వరల్డ్‌ డిజైన్‌ షోకి సిటీ ఆతిథ్యం

30 Aug, 2019 12:53 IST|Sakshi

అక్టోబర్‌ 11,12 తేదీల్లో నిర్వహణ

సాక్షి,సిటీబ్యూరో: తొలిసారిగా నిర్వహిస్తున్న ప్రపంచ డిజైన్‌ అసెంబ్లీకి హైదరాబాద్‌ వేదిక కానుంది. అక్టోబర్‌ 11,12 తేదీల్లో సిటీ వేదికగా 31వ వరల్డ్‌ డిజైన్‌ అసెంబ్లీ(డబ్లూడీఏ) నిర్వహించనున్నారు. దీంతో పాటు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, ఇండియా డిజైన్‌ ఫోరం (ఐడీఎఫ్‌) సంయుక్తంగా నిర్వహిస్తున్న హైదరాబాద్‌ డిజైన్‌ వీక్‌(హెచ్‌డీడబ్లూ) కూడా ఇదే సమయంలో(అక్టోబర్‌ 9–13 తేదీలు) జరగనుంది. ఆటోడెస్క్‌ డిజైన్‌ నైట్, డబ్లూడీఏ ఎడ్యుకేషన్‌ ఫోరం, ఐడీఎఫ్‌ అవార్డ్స్, చౌమహల్లా ప్యాలెస్‌లో డిన్నర్, హైదరాబాద్‌ ఇంటర్నేషనల్‌ కన్వెన్షన్‌ సెంటర్‌ (హెచ్‌ఐసీసీ)లో హెచ్‌డీడబ్ల్యూ డిజైన్‌ కాన్ఫరెన్స్‌లో విద్యార్థులు, డిజైన్‌ ప్రొఫెషనల్స్‌తో ప్రత్యేక డిజైన్‌ ఎక్స్‌పో వంటి సరికొత్త సందడితో నగరం మెరవనుంది. 

అంతర్జాతీయ డిజైనర్ల రాక
ఈ అంతర్జాతీయ ప్రదర్శనలో 150 మందికి పైగా భాగస్వాములు కానున్నారు. డబ్లూడీఓ, హెచ్‌డీడబ్లూ సభ్యులు భారతీయ డిజైన్లను ప్రదర్శించనున్నారు. ఈ కార్యక్రమంలో అక్టోబర్‌ 11, 12 తేదీల్లో జరిగే ‘డిజైన్‌ కాన్ఫరెన్స్‌’ ప్రత్యేకతను చాటనుంది. హెచ్‌ఐసీసీలో జరిగే ఈ కార్యక్రమంలో ప్రపంచ ప్రఖ్యాత డిజైనర్లు పాల్గొననున్నారు. మార్కస్‌ ఫెయిర్స్‌(డీజెన్‌), టిమ్‌ కోబె(ఐట్‌ ఇంక్‌.), క్రిస్టియానో సెకాటో (జాహా హదీద్‌ ఆర్కిటెక్టŠస్‌), జేన్‌ విథర్స్‌ (జేన్‌ విదర్స్‌ స్టూడియో), ఎమ్మా గ్రీర్‌ (కార్లో రాట్టి అస్సోసియేటి), ప్రతాప్‌ బోస్‌(టాటా మోటర్స్‌), రుచికా సచ్‌దేవా(బోడిస్‌), సందీప్‌ సంగరు(సంగరు డిజైన్‌ స్టూడియో), శివ్‌ నల్లపెరుమాళ్‌ వంటి ప్రముఖ డిజైనర్లు ఈ  కార్యక్రమంలో పాలుపంచుకోనున్నారు. ఐక్యరాజ్యసమితి సుస్థిర అభివృద్ధి లక్ష్యాలను సాధించడానికి డిజైన్‌ రంగంలో ఉన్న అవకాశాలను వాడుకోవచ్చని హైదరాబాద్‌ వారు ఇచ్చిన ప్రెజెంటేషన్‌ డబ్లూడీఏ మెప్పు పొందింది. పేదరికం, కాలుష్యం, తరిగిపోతున్న సహజ వనరులు వంటి సమస్యలకు డిజైన్‌ ఇన్నోవేషన్‌ రంగం పరిష్కారాలు చూపించనుంది.

ఇదో అద్భుత అవకాశం
వరల్డ్‌ డిజైన్‌ అసెంబ్లీ(డబ్లూడీఏ)ని నిర్వహించేందుకు జరిగిన బిడ్‌ని హైదరాబాద్‌ చేజిక్కిచ్చుకుందని తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేష్‌ రంజన్‌ తెలిపారు. ఈ ఈవెంట్‌తో పాటు హైదరాబాద్‌ డిజైన్‌ వీక్‌ కూడా కలిసి నిర్వహించడం మరింత అద్భుతమైన అవకాశమన్నారు.  

మరిన్ని వార్తలు