సర్వతోభద్ర ఆలయం  పునరుద్ధరణకు కృషి

19 Apr, 2019 01:15 IST|Sakshi

ఎమ్మెల్యే గండ్రవెంకటరమణారెడ్డి 

‘సాక్షి’ కథనంతో  అన్ని వర్గాల నుంచి స్పందన 

ఆలయ ప్రాంగణంలో  ప్రపంచ వారసత్వ దినోత్సవ నిర్వహణ 

సాక్షి, భూపాలపల్లి: భూపాలపల్లి జయశంకర్‌ జిల్లా నైన్‌పాకలోని సర్వతోభద్ర ఆలయ పునరుద్ధరణను తన వంతు కృషి చేస్తానని ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి తెలిపారు. చిట్యాల మండలంలోని నైన్‌పాక ఆలయం విశిష్టతపై ‘సాక్షి’ ప్రధాన సంచికలో గురువారం ‘దేవుడు ఎదురు చూడాల్సిందే..!’శీర్షికన కథనం ప్రచురితమైంది. ఆలయ విశిష్టతలను తొలిసారిగా సాక్షి దినపత్రిక వెలుగులోకి తీసుకొచ్చింది. దీంతో ఆలయ ప్రత్యేకతలను ప్రజలకు తెలియజేయడానికి ప్రపంచ వారసత్వ దినోత్సవాన్ని నైన్‌పాకలో నిర్వహించారు.

ఇండియన్‌ నేషనల్‌ ట్రస్ట్‌ ఫర్‌ ఆర్ట్‌ అండ్‌ హెరిటేజ్‌ (ఇంటాక్‌) ఆధ్వర్యాన గురువారం ప్రపంచ వారసత్వ దినోత్సవాన్ని నిర్వహించగా ఎమ్మెల్యే హాజరై మాట్లాడారు.  ఆలయానికి ప్రత్యేక గుర్తింపు తీసుకురావడానికి కృషి చేస్తానని చెప్పారు. కాకతీయుల కాలంలో కర్ణాటక నుంచి ఒరిస్సాదాకా కాకతీయుల సామ్రాజ్యం విస్తరించి ఉందని, ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో 350కి పైగా కాకతీయుల కట్టడాలు ఉన్నాయని, నైన్‌పాక దేవాలయానికి కూడా వారసత్వ సంపదలో స్థానం ఉండేలా చర్యలు తీసుకుంటామని కాకతీయ హెరిటేజ్‌ ట్రస్ట్‌ కన్వీనర్, ఇంటాక్‌ కన్వీనర్‌ ప్రొఫెసర్‌ పాండురంగారావు అన్నారు. 

మరిన్ని వార్తలు