ఉపాధికి లాక్‌డౌన్

3 Jun, 2020 05:31 IST|Sakshi

ఉద్యోగ, ఉపాధి రంగాలపై లాక్‌డౌన్‌ ప్రభావం తీవ్రం  

‘సెంటర్‌ ఫర్‌ మానిటరింగ్‌ ఇండియన్‌ ఎకానమీ’ నివేదికలో వెల్లడి  

సాక్షి, హైదరాబాద్‌: దేశవ్యాప్తంగా అమల్లో ఉన్న సుదీర్ఘ లాక్‌డౌన్‌ ప్రభావం వివిధ రంగాలపై తీవ్రంగానే కనిపిస్తోంది. కోవిడ్‌ మహమ్మారి ఉధృతి, వైరస్‌ విస్తరణ ఒకవైపు రోజురోజుకూ పెరుగుతుండగా, గత 68 రోజులుగా కొనసాగిన లాక్‌డౌన్‌ వల్ల తీవ్రంగా ప్రభావితమైన వాటిలో ఉద్యోగ, ఉపాధి రంగాలు ముందువరుసలో నిలుస్తున్నాయి. వలస, అసంఘటిత కార్మికులు, ప్రత్యక్షంగా, పరోక్షంగా వివిధ రంగాలపై ఆధారపడి జీవిస్తున్న పేదలు, కూలీలు, ఇతర వర్గాలకు చెందిన చిరుద్యోగులు, ఇతరుల ఉపాధి అవకాశాలపై కోలుకోలేని దెబ్బ పడిందనే విషయం పలు అధ్యయనాలు, పరిశీలనలో వెల్లడైంది. తాజాగా సెంటర్‌ ఫర్‌ మానిటరింగ్‌ ఇండియన్‌ ఎకానమీ (సీఎంఐఈ) నివేదికలో అనేక విషయాలు ప్రస్తుత వాస్తవ పరిస్థితులను కళ్లెదుట నిలబెడుతున్నాయి. మే 24తో ముగిసిన వారాంతం నాటికి దేశ నిరుద్యోగ శాతం 24.3 శాతానికి చేరుకున్నట్టుగా ఇందులో వెల్లడైంది. లాక్‌డౌన్‌ విధింపునకు ముందు మార్చి చివరినాటికి 8.8 శాతమున్న నిరుద్యోగం, రెండునెలలకు పైగా లాక్‌డౌన్‌ కారణంగా అమాంతం మూడురెట్లు పెరిగిపోయింది. 

మే నెలలో కొంత వృద్ధి..
ఇదే సమయంలో దేశంలోని ‘ఎంప్లాయిమెంట్‌ రేట్‌’ ఏప్రిల్‌లో ఉన్న 27 శాతం నుంచి మేలో 29 శాతానికి పెరిగినట్టు సీఎంఐఈ తెలిపింది. ఏప్రిల్‌లో 12.2 కోట్ల మంది ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కోల్పోగా, ఎంప్లాయిమెంట్‌ రేట్‌లో 2 శాతం వృద్ధి కారణంగా దాదాపు రెండుకోట్ల మందికి ఉపాధి లభించడంతో ఉపాధి కల్పనలో మంచి పురోగతి సాధించినట్టుగానే భావించాల్సి ఉంటుందని పేర్కొంది. ఈ కారణంగా ఉపాధి అవకాశాలు కోల్పోయిన వారి సంఖ్య మేలో 10.2 కోట్ల మందికి చేరుకోగా, ఒక నెలలో 2 కోట్ల మందికి ఉపాధి లభించడం కొంత సానుకూల పరిణామమే అని తెలిపింది. అయితే దానికి ఐదింతలుగా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కోల్పోయిన వారి సంఖ్య (10.2 కోట్లు)  ఉండడం సవాళ్లతో కూడుకున్నదేనని ఈ నివేదిక అభిప్రాయ పడింది. సాధారణ పరిస్థితుల్లో సీఎంఐఈ విభిన్నరూపాలు, పద్ధతుల్లో నెలకు 1.17 లక్షల మందిని స్వయంగా కలుసుకుని ఇంటర్వ్యూల ద్వారా నిరుద్యోగం, ఉద్యోగ, ఉపాధి అవకాశాలపై సర్వేలు నిర్వహిస్తుంటుంది. లాక్‌డౌన్‌ విధించాక మాత్రం 12 వేల మందిని ప్రత్యక్షంగా ఇంటర్వ్యూ చేయడంతో పాటు ఇతరుల నుంచి ఫోన్‌ సర్వే ద్వారా అభిప్రాయాలను సేకరిస్తోంది. మహారాష్ట్ర, ఢిల్లీ, తమిళనాడు, గుజరాత్‌ తదితర రాష్ట్రాల్లో కోవిడ్‌ కేసులు గణనీయంగా పెరుగుతుండడంతో పాటు లాక్‌డౌన్‌ కారణంగా ఏర్పడిన అనిశ్చితి, ప్రస్తుతముంటున్న ప్రాంతాల్లో సరైన సౌకర్యాలు కొరవడి సొంత ప్రాంతాలకు వెళ్లే వలస కార్మికుల సంఖ్య భారీగా పెరిగినట్టుగా నిపుణులు అంచనా వేస్తున్నారు.

ఏప్రిల్‌లో తీవ్ర ప్రభావం...
లాక్‌డౌన్‌ కొనసాగింపు, తదితర కారణాలతో ఏప్రిల్‌లో నిరుద్యోగుల సంఖ్య గణనీయంగా పెరిగినట్టుగా సీఎంఐఈ అంచనా వేసింది. లాక్‌డౌన్‌కు ముందే నిరుద్యోగశాతం కొంచెం కొంచెంగా పెరుగుతున్నా, ప్రపంచస్థాయి సరళితో పోల్చి చూస్తే భారత్‌లో ఏప్రిల్‌ నెలలో ఇది ఒక్కసారిగా పెరిగినట్టు తన అధ్యయనంలో ఈ సంస్థ నిర్ధారించింది. జనవరిలో 3.6 శాతమున్న నిరుద్యోగం, ఏప్రిల్‌ నాటికి 14.7 శాతానికి పెరిగినట్టుగా జేఎన్‌యూ ప్రొఫెసర్‌ బిశ్వజిత్‌ధర్‌ తెలిపారు. వలస కార్మికులు సొంత ఊళ్లకు వెళ్లడం వల్ల పరిశ్రమలకు నష్టం వాటిల్లడంతో పాటు గ్రామాల్లో వ్యవసాయ పనులకు పోటీ పెరిగి ఉపాధి తగ్గే అవకాశాలు లేకపోలేదని నిపుణులు చెబుతున్నారు.

2030 ఏళ్ల వారే ఎక్కువ...
లాక్‌డౌన్‌ కారణంగా ఒక్క ఏప్రిల్‌ నెలలోనే 20–30 ఏళ్ల మధ్య వయసు ఉన్నవారు 2.7 కోట్ల మంది ఉద్యోగాలు, ఉపాధి కోల్పోయినట్టుగా ఇటీవల వెల్లడించిన నివేదికలో సీఎంఐఈ స్పష్టం చేసింది. కన్జూ్జమర్‌ పిరమిడ్స్‌ హౌస్‌హోల్డ్స్‌ సర్వేలో 20–24 ఏళ్ల మధ్యనున్న యువకులే ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కోల్పోయిన వారిలో 11 శాతమున్నట్టు, 2019–20లో మొత్తం ఉద్యోగాల్లో ఉన్న వారిలో ఈ యువకులే 8.5 శాతం ఉన్నట్టుగా వెల్లడైంది. 2019– 20లో 3.42 కోట్ల మంది యువతీ యువకులు పనిచేస్తుండగా, ఈ ఏడాది ఏప్రిల్‌లో వారి సంఖ్య 2.09 కోట్లుగా ఉందని ఈ అధ్యయనంలో తేలింది. వీరితో పాటు 25–29 ఏళ్ల మధ్యలోనున్న 1.4 కోట్ల మంది అదనంగా ఉద్యోగాలు కోల్పోయినట్టుగా స్పష్టమైంది. ఇరవయ్యవ పడిలో ఉన్న 2.7 కోట్ల మంది యువకులు ఉద్యోగాలు కోల్పోవడం వల్ల ఏర్పడే ప్రభావం సుదీర్ఘకాలం ఉంటుందని సీఎంఐఈ తెలిపింది. ఏప్రిల్‌లో 30వ పడిలో ఉన్న పురుషులు, స్త్రీలు 3.3 కోట్ల మంది ఉద్యోగాలు కోల్పోగా, వారిలో 86 శాతం మంది పురుషులే ఉన్నట్టుగా సర్వే వెల్లడించింది. 

ఆరేళ్లు వెనక్కి! 
కరోనా ప్రభావంతో గత నెలలో స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖకు తక్కువ ఆదాయం వచ్చింది. గత నెల 6న లాక్‌డౌన్  నిబంధనలు సడలించిన నేపథ్యంలో దాదాపు 20 రోజుల పాటు జరిగిన రిజిస్ట్రేషన్ల ప్రక్రియతో రూ.207 కోట్ల ఆదాయం మాత్రమే వచ్చింది. గతంలో స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ రాబడులను నెలలవారీగా పరిశీలిస్తే ఆరేళ్ల వెనక్కి ఆదాయం వెళ్లిపోయిందని అర్థమవుతోంది. 2014 అక్టోబర్‌లో రూ.179.93 కోట్ల ఆదాయం లభించింది. ఆ తర్వాత ఇంత తక్కువ ఆదాయం రావడం ఈ ఏడాది మేలోనే కావడం గమనార్హం.

మొత్తం కలిపి రూ.220 కోట్లు
ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటికే రెండు నెలలు గడిచిపోగా, స్టాంపుల శాఖకు ఇప్పటివరకు రూ.220 కోట్ల ఆదాయమే వచ్చినట్టు గణాంకాలు చెబుతున్నాయి. కరోనా వ్యాప్తి కారణంగా పూర్తిస్థాయిలో లాక్‌డౌన్‌ అమల్లో ఉండటంలో ఏప్రిల్‌లో రూ.12 కోట్ల ఆదాయమే వచ్చింది. సాధారణంగా ప్రతి నెలలో రూ.500 కోట్లకుపైగా ఆదాయం వస్తుండగా, ఏప్రిల్‌లో రూ.12 కోట్లకే పరిమితమైంది. రిజిస్ట్రేషన్‌  లావాదేవీలు కూడా అత్యల్పంగా జరిగాయి. ప్రతి నెలలో లక్షన్నర వరకు రిజిస్ట్రేషన్‌  లావాదేవీలు జరుగుతుండగా, ఏప్రిల్‌లో 4,595 లావాదేవీలు మాత్రమే జరిగాయి. ఇక, మేలో జరిగిన 75,129 లావాదేవీలకు గాను రూ.207.73 కోట్ల ఆదాయం వచ్చింది. దాదాపు 20 రోజులు మాత్రమే రిజిస్ట్రేషన్‌  కార్యకలాపాలు జరగ్గా సగటున రోజుకు రూ.10 కోట్ల మేర వచ్చింది. సాధారణ పరిస్థితుల్లో రోజుకు రూ.20 కోట్ల వరకు ఆదాయం వచ్చేదని, ఇప్పుడు అందులో సగం వరకు ఆదాయం వచ్చిందని, లాక్‌డౌన్‌  పరిస్థితుల్లో కూడా ఈ మేర ఆదాయం రావడం మంచి పరిణామమేనని రిజిస్ట్రేషన్ల శాఖ అధికారులు చెబుతున్నారు. జూన్‌ లో పరిస్థితిలో కొంత మార్పు వస్తుందని, జూలై చివరి నాటికి సాధారణ పరిస్థితులు నెలకొనే అవకాశముందని అంచనా వేస్తున్నారు. 

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు