బడి.. సమస్యల ఒడి

19 Jan, 2019 02:17 IST|Sakshi

తాగునీటికి కటకటే.. పీఈటీలకు దిక్కులేదు..

పాఠశాలల్లో సదుపాయాల లెక్క తేల్చిన అసర్‌ 

రాష్ట్రంలోని పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కొరతతో విద్యార్థులకు ఇబ్బందులు తప్పట్లేదు. ఎక్కువ శాతం పాఠశాలల్లో తాగునీటి సమస్యతో విద్యార్థులు తంటాలు పడుతున్నారు. బాలికలకు ప్రత్యేక టాయిలెట్ల సదుపాయం గతంలో కంటే కొంత మెరుగైనా.. ఇంకా పూర్తిస్థాయిలో సమకూరకపోవడంతో బాలికలకు ఇబ్బందులు తప్పట్లేదు. మరోవైపు విద్యా బోధనలో అవసరమైన లైబ్రరీలు, కంప్యూటర్లు లేవు. విద్యార్థుల శారీరక ఎదుగుదల, మానసిక ఉల్లాసానికి దోహదపడే ఆట స్థలాలు లేక తరగతి గదికే విద్యార్థులు పరిమితం కావాల్సి వస్తోంది. పాఠశాలల్లో నెలకొన్న ఇలాంటి అనేక సమస్యలను ఇటీవల విడుదలైన అసర్‌ సర్వే బయటపెట్టింది. 
– సాక్షి, హైదరాబాద్‌

ఆటలకు తంటాలే..
పలు పాఠశాలల్లో ఆట స్థలాల్లేక, ఆడించే వారు (పీఈటీ) లేక ఎలిమెంటరీ విద్యార్థులకు ఆటలే లేకుండా పోయాయి. 23 శాతం పాఠశాలల్లో ఆట స్థలాలు విద్యార్థులకు అందుబాటులో లేవు. 39.9 శాతం పాఠశాలల్లో ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌ టీచర్లు (పీఈటీ) అందుబాటులో లేరు.ఆట స్థలాల పరిస్థితీ అలాగే ఉంది. 2010లో రాష్ట్రంలోని 83.9 పాఠశాలల్లో ఆట స్థలాలు ఉంటే ఏటా వాటి సంఖ్య తగ్గుతూ వస్తోంది. 2014లో ఆట స్థలాలు 76.7 శాతం పాఠశాలకు పరిమితం కాగా, 2016లో 78 శాతానికి, 2018లో 77 శాతం పాఠశాలలకు పరిమితమయ్యాయి. మిగతా 23 శాతం పాఠశాలల్లో 6.2 శాతం స్కూళ్లకు ఆట స్థలాలే లేకపోగా, 16.7 శాతం పాఠశాలలకు దూరంగా ఆట స్థలాలు ఉన్నాయి. 

టాయిలెట్ల పరిస్థితి మెరుగైనా.. 
రాష్ట్రంలోని పాఠశాలల్లో టాయిలెట్ల సదుపాయం ఐదేళ్ల కిందటితో పోలిస్తే కొంత మెరుగైంది. అయితే రెండేళ్ల కిందటితో పోలిస్తే మాత్రం టాయిలెట్లు లేని పాఠశాలల సంఖ్య పెరిగింది. 2010లో టాయిలెట్లు లేని పాఠశాలలు 23.4% ఉంటే, 2014 నాటికి 13 శాతానికి తగ్గింది. 2016 నాటికి వాటి సంఖ్య మరింతగా తగ్గి 1.9 శాతానికి చేరింది. కానీ 2018 వచ్చేసరికి టాయిలెట్లు లేని పాఠశాలల సంఖ్య 3.5 శాతానికి పెరిగింది. బాలికలకు  ప్రత్యేక టాయిలెట్ల విషయంలో పరిస్థితి మాత్రం రెండేళ్ల కిందటితో పోలిస్తే సగానికి సగం మెరుగైంది. 2010లో 53.1 పాఠశాలల్లో బాలికలకు ప్రత్యేక టాయిలెట్లు లేకపోగా, 2014 నాటికి వాటి సంఖ్య 28.4 శాతానికి తగ్గింది. 2016కి టాయిలెట్లు లేని పాఠశాలల సంఖ్య 15.1% ఉండగా 2018 నాటికి 8.7 శాతానికి చేరుకుంది. ఈ సంవత్సరంలో మరో 8.7 శాతం టాయిలెట్లకు తాళాలు వేసి ఉన్నాయి. మరో 10.7 శాతం వినియోగించడానికి వీల్లేని పరిస్థితి నెలకొంది. మొత్తం 71.9 శాతం పాఠశాలల్లో బాలికల ప్రత్యేక టాయిలెట్లు వినియోగంలో ఉన్నాయి. 

అసర్‌ నివేదికలోని మరికొన్ని ప్రధానాంశాలు.. 
- 41 వేలకు పైగా ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు ఉంటే అందులో 42.8% పాఠశాలల్లో విద్యార్థులకు తాగునీటికి తంటాలు తప్పట్లేదు. 
55.7% పాఠశాలల్లోనే లైబ్రరీలు ఉండి, వాటిని వినియోగిస్తున్నారు. 22.3 శాతం పాఠశాలల్లో లైబ్రరీలు లేకపోగా మరో 22% పాఠశాలల్లో లైబ్రరీలు ఉన్నా వినియోగంలో లేవు. లైబ్రరీల్లో ఉన్న కొన్ని పనికిరాని పుస్తకాలు కావడం, వాటిని ఉపయోగించుకునే స్థితి 
లేకపోవడంతో ఉన్నా లేనట్లే వాటి పరిస్థితి తయారైంది. 
​​​​​​​- రాష్ట్రంలోని 89.5% పాఠశాలల్లో కంప్యూటర్లు లేకపోవడం పరిస్థితికి అద్దం పడుతోంది. 3.1% పాఠశాలల్లోనే కంప్యూటర్లు పని చేస్తుండగా, మరో 7.4% పాఠశాలల్లో అవి వినియోగంలోనే లేవు. 

మరిన్ని వార్తలు