సిబ్బంది కొరతే శాపమా?

21 Jun, 2014 04:22 IST|Sakshi
  •      కేఎంసీలో సీట్ల కొనసాగింపునకు ఎంసీఐ ససేమిరా
  •      కలెక్టర్ లేఖ రాసినా...స్పందించని గత ప్రభుత్వం
  •      పునఃపరిశీలనపై జిల్లా వాసుల ఆశలు
  •      డిప్యూటీ సీఎం స్పందించాలని వినతి    
  • ఎంజీఎం : వరంగల్‌లోని కాకతీయ మెడికల్ కళాశాల(కేఎంసీ)తో పాటు అనుబంధ టీచింగ్ ఆస్పత్రుల్లో ఒకటైన ఎంజీఎం ఆస్పత్రిలో వైద్యసిబ్బంది కొరతే.. కేఎంసీలో 50 సీట్ల రద్దు నిర్ణయానికి కారణమని తెలుస్తోంది. కేఎంసీ, ఎంజీఎంలో వైద్య సిబ్బంది కొరత, పరికరాల లేమిపై ‘సాక్షి’ దినపత్రికలో గతంలో పలు కథనాలు ప్రచురితమయ్యాయి.

    వీటిపై స్పందిం చిన జిల్లా కలెక్టర్ కిషన్ స్పందించి అప్పటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి వైద్యసిబ్బంది నియమించాలని కోరుతూ లేఖ రాసినా ఎవరూ పట్టించుకోలేదు. మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా(ఎంసీఐ) అధికారులు కేఎంసీలో గత నెల 9, 10వ తేదీలోల నిర్వహించిన తనిఖీల సందర్భంగా పలు లోపాలను గుర్తించారు. అనంతరం వారు ప్రభుత్వానికి ఇచ్చిన నివేదికలో కూడా సిబ్బంది కొరత విషయాన్ని పేర్కొనడంతో కేఎంసీలోని యాభై సీట్లు రద్దయ్యే అవకాశం కనిపిస్తోంది.
     
    54 మంది వైద్యుల కొరత

    కాకతీయ మెడికల్ కళాశాలతో పాటు ఎంజీఎం ఆస్పత్రిలో మొత్తం వివిధ విభాగాల్లో 266 మంది వైద్యులు విధులు నిర్వర్తించాల్సి ఉంటుంది. అయితే, కేవలం 212 మంది వైద్యులే ఉండగా.. మిగతా 54 మంది వైద్యులను నియమించాలని స్వయంగా కలెక్టర్ కిషన్ మూడు నెలల క్రితం లేఖ రాశారు. 17 ప్రొఫెసర్ పోస్టులు, 04 అసోసియేట్ ప్రొఫెసర్లు పోస్టులతో పాటు 30 అసిస్టింట్ ప్రొఫెసర్ పోస్టులు ఖాళీగా ఉండగా, మరికొన్నింటిని కూడా ప్రభుత్వం భర్తీ చేయలేదు. దీంతో ఎంసీఐ బృందం కేఎంసీ కళాశాలలో 5 శాతం సిబ్బంది కొరత ఉందని నివేదికలో పేర్కొంది.
     
    పత్తా లేని సూపర్ స్పెషాలిటీ పోస్టులు
     
    1956లో 80 పడకలతో స్థాపించిన ఎంజీఎం ఆస్పత్రిని 1976 ప్రభుత్వం తన పరిధిలోకి తీసుకుని 690 పడకలుగా అభివృద్ధి చేసి కాకతీయ మెడికల్ కళాశాలకు అనుసంధానం చేసింది. అనంతరం 2005లో అప్పటి ముఖ్యమంత్రి రాజశేఖర్‌రెడ్డి వేయి పడకల ఆస్పత్రిగా ఎంజీఎంను అప్‌గ్రేడ్ చేస్తూ సూపర్‌స్పెషాలిటీ సేవలకు నాంది పలికారు.

    కానీ ఇప్పటి వరకు సూపర్ స్పెషాలిటీ వైద్యసేవలకు సంబంధించి ఒక్క పోస్టు కూడా భర్తీ చేయకపోవడంతో అటు వైద్యవిద్యార్థులతో పాటు ఇటు రోగులు తీవ్రంగా నష్టపోతున్నారు. సూపర్‌స్పెషాలిటీ సేవలైనా న్యూరాలజీ, ఎండ్రోక్రైనాలజీ, నెఫ్రాలజీ, గ్యాస్ట్రో ఎంట్రాలజీ, న్యూరోసర్జరీ, యూరాలజీ, ప్లాస్టిక్ సర్జరీ, పిడియాట్రిక్ సర్జరీ వంటి విభాగాల్లో నెప్రాలజీ, యూరాలజీ డిపార్టుమెంట్లలో ఒక్కో ప్రొఫెసర్ పోస్టు తప్ప మిగతావన్నీ ఖాళీ గానే ఉన్నాయని ఆస్పత్రి వర్గాలు డీఎంఈ పుట్ట శ్రీనివాస్ సైతం ఇటీవల నివేదిక సమర్పించారు.
     
    డిప్యూటీ సీఎం చొరవ కోసం ఎదురుచూపు
     
    వరంగల్‌లోని కేఎంసీతో పాటు టీచింగ్ ఆస్పత్రిగా ఉన్న ఎంజీ ఎంలో వెంటనే సిబ్బంది నియామకాలు చేపడితేనే కేఎంసీలో సీట్లు రద్దయ్యే ప్రమాదం నుంచి తప్పించుకోవచ్చు. దీనిపై జిల్లాకు చెందిన డిప్యూటీ సీఎం, రాష్ర్ట వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి తాటికొండ రాజయ్య చొర చూపాలని.. ఆ తర్వాత ఎంసీఐ బృందం పునఃపరిశీలన జరిగితే తప్ప సీట్లు దక్కవని వైద్యులు పేర్కొంటున్నారు. ఆంధ్రప్రదేశ్ వైద్యవిధాన పరిషత్, డెరైక్టర్ పబ్లిక్ హెల్త్ ద్వారా కేఎంసీలో సిబ్బంది కొరతను తీర్చి మెడికల్ సీట్లను కాపాడాల్సిన బాధ్యతను ప్రజాప్రతినిధులు తీసుకోవాలని ఓరుగల్లు ప్రాంత విద్యార్థులు కోరుతున్నారు.
     

మరిన్ని వార్తలు