ప్రపంచ తెలుగు మహాసభల జ్యోతియాత్ర

14 Dec, 2017 11:30 IST|Sakshi

పాలకుర్తి/పాలకుర్తి టౌన్‌: ప్రపంచ తెలుగు మహాసభలను పురస్కరించుకుని జనగామ జిల్లా పాలకుర్తి మండలం బమ్మెరలోని పోతన సమాధి వద్ద నుంచి బుధవారం జ్యోతియాత్ర ప్రారంభమైంది. ముందుగా ఇక్కడ తెలుగు మహాసభల సన్నాహక సమావేశం నిర్వహించారు. ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్‌రావు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో కలెక్టర్‌ శ్రీదేవసేనతో పాటు విద్యావేత్త చుక్కా రామయ్య, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత అంపశయ్య నవీన్, కాళోజీ ఫౌండేషన్‌ వ్యవస్థాపక అధ్యక్షుడు నాగిళ్ల రామశాస్త్రి తదితరులు పాల్గొన్నారు.

అనంతరం కలెక్టర్, ఎమ్మెల్యే ఇతర ప్రముఖులు జ్యోతిని వెలిగించి యాత్రను ప్రారంభించారు. అనంతరం వారు మాట్లాడుతూ జ్యోతియాత్ర బమ్మెర నుంచి హైదరాబాద్‌కు శుక్రవారం చేరుతుందని చెప్పారు. తెలుగు విశ్వవిద్యాలయానికి పాల్కురికి సోమనాథుడి పేరు పెట్టాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. సోమేశ్వర లక్ష్మీనర్సింహస్వామి దేవస్థానం, సోమనాథ కళాపీఠం, తెలంగాణ రచయితల సంఘం సంయుక్తంగా నిర్వహించిన జ్యోతియాత్ర కార్యక్రమంలో ఇంకా జాయింట్‌ కలెక్టర్‌ వనజాదేవి, సోమనాథ కళాపీఠం గౌరవ అధ్యక్షుడు డాక్టర్‌ రాపోలు సత్యనారాయణ, అధ్యక్షురాలు రాపోలు శోభరాణి పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు