విలీనం.. వికారం

5 Sep, 2018 07:46 IST|Sakshi
గుదిమళ్లలోని ఓ వీధిలో నిలిచిన మురుగునీరు (ఇన్‌సెట్‌) పెదతండాలో బురదమయంగా బజారు

ఖమ్మంరూరల్‌: గ్రామాలు, తండాలు అభివృద్ధి చెందుతాయనుకున్నారు.. వీధులన్నీ అద్దంలా మెరుస్తాయనుకున్నారు.. మురుగు కాల్వలన్నీ మెరుగు పడతాయనుకున్నారు.. అపరిష్కృత సమస్యలన్నీ తీరి.. అభివృద్ధి బాట పడతాయనుకున్నారు. కానీ.. అంతా తారుమారైంది. కార్పొరేషన్‌ లో విలీనమైన గ్రామాలు వికారం పుట్టి స్తున్నాయి. సమస్యలు విలయతాండవం చేస్తున్నాయి. మురుగు, చెత్తతో కంపుకొడుతూ దర్శనమిస్తున్నాయి. ఇక్కడ ప్రత్యేకాధికారులు లేకపోవడంతో పాలన కుంటుపడింది. వెంటనే వారిని నియమించాలని విలీన గ్రామాల ప్రజలు డిమాండ్‌ చేస్తున్నారు. 

ఖమ్మం రూరల్‌ మండలం పెదతండా, గుర్రాలపాడు, వెంకటగిరి, గుదిమళ్ల, ఏదులాపురం గ్రామ పంచాయతీలను ఆగస్టు 2న ఖమ్మం కార్పొరేషన్‌లో విలీనం చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అప్పటి నుంచి ఆయా గ్రామాలకు ప్రత్యేకాధికారులను నియమించలేదు. దీంతో నెల రోజులుగా పాలన కుంటుపడింది. విలీన సమయంలోనే తమ పంచాయతీలను కార్పొరేషన్‌లో విలీనం చేయొద్దని ప్రజాప్రతినిధులకు, అధికారులకు ఆయా పంచాయతీల ప్రజలు, రాజకీయ నాయకులు ప్రభుత్వానికి మొరపెట్టుకున్నారు. అయితే అవేమీ పట్టించుకోకుండా ప్రభుత్వం ఆయా గ్రామాలను కార్పొరేషన్‌లో విలీనం చేసింది.

సమస్య జఠిలం 
ఇదిలా ఉండగా.. విలీనమైన 5 గ్రామాలకు చెందిన కొందరు తమ గ్రామాలను కార్పొరేషన్‌లో విలీనం చేయడాన్ని సవాల్‌ చేస్తూ హైకోర్టుకు వెళ్లారు. దీంతో విలీన తంతును నిలిపివేయాలని హైకోర్టు తాత్కాలిక స్టే విధించింది. ప్రస్తుతం అక్కడ ఎటువంటి అభివృద్ధిచేయాలన్నా.. పాలక వర్గామైనా ఉండాలి.. లేదా ప్రత్యేకాధికారులైనా ఉండాలి. విలీన అంశం కోర్టు పరిధిలో ఉండడంతో ప్రత్యేకాధికారులు నియామకం కాక, పాలకవర్గం లేక ఆయా గ్రామాల ప్రజలు నలిగిపోతున్నారు. కోర్టు స్టే సమయం ఎప్పుడు పూర్తవుతుందో.. తమ సమస్యలు ఎప్పు డు తీరుతాయోనని ప్రజలు ఎదురుచూస్తున్నారు.
 
తిష్ట వేసిన సమస్యలు 
కార్పొరేషన్‌లో విలీనమైన వెంకటగిరి, పెదతండా, ఏదులాపురం, గుదిమళ్ల, గుర్రాలపాడులో వివిధ సమస్యలు తిష్ట వేశాయి. సైడు కాల్వల్లో మురుగును తీయకపోవడం, వీధుల్లో పేరుకుపోయిన చెత్తను తొలగించకపోవడంతో దుర్గంధం వెదజల్లుతోంది. నెల రోజుల నుంచి ఏ అధికారి కూడా విలీన గ్రామాల వైపు కన్నెత్తి చూడకపోవడంతో ప్రస్తుతం అక్కడి ప్రజల బాధలు వర్ణనాతీతం. ప్రస్తుతం వర్షాకాలం కావడంతో కాల్వలు, గుంతల్లో మురుగునీరు చేరి దోమలు వ్యాప్తి చెంది ప్రజలు జ్వరాల బారిన పడుతున్నారు.

నగర శివారు రాజీవ్‌ గృహకల్ప వీధుల్లో పందులు సంచరిస్తూ.. అపరిశుభ్రంగా ఉండడంతో అక్కడి ప్రజలు నరకం అనుభవిస్తున్నారు. ఇక తాగునీటి విషయంలో నెల రోజులుగా స్వచ్ఛమైన నీరు అందడం గగనమైంది. ఓహెచ్‌ఎస్‌ఆర్‌ ట్యాంక్‌లలో బ్లీచింగ్‌ వేయకుండానే నేరుగా నీటిని సరఫరా చేస్తున్నారు. అందులో పురుగులు, క్రిమికీటకాలు వస్తున్నాయని ప్రజలు ఆరోపిస్తున్నారు. రాజీవ్‌ గృహకల్పకు తాగునీరు అందించే మోటార్‌ ఇటీవల వచ్చిన వర్షాలకు వరదలతో మున్నేటిలో మునిగిపోవడంతో అక్కడ నీటి సరఫరా వారం రోజులుగా నిలిచిపోయింది. ఇలా తీరొక్క సమస్యలు విలీన గ్రామాల ప్రజలను వేధిస్తున్నాయి.
 
కొత్త ఇళ్లకు అనుమతిచ్చేవారేరి? 
నగరానికి అతి సమీపంలో పెదతండా, ఏదులాపురం వెంకటగిరి, గుర్రాలపాడు గ్రామాలు ఉన్నాయి. వాటి పరిధిలోని పరిసర ప్రాంతాల్లో కొత్తగా ఇళ్లు నిర్మించుకునే వారు అధిక సంఖ్యలో ఉన్నారు. అయితే ఇళ్లకు అనుమతి ఇచ్చే అధికారులు లేకపోవడంతో అవస్థలు పడుతున్నారు. గతంలో పంచాయతీ కార్యదర్శి నుంచి అనుమతి తీసుకునేవారు. ఇప్పుడు ఆ గ్రామాలు కార్పొరేషన్‌లో విలీనం కావడంతో కార్పొరేషన్‌ అధికారులే అనుమతులు ఇవ్వాల్సి ఉంటుంది. ప్రస్తుతం విలీన అంశం కోర్టు పరిధిలో ఉండడంతో ఇళ్ల నిర్మాణాలు చేపట్టేవారు అయోమయానికి గురవుతున్నారు. కాగా.. విలీన గ్రామాలకు ప్రభుత్వం ప్రత్యేకాధికారులను నియమించకపోవడంతో తమ సమస్యలు ఎవరికి చెప్పుకోవాలో తెలియక ప్రజలు అవస్థలు పడుతున్నారు. ఆయా గ్రామాల్లో పాలన పూర్తిగా కుంటుపడింది. ఇప్పటికైనా విలీన పంచాయతీలకు ప్రత్యేకాధికారులను నియమించాలని ఆయా గ్రామాల ప్రజలు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.

మురుగు తీయట్లేదు.. 
నెల రోజులుగా సైడ్‌ కాల్వల్లో ఉన్న మురుగును తీయడం లేదు. దీంతో పగలు, రాత్రి దోమలు కుడుతున్నాయి. రాత్రయితే నిద్ర ఉండట్లేదు. దోమలు కుట్టడంతో విష జ్వరాలు వస్తున్నాయి. తండాలో మురుగునీటి కంపుతో ఉండలేకపోతున్నాం. వెంటనే కాల్వల్లో మురుగును తీసేయాలి.  \– ధరావత్‌ గోలీ, పెదతండా 
 
బురదలో ఇబ్బందులు.. 

వర్షం వస్తే తండాలో మోకాళ్ల లోతున బురద ఉంటుంది. అందులో నడవలేకపోతున్నాం. గతంలో సర్పంచ్‌కు చెబితే తీయించాడు. ఇప్పుడు ఎవరికి చెప్పాలో తెలవడం లేదు. రోడ్లమీద చెత్త పెరిగిపోతుంది. తండాలో ఉండాలంటేనే నరకం గుర్తుకొస్తుంది.  – ధరావత్‌ అస్లీ, చిన్నతండా 
 
ప్రత్యేకాధికారిని నియమించాలి.. 

గ్రామాలను కార్పొరేషన్‌లో విలీనం చేసి చేతులు దులుపుకున్నారు. నెల రోజులైనా అధికారి లేకపోవడంతో ఎక్కడి సమస్యలు అక్కడే ఉన్నాయి. తమ సమస్యలు ఎవరికి చెప్పుకోవాలో అర్థం కావడం లేదు. ప్రభుత్వం స్పందించి విలీన గ్రామాలకు వెంటనే ప్రత్యేకాధికారులను నియమించాలి.  – పొదిల సతీష్, వెంకటగిరి 
 
మున్సిపల్‌ అధికారులదే.. 

విలీనమైన ఐదు పంచాయతీలు తమ శాఖ పరిధిలో లేవు. ఆ గ్రామాలు మున్సిపల్‌ కార్పొరేషన్‌లో విలీనమయ్యాయి. ఇప్పుడు పంచాయతీరాజ్‌ శాఖ తరఫున అభివృద్ధి కోసం ఒక్క రూపాయి ఖర్చు చేసే అవకాశం లేదు. ప్రత్యేకాధికారులను నియమించే అంశం తమ పరిధిలో లేదు. అదంతా మున్సిపల్‌ అధికారులే చూసుకోవాలి.  – శ్రీనివాసరెడ్డి, డీపీఓ 
 
కోర్టు స్టే ఉంది.. 

మున్సిపల్‌ కార్పొరేషన్‌లో విలీనమైన ఐదు పంచాయతీలకు సంబంధించి కోర్టు స్టే ఉంది. ప్రస్తుతం ఏమీ చేయలేని పరిస్థితి. ఆ గ్రామాలు పూర్తిగా తమ పరిధిలోకి రాలేదు. కాబట్టి ఈ విషయంలో ప్రత్యేకాధికారులను నియమించలేం. – జోగినిపల్లి శ్రీనివాసరావు, కార్పొరేషన్‌ కమిషనర్‌

మరిన్ని వార్తలు