హరితాభివృద్ధి వైపు అడుగులు

30 May, 2020 04:20 IST|Sakshi

ఆ దిశగా ప్రభుత్వాలు పటిష్ట చర్యలు చేపట్టాలి

డబ్ల్యూఆర్‌ అంటూ వైఎస్సార్‌ ఆత్మీయంగా పలకరించేవారు

ఎన్‌ఐఆర్‌డీ డీజీగా రిటైర్డ్‌ అయిన డా.డబ్ల్యూఆర్‌ రెడ్డితో ‘సాక్షి’ఇంటర్వ్యూ

సాక్షి,హైదరాబాద్‌: ప్రస్తుత కోవిడ్‌ నేపథ్యంలో ఎదురవుతున్న ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని హరితాభివృద్ధి దిశగా గట్టి అడుగులు పడాలని నేషనల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ రూరల్‌ డెవలప్‌మెంట్‌ అండ్‌ పంచాయతీరాజ్‌ (ఎన్‌ఐఆర్‌డీ, పీఆర్‌) డైరెక్టర్‌ జనరల్‌ డాక్టర్‌ డబ్ల్యూఆర్‌ రెడ్డి సూచించారు. ఈ దిశగా ప్రభుత్వాలు పటిష్ట చర్యలు చేపట్టాల్సి ఉందన్నారు. వాతావరణ మార్పులు, పర్యావరణం, వన్య ప్రాణులకు హాని చేయడం మూలంగా ఇప్పుడీ పరిస్థితులు ఏర్పడ్డాయన్నారు. డా.డబ్ల్యూఆర్‌ రెడ్డిగా సుపరిచితులైన ఉదారం రాంపుల్లారెడ్డి, అఖిల భారత సర్వీస్‌లో 34 ఏళ్ల పాటు పనిచేసి శుక్రవారం ఎన్‌ఐఆర్‌డీ డీజీగా పదవీ విరమణ పొందారు. ఈ సందర్భంగా ఆయన ‘సాక్షి’తో మాట్లాడారు.

ఐఎఫ్‌ఎస్‌ వచ్చినా చేరలేదు...: ‘34 ఏళ్ల సర్వీసు వెనక్కి తిరిగి చూసుకుంటే చాలా సంతృప్తికరంగా ఉంది. ఎక్కడా కూడా గతంలో ఇలా చేసి ఉంటే బాగుండేదేమో అన్న పునరాలోచనే కలుగలేదు. ‘వర్క్‌ ఈజ్‌ వర్షిప్‌’అనే దాన్ని నేను నమ్ముతాను. ఇకపై వ్యవసాయ, గ్రామీణాభివృద్ధి, పంచాయతీ వ్యవస్థల బలోపేతానికి మరో 15ఏళ్ల పాటు కృషి చేస్తా. తొలి ప్రయత్నంలో ఐపీఎస్‌కు ఎంపికై హైదరాబాద్‌లోని నేషనల్‌ పోలీస్‌ అకాడమీలో 6 నెలలు శిక్షణ పొందాను. రెండో ప్రయత్నంతో ఐఏఎస్‌కు సెలక్టయ్యా. 1984లో ఐఎఫ్‌ఎస్‌కు ఎంపికైనా చేరలేదు. 1986లో ఐఏఎస్‌గా కేరళ కేడర్‌కు ఎంపికయ్యాను. అధికార విధుల్లో భాగంగా 1990–95 ప్రాంతాల్లో దివంగత నేత, మాజీ ముఖ్యమంత్రి డా.వైఎస్‌ రాజశేఖరరెడ్డితో పరిచయం ఏర్పడింది. ఆయన డబ్ల్యూఆర్‌ అంటూ ఆత్మీయంగా పలకరించేవారు. కడప జిల్లాలో ప్రాజెక్ట్‌ డైరెక్టర్‌గా పనిచేసినప్పుడు వైఎస్‌తో కలసి వివిధ పనుల్లో పనిచేశా.

కరువు ప్రభావిత ప్రాంతం కడపలో వాటర్‌షెడ్లు ఇతర అభివృద్ధి పనులు సంతృప్తినిచ్చాయి. 2009లో రెండోసారి వైఎస్సార్‌.. సీఎం అయ్యాక ఆగస్టులో నేను కలసి అడగగానే చేవెళ్ల సమీపంలో ఆగ్రో బిజినెస్, అగ్రికల్చర్‌ ఎడ్యుకేషన్, మేనేజ్‌మెంట్‌ ఎడ్యుకేషన్, ఇంజనీరింగ్‌ విభాగాల్లో శిక్షణ, బోధన కోసం ఏర్పాటు చేసిన సాగర్‌ గ్రూప్‌ ఆఫ్‌ ఎడ్యుకేషనల్‌ ఇనిస్టిట్యూట్‌ను ప్రారంభించారు’అని ఆయన వివరించారు. ‘ఎన్‌ఐఆర్‌డీ డీజీగా అవకాశం రావడం దేవుడిచ్చిన గొప్ప వరంగా భావిస్తా. 2016లో బాధ్యతలు చేపట్టాక అనేక మార్పులు తీసుకొచ్చాం. శిక్షణ, పరిశోధన రంగాలను పటిష్టం చేశాం. ఫ్యాకల్టీ పెంచడం, గ్రామీణాభివృద్ధికి సంబంధించి వినూత్న కోర్సులు ప్రవేశపెట్టడం, సర్పంచ్‌లకు ఆన్‌లైన్‌ పాఠాలు, వైవిధ్య కోర్సులు, ‘రిస్క్‌’పేరిట స్టార్టప్‌లు, ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు, పరిశోధకులకు ప్రోత్సాహం లాంటి అనేక కార్యక్రమాలు చేపట్టాం. నా సర్వీస్‌లో చివరి నాలుగేళ్లు ఎంతో సంతృప్తిని ఇచ్చింది’అని డబ్ల్యూఆర్‌ రెడ్డి వెల్లడించారు.

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు