నగరాలు.. రోగాల అడ్డాలు

30 Oct, 2019 02:23 IST|Sakshi
హైదరాబాద్‌ నగరం (ఫైల్‌ ఫోటో)

ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆందోళన కాలుష్యంతో శ్వాసకోశ వ్యాధులు

ఫాస్ట్‌ఫుడ్‌ సెంటర్లతో అనారోగ్యకర ఆహారం

బీపీ, షుగర్‌ వంటి జబ్బులతో ప్రజలు సతమతం

అధిక ట్రాఫిక్‌తో సమస్యలు... పెరుగుతున్న మరణాలు

ఆరోగ్యకరమైన నగర జీవనానికి పలు సూచనలు

సాక్షి, హైదరాబాద్‌: పట్టణాలు, నగరాలు అనారోగ్యంతో కునారిల్లుతున్నాయి. ట్రాఫిక్‌ మొదలుకొని ఫాస్ట్‌ఫుడ్‌ వరకు అనేక అంశాలు ఆరోగ్యంపై చూపెడుతున్న ప్రభావాలపై ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆందోళన వ్యక్తం చేసింది. నగర జీవనశైలి వ్యాధులకు నిలయంగా మారుతోందని పేర్కొంది. ‘ఆరోగ్య నగరాలను ఎలా తయారు చేయాలి’అనే అంశంపై ఇటీవల ఒక నివేదిక తయారు చేసింది. ట్రాఫిక్‌ రద్దీ, మద్యం తాగి వాహనాలు నడపడం, సీటు బెల్టు, హెల్మెట్‌ ధరించకపోవడం, ఫలితంగా రోడ్డు ప్రమాదాలు, అనారోగ్యకరమైన జీవనశైలి, శారీరక వ్యాయామం లేకపోవడం, వృద్ధులను పట్టించుకోకపోవడం ఇలా పలు సమస్యలు నగర జీవనాన్ని అతలాకుతలం చేస్తున్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ విశ్లేషించింది. ఈ పరిస్థితులను మార్చాల్సిన అవసరాన్ని తెలియజెప్పింది. వివిధ అంశాలపై విశ్లేషణ చేసింది.  

ట్రాఫిక్‌ రద్దీ..
నగరాలు, పట్టణాల్లో రహదారులు దారుణంగా ఉంటున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ట్రాఫిక్‌ సరిగా లేకపోవడం, రోడ్డు ప్రమాదాల కారణంగా ప్రతి ఏడాది 5–29 సంవత్సరాల వయస్సు గలవారు 10 లక్షల మందికి పైగా ప్రాణాలు కోల్పోతున్నారు. 5 కోట్ల మంది వరకు గాయపడుతున్నారు. ఇది అభివృద్ధి చెందుతున్న దేశాల అభివృద్ధిపై తీవ్రమైన ప్రభావం చూపుతోంది. హెల్మెట్లు, సీట్‌ బెల్ట్‌ల వాడకాన్ని ప్రభుత్వం ప్రోత్సహించాలి. రహదారులను మరింత సురక్షితంగా మార్చడానికి ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రభుత్వ సంస్థలతో కలిసి పనిచేయాలని నిర్ణయించింది.

మానసిక అనారోగ్యం..
మరోవైపు పేదరికం, నిరుద్యోగం, ట్రాఫి క్, శబ్ద కాలుష్యం, మౌలిక సదుపాయాలు, పచ్చని ప్రదేశాలు లేకపోవడం పట్టణవాసులు ఎదుర్కొంటున్న మరికొన్ని అడ్డంకులు. ఈ సమస్యలన్నీ మానసిక అనారోగ్యాన్ని సృష్టిస్తున్నాయి. ప్రపంచ జనాభాలో సగానికి పైగా ఇప్పుడు నగరాలు, పట్టణాల్లో నివసిస్తున్నారు. దీంతో రద్దీ అధికంగా ఉంటుంది. శబ్ద కాలుష్యం, దీర్ఘకాలిక ఒత్తిడి కలిపి సామాజిక ఒంటరితనానికి దారితీస్తాయి. నగరాల్లో గాలి నాణ్యత తగ్గింది. ప్రతీ పది మందిలో 9 మంది రోజూ కలుషితమైన గాలిని పీల్చుతున్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ అంచనా . వాయు కాలుష్యంతో గుండె, శ్వాసకోశ వ్యాధులు, ఉబ్బసం, ఊపిరితిత్తుల కేన్సర్‌కు దారితీస్తుంది.

పెరుగుతున్న పట్టణ హింస..
పట్టణాలు, నగరాల్లో హింస పెచ్చుమీరుతోంది.15–44 ఏళ్ల మధ్య వయసు వారు అధికంగా హింసకు పాల్పడుతున్నారు. లైంగిక వేధింపులతో సహా ప్రాణాంతకమైన హింసతో ఏటా 10 లక్షల మంది గాయపడుతున్నారు. వేలాది మంది హత్య కు గురవుతున్నారు. అధిక జనాభా సాంద్రత ఉన్న నగరాల్లో హింస ఎక్కువగా కనిపిస్తోంది.

అనారోగ్యకరమైన ఆహారం..
అధిక కొవ్వు, ఉప్పు, చక్కెర అధికంగా ఉన్న ఆహారం, పానీయాలను అందించే ఫాస్ట్‌ఫుడ్‌ దుకాణాలు నగర ఆరోగ్యానికి సవాల్‌గా మారింది. ఆహార పదార్థాల మార్కెటింగ్‌ పిల్లలను లక్ష్యంగా చేసుకుం టు న్నాయి. బయటి ఆహారానికి నగర ప్రజలు అలవాటు పడుతుండటంతో బీపీ, షుగర్, ఊబకాయం అధికమవుతున్నాయి. 

కొరవడుతున్న శారీరక శ్రమ.. 
గుండె జబ్బులు, డయాబెటిస్, ఊబకాయం, బీపీ, కొన్ని కేన్సర్లను నివారించడంలో శారీరక శ్రమ సాయపడుతుంది. వ్యాయామం చేయడానికి బహిరంగ, పచ్చని ప్రదేశాలు లేకపోవడంతో శారీరక శ్రమకు దూరంగా ఉంటున్నారు. ఇదే నగర పౌరులను అనారోగ్యంగా మార్చుతోంది. 

వృద్ధులకు వసతులు
ప్రపంచవ్యాప్తంగా 60 ఏళ్లు అంతకంటే ఎక్కువ వయసున్న వారి సంఖ్య ఇతర వయసుల వారికంటే వేగంగా పెరుగుతోంది. పెరుగుతున్న వృద్ధుల జనాభా అవసరాలకు అనుగుణంగా నగర నిర్మాణాలుండాలి. పిల్లలు దూరంగా వెళ్లిపోవడం, భాగస్వామి చనిపోవడంతో వృద్ధులు ఒంటరితనానికి గురవుతున్నారు. సామాజిక సంబంధాలు విచ్ఛిన్నం కావడంతో వీరు దుర్భర జీవితం గడుపుతున్నారు. కాబట్టి నగరాల్లో వృద్ధులకు ఆరోగ్య కేంద్రం, సూపర్‌ మార్కెట్, సమాజ జీవితంలో పాల్గొనడానికి అవకాశం కల్పించాలి.  

మరిన్ని వార్తలు