చేనేత కార్మికులకు చేయూత: హరీశ్‌

11 Jan, 2019 01:23 IST|Sakshi

సాక్షి, సిద్దిపేట: తెలంగాణ చేనేత కార్మికుల నైపుణ్యాన్ని ప్రపంచ దేశాలు మెచ్చాయని, ఇక్కడి చేనేత కార్మికులు నేసిన గొల్లభామ చీరలకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు వచ్చిం దని ఎమ్మెల్యే హరీశ్‌రావు అన్నారు. గురువారం ఆయన సిద్దిపేట చేనేత సొసైటీ ఏర్పాటు చేసిన సమావేశానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా కార్మికులకు సంబంధించి ప్రభుత్వ రుణమాఫీ చెక్కులను బ్యాంకర్లకు అందజేశారు. నేత కార్మికులను ఆదుకుంటామని, తెలంగాణ ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్‌ చేనేత కార్మికుల యోగ క్షేమాలపై ప్రత్యేక దృష్టిపెట్టారని ఆయన అన్నారు.

చాలీచాలని ఆదాయంతో అప్పుల ఊబిలో కూరుకు పోయిన చేనేత కార్మికుల రుణాలను మాఫీ చేయడంలో కేటీఆర్‌ సహకారం మరువలేమని అన్నారు. కార్మికులకు నూలు, రసాయనాల కొనుగోలుపై రాష్ట్ర ప్రభుత్వం 40 శాతం సబ్సిడీ ఇస్తోందని చెప్పారు. కార్మికులను ఆదుకోవడానికి ప్రభుత్వం ప్రతి పట్టణంలో చేనేత వస్త్రాల కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసిందని చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా డిమాండ్‌ ఉన్న గొల్లభామ చీరల తయారీని ప్రభుత్వ ప్రోత్సహిస్తుందని పేర్కొన్నారు.   

మరిన్ని వార్తలు