ఆకాశం అంచులు చూద్దాం

28 Nov, 2014 08:44 IST|Sakshi
ఆకాశం అంచులు చూద్దాం

హుస్సేన్‌సాగర్ చుట్టూ రానున్న టవర్లు
 సింగపూర్, దుబాయ్, షాంఘై నిర్మాణాల పరిశీలన
 కసరత్తు ప్రారంభించిన జీహెచ్‌ఎంసీ
 ప్రపంచ నగరాల సరసన హైదరాబాద్‌కు చోటు!
 పట్టుదలతో ఉన్న రాష్ట్ర సర్కార్

 
ఈ భవంతిని చూశారా... ఇది ప్రపంచంలో అత్యంత ఎత్తయిన భవనంగా గుర్తింపు పొందిన బుర్జ్ ఖలీఫా. దుబాయ్(యూఏఈ) లో ఉంది. దీని ఎత్తు భూమట్టం నుంచి 828 మీటర్లు (2,717అడుగులు). దీనిలో 163 అంతస్తులున్నాయి. ఎక్కడో దుబాయ్‌లో ఉన్న భవనం ప్రస్తావన ఇప్పుడెందుకూ అనుకుంటున్నారా? అక్కడికే వస్తున్నాం. ఆకాశాన్ని తాకేలా కనిపించే ఇలాంటి సుందర భవనాలు మన గ్రేటర్ నగరంలో త్వరలో కనువిందు చేయనున్నాయి. నగరం నడిబొడ్డున ఉన్న హుస్సేన్‌సాగర్ తీరంలో వీటి నిర్మాణానికి ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. తథాగతుని సాక్షిగా... విద్యుల్లతల మధ్య ఠీవీగా దర్శనమిచ్చే ఇలాంటి భవంతులను చూసిన వారు ఆనందాశ్చర్యాలకు గురయ్యేలా నిర్మించాలనేది ప్రభుత్వ యోచన. దీనికి అవసరమైన కార్యాచరణ రూపొందించే పనిలో అధికార యంత్రాంగం బిజీగా ఉంది.
 ఈ నేపథ్యంలో ప్రపంచంలోని వివిధ ప్రాంతాలతో పాటు మన దేశం...మన నగరంలో ఉన్న బహుళ అంతస్తులభవంతుల విశిష్టతలు తెలుసుకుందాం.    
 
ఆకాశహర్మ్యాలకు అనువైన ప్రదేశాలను జీహెచ్‌ఎంసీ గుర్తించింది. వీటి నిర్మాణాలకు గాను నిబంధనలు, ప్రతిబంధకాలు, అనుమతులపై దృష్టి సారించింది. సుప్రీంకోర్టు అనుమతి పొందాల్సి ఉండడంతో అధికార యంత్రాంగం ఆ దిశగా కసరత్తు ప్రారంభించింది. సాగర్‌కు సమీపంలో 18 మీటర్ల కన్నా ఎత్తయిన భవంతులు నిర్మించాలంటే ఎయిర్‌పోర్టు అథారిటీ నుంచి నిరభ్యంతర పత్రం(ఎన్‌ఓసీ) తప్పనిసరి. నిర్మాణ సమయంలో సెట్‌బ్యాక్‌లు, రహదారి వెడల్పు తదితర నిబంధనలు జీహెచ్‌ఎంసీ పరిధిలోనివే కావడం ఒకింత ఊరట.
 
ఆకాశహర్మ్యాలు ఇక్కడే...
 
టవర్ల నిర్మాణానికి లోయర్ ట్యాంక్‌బండ్, బీఆర్‌కే భవన్, పాటిగడ్డ తదితర ప్రాంతాలు అనువుగా ఉన్నాయని అధికారులు గుర్తించారు. అవసరమైతే జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయం స్థానే బహుళ అంతస్తుల భవన నిర్మాణం చేపట్టాలని యోచిస్తున్నట్టు సమాచారం. ఈ భవనాలకు డిజైన్, డ్రాయింగ్, ఆర్కిటెక్చర్ రూపొందించేందుకు జాతీయ, అంతర్జాతీయ కన్సల్టెంట్ల సేవలను వినియోగించుకోనున్నారు.
 
విశ్వనగరం  బాటలో...

 
షాంఘై, సింగపూర్, దుబాయ్, హాంకాంగ్ తదితర దేశాల్లో మాదిరిగా ఇక్కడ కూడా సాగర అందాలు వీక్షించేలా అధునాతన టవర్స్ నిర్మించాలన్న సర్కార్ ఆలోచన బాగానే ఉన్నా... వాటి నిర్మాణానికి అయ్యే వ్యయం వేల కోట్లపైమాటే. ప్రపంచంలో అత్యంత ఎత్తయిన బుర్జ్ ఖలీఫా వంటి భవంతిని మన నగరంలో నిర్మించాలంటే సుమారు రూ.10 వేల కోట్ల వ్యయం అవుతుందని అంచనా. ఇంత భారీ మొత్తాన్ని ప్రభుత్వం వెచ్చిస్తుందా? లేక పబ్లిక్-ప్రైవేటు భాగస్వామ్యంలో వీటి నిర్మాణాన్ని చేపడుతుందా? అన్నది తేలాల్సి ఉంది.
 
షాంఘై  టవర్స్..

 
చైనాలోని షాంఘై నగరంలో ఉందీ టవర్. దీని ఎత్తు 632 మీటర్లు (2,073 అడుగులు). ప్రపంచంలో రెండో ఎత్తయిన భవంతిగా పేరొందింది. నిర్మాణ వ్యయం 4.2 బిలియన్ అమెరికా డాలర్లు. ఈ భవంతిలో 121 అంతస్తులున్నాయి.
 
హైదరాబాద్ నగరంలో..
 
లోధాబెలీజా1: దక్షిణ భారత దేశంలో ఎత్తయిన కట్టడంగా పేరొందిన లోథాబెలీజా టవర్స్ మన నగరంలోనే ఉంది. కేపీహెచ్‌బీ మలేషియా టౌన్‌షిప్‌కు వెనకవైపున ఉన్న ఈ భవంతి ఎత్తు 140 మీటర్లు(459 అడుగులు). ఇందులో 42 అంతస్తులున్నాయి. కాగా గ్రేటర్ నగరంలో 20 అంతస్తులు ఆపైబడిన భవంతులు సుమారు 50 వరకు ఉన్నాయి. మరో వంద వరకు బహుళ అంతస్తుల భవనాలు నిర్మాణంలో ఉండడం విశేషం.
 
బుర్జ్ ఖలీఫా
 
ప్రపంచంలో అత్యంత ఎత్తయిన కట్టడంగా ప్రసిద్ధి చెందిన బుర్జ్ ఖలీఫా టవర్ దుబాయ్ (యూఏఇ)లో ఉంది. దీని ఎత్తు భూమట్టం నుంచి 828 మీటర్లు (2,717 అడుగులు). ఈ భవంతిలో 163 అంతస్తులుండడం విశేషం. దీని నిర్మాణాన్ని ఎమ్మార్ ప్రాపర్టీస్ సంస్థ 2010లో పూర్తి చేసింది. నిర్మాణానికి 150 కోట్ల అమెరికా డాలర్లు (రూ.9వేల కోట్లు) ఖర్చు చేశారు. 900 నివాసాలు, 37 కార్యాలయ అంతస్తులు, 160 అతిథి గదులున్న ఆర్మనీ హోటల్, 144 ప్రైవేటు నివాసాలు, క్లబ్‌లు, రూఫ్‌గార్డెన్‌లు, ఫిట్‌నెస్ క్లబ్‌లు ఈ భవంతిలో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి.
 
మన దేశంలో..
 
మన దేశంలోనే ఎత్తయిన భవంతిగా పేరొందిన ఇంపీరియల్ టవర్-1 ముంబై దక్షిణ ప్రాంతంలో ఉంది. 120 అంతస్తుల భవంతి. ఫ్లోర్ ఏరియా 1.30 లక్షల చదరపు అడుగులు.ఎత్తు 254 మీటర్లు(833 అడుగులు).

మరిన్ని వార్తలు