తెలుగు పండుగ ముగిసింది.. బాధ్యత మొదలైంది : గవర్నర్‌

19 Dec, 2017 19:58 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : ‘తెలుగు భాష గొప్పదనం, తెలుగు జాతి తియ్యదనం తెలుసుకున్నవారికి తెలుగే ఒక మూలధనం. ఈ గొప్ప సంపదను కాపాడటానికి ప్రతిఒక్కరం చేయి చేయి కలపాలి’’ అని పిలుపునిచ్చారు ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్‌ ఈఎస్‌ఎల్‌ నర్సింహన్‌. మంగళవారం రాత్రి హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో ప్రపంచ తెలుగు మహాసభల ముగింపు వేడుకలో ఆయన ప్రసంగించారు. భారత రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ ఈ వేడుకకు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు, ఉభయ సభల అధ్యక్షులు, పలువురు కీలక నేతలు, భాషాభిమానులు వేడుకలో పాలుపంచుకున్నారు.

మన బాధ్యత ఇప్పుడే మొదలైంది : ‘‘ఐదురోజులపాటు నిర్వహించిన ప్రపంచ తెలుగు మహాసభల ద్వారా అమ్మభాషకు తెలంగాణ ప్రణమిల్లింది. 15 రాష్ట్రాలు, 42 దేశాల నుంచి విచ్చేసిన భాషాభిమానులతో బమ్మెర పోతన ప్రాంగణం పులకరించింది. అవధానాలు, కవి సమ్మేళనాలు, చర్చలు, గోష్టులు, ఇతర సాహిత్య రూపాలు, కళా సాంస్కృతిక కార్యక్రమాలతో మన అందరి హృదయాలు సంతోషంతో నిండిపోయాయి. ఇంత గొప్ప పండుగలో పాలుపంచుకున్న అందరికీ అభినందనలు. మహాసభలు ముగిశాయి. కానీ మన బాధ్యత ఇప్పుడే మొదలైంది. మాతృభాష రక్షణ, వికాసాం కుటుంబం నుంచే మొదలుకావాలి. అందుకు ప్రతి తల్లితండ్రి, గురువులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. పిల్లల పుట్టినరోజులు, ఇతర కార్యక్రమాలప్పుడు ఒక తెలుగు పుస్తకాన్ని బహుమతిగా ఇవ్వాలని కోరుతున్నాను. మహాసభలను విజయవంతంగా నిర్వహించిన ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావుకు, భాగస్వాములైన అందరికీ అభినందనలు. ఈ సందర్భంగా నాకొక పద్యం గుర్తుకొస్తోంది.. ‘తెలుగు భాష గొప్పదనం, తెలుగు జాతి తియ్యదనం తెలుసుకున్నవారికి తెలుగే ఒక మూలధనం. ఈ గొప్ప సంపదను కాపాడటానికి ప్రతిఒక్కరం చేయి చేయి కలపాలి’’  అని గవర్నర్‌ తన ప్రసంగాన్ని ముగించారు.

మరిన్ని వార్తలు