాల ఉత్పత్తిలో ఢిల్లీ, ముంబై, చెన్నై తర్వాత మనమే..

ఏటా 16.4 లక్షల మెట్రిక్‌ టన్నుల చెత్త పడేస్తున్న హైదరాబాదీలు

ప్రపంచ బ్యాంకు నివేదికలో వెల్లడి  

సాక్షి, హైదరాబాద్‌: ఐటీ హబ్‌గా, హైక్లాస్‌ సిటీగా ప్రసిద్ధికెక్కిన మన భాగ్యనగరం ఓ ‘చెత్త’రికార్డును కూడా సొంతం చేసుకుంది. ప్రపంచస్థాయి నగరంగా గుర్తింపు తెచ్చుకోవాలనే తపన ఉన్న మన హైదరాబాదీలకు చెత్త విషయంలో చిత్తశుద్ధి తక్కువేనని ఈ రికార్డు చెబుతోంది. ప్రపంచ బ్యాంకు నివేదిక ప్రకారం దేశంలో చెత్తను ఉత్పత్తి చేస్తున్న నాలుగో నగరంగా మన హైదరాబాద్‌ గుర్తింపు పొందింది. గ్రేటర్‌ హైదరాబాద్‌లో ప్రతి యేటా 16.4 లక్షల మెట్రిక్‌ టన్నుల ఘనవ్యర్థాలు ఉత్పత్తి అవుతున్నాయని ఆ నివేదికలో తేలింది. మన హైదరాబాద్‌ కన్నా ముందంజలో ఉన్న ఢిల్లీ (30.6 లక్షల ఎంటీ), బృహన్‌ముంబై (24.9 లక్షల ఎంటీ), చెన్నై (18.3 లక్షల ఎంటీ)లు మరింత చెత్త నగరాలని ప్రపంచ బ్యాంకు తన నివేదికలో వెల్లడించింది. ఈ చెత్తలో ఆహార, హరిత వ్యర్థాలు 57 శాతం ఉండగా, కాగితాలు 10 శాతం, ప్లాస్టిక్‌ 8 శాతం, గాజు వ్యర్థాలు 4 శాతం, లోహాలు 3 శాతం, రబ్బరు, తోలు వ్యర్థాలు 2 శాతం, 15 శాతం ఇతర వ్యర్థాలున్నాయి. 

అమెరికాలో 263.7 లక్షల మెట్రిక్‌ టన్నులు..
130 కోట్లకు పైగా జనాభా ఉన్న భారత్‌ ప్రపంచంలోనే అత్యంత ఎక్కువ చెత్త ఉత్పత్తి చేస్తున్న దేశమని ప్రపంచ బ్యాంకు వెల్లడించింది. ప్రపంచంలోని మొత్తం చెత్తలో పదో వంతు భారత్‌లోనే పడేస్తున్నారని తెలి పింది. ప్రపంచంలోనే అత్యధిక జనాభా ఉన్న చైనా కన్నా భారత్‌లోనే ఎక్కువ చెత్త వస్తోందని, 2016 లెక్కల ప్రకారం చైనాలో ఏటా 220.4 లక్షల మెట్రిక్‌ టన్నుల చెత్త పడేస్తుంటే భారత్‌లో అది 277.1 లక్షల మెట్రిక్‌ టన్నులని తేల్చింది. మన తర్వాత అమెరికాలో ఏటా 263.7 లక్షల మెట్రిక్‌ టన్నుల చెత్తను అక్కడి ప్రజలు పడేస్తున్నారు. సగటున ఒక మనిషి పడేస్తున్న చెత్త విషయానికి వస్తే బెర్ముడాలో అత్యధికంగా ఒక్కో వ్యక్తి రోజుకు 4.5 కిలోల వ్యర్థాలను పడేస్తున్నాడు. ఆ తర్వాత అమెరికాలో 2.24 కిలోలు, రష్యాలో 1.13 కిలోలు, జపాన్‌లో 0.94 కిలోల చెత్త డస్ట్‌బిన్ల పాలవుతోంది. ఇవన్నీ ప్రపంచ సగటు 0.74 కిలోల కన్నా ఎక్కువ చెత్తను విసర్జిస్తున్న దేశాలుగా ప్రపంచ నివేదిక వెల్లడించింది. ఆ తర్వాత ఇండోనేసియాలో ప్రతి పౌరుడు సగటున రోజుకు 0.68 కేజీలు, భారత్‌లో రోజుకు 0.57 కిలోలు, చైనా, పాకిస్తాన్‌లలో 0.43 కిలోలు, బంగ్లాదేశ్‌లో 0.28 కిలోల చెత్త వదిలేస్తున్నారు. 

30 ఏళ్లలో ఎంత?
2030, 2050 నాటికి ఘన వ్యర్థాల ఉత్పత్తి ఎంత ఉంటుందనే అంచనా ప్రపంచబ్యాంకు వేసింది. మనం ఇక్కడా తగ్గడం లేదు. ప్రస్తుతం వదులుతున్న వ్యర్థాలకు రెండింతల చెత్త మరో 30 ఏళ్ల తర్వాత బయటపడేస్తామని ప్రపంచ బ్యాంకు చెబుతోంది. 

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా