అనగనగా ఓ రచయిత్రి

31 Aug, 2019 10:45 IST|Sakshi

చక్కని రచనలు శ్రీదేవిరెడ్డి సొంతం

బతుకమ్మ, బోనాల విశిష్టతను చెబుతూ పాటలు

‘దొరసాని’ చిత్రానికి కవితలు కూడా..

సాక్షి,సిటీబ్యూరో :తల్లి సరదాగా రాసిన కథలు చదివి స్ఫూర్తి పొందిన ఓ యువతి తనూ అదే మార్గంలో ప్రయాణం మొదలుపెట్టారు. తెలుగు భాషపై పట్టు సాధించి అక్షరాలతో చెలిమి చేశారు. అలా తన మనసులోనిభావాలను కథలు, కవిత్వంగా మలిచి.. పుస్తకాల్లో అచ్చుగా చూసుకుని మురిసిపోయారు. ఆ రచనలు ప్రజాబాహుళ్యంలో ప్రాచుర్యం పొందడంతో పాటు తనకంటూ గుర్తింపు తెచ్చాయి. ఆమే నగరానికి చెందినతంగెళ్ల శ్రీదేవిరెడ్డి.

50కి పైగా కథలు ప్రచురణ
రామంతపూర్‌లో నివాసముంటున్న తక్కెళ్లపల్లి శ్రీదేవిరెడ్డి తల్లి సుజాత కూడా పలు రచనలు చేశారు. అమ్మ నుంచి నేర్చుకున్న కథా నేర్పును శ్రీదేవిరెడ్డి ఒంటబట్టించుకున్నారు. ఈమె బతుకమ్మ, బోనాలు వంటి ప్రత్యేక వేడుకల కోసం రాసిన పాటలు అందరి నోళ్లలో పలుకుతున్నాయి. అంతేకాదు.. కథా వ్యాసాంగంలోనూ తనదైన ముద్ర వేస్తున్నారామె. శ్రీదేవి ఇప్పటి దాకా దెయ్యం, దేవుడు పారిపోయాడు, ఇన్నూరు, కావలి బుడ్డమ్మ తదితర 50కి పైగా కథలు రాశారు. ఇవి పలు దినపత్రికల్లో ప్రచురణ కూడా అయ్యాయి. కథలు శ్రీదేవి ఊహల నుంచి పుట్టినవే అయినా.. ప్రతి కథా నిజ జీవితాలను ప్రబింబించడం గమనార్హం. అంతేకాదు.. అచ్చమైన పల్లె జీవన నాటిని ఒడిసిపట్టుకున్న శ్రీదేవిరెడ్డి చక్కని వాడుక పదాలతో రాసిన ‘కాముని పండుగ, ఎల్లగొట్టు’ వంటి కథల్లో వనపర్తి, ఆత్మకూరు, గద్వాల వంటి గ్రామాల్లోని ప్రజలు మాట్లాడే పదాలు, వారి జీవనాన్ని ప్రతిబింబిస్తాయి. శ్రీదేవిరెడ్డి రాజకీయ నేతల పొలిటికల్‌ క్యాంపెయిన్‌ పాటలు సైతం రాశారు. వీటిలో వైఎస్సార్‌సీపీకి, జగన్‌ వ్యక్తిత్వంపై, పొన్నం ప్రభాకర్‌ వంటి వారికి రాశారు. ప్రత్యేకహోదాపై రాసిన పాటను ఎంతో గుర్తింపు పొందింది.  

సినీ కవిత్వంలోనూ దిట్ట
ఇటీవల విడుదలైన ‘దొరసాని’ సినిమాలో హీరో.. హీరోయిన్‌ను చూసిన ప్రతిసారీ ఓ కవిత చెబుతాడు. అవన్నీ శ్రీదేవి రాసినవే కావడం విశేషం. ఈమె ప్రతిభన గుర్తించిన శ్రీ పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ‘వాసిరెడ్డి రంగనాయకమ్మ సార్మక పురస్కారం’తో సత్కరించింది. కళాసంస్కృతి సంస్థ ‘కవితారాణి’, సూర్యచంద్ర సాంస్కృతిక సంఘ సేవా సంస్థ ‘గౌడ కవితారత్న’, హైదరాబాద్‌ సిటీ కేబుల్‌ నుంచి ‘బెస్ట్‌ రైటర్‌’ వంటి అవార్డులు అందుకున్నారు.

ఈ కథలు బాగా ఫేమస్‌
‘ప్లాస్టిక్‌ పూలు, పరమవీర చక్ర, టీజింగ్‌ రోమియో, అర్థాలే వేరులే, ఎదురింట్లో భామ–ఇంట్లో భామ, ద్వంసగీతం, ఒక ప్రేమకథ, ఎరుపెక్కిన తెల్లగులాబి, మస్కా, అమ్మ, సదువు, ఊహల పల్లకిలో, తనశవమై ఒకరికి వశమై, ప్రేమశకలం, మేఘమాల, ఆ రాత్రి, లవ్లీ మై హీరో, అమ్మకొడుకు, ప్రేమ శకలం, మాతృ హృదయం, నువ్వొస్తావని, వేకువ, మందాకిని’ వంటి కథలు పాఠకులకు బాగా చేరువయ్యాయి. ఇక ‘ఆశ్రమం, పూలు నలుగుతున్నాయి, నాయిన, చారాణ, అమ్మా మల్లెప్పుడొస్తవే!, మొగిలి, ష్‌.., తాత చెప్పిన కథ, వెన్నెల కురుస్తుందో లేదో!, పాడుబడ్డ బాయి, తగలబడిన వెన్నెల’ వంటి కథలు ఆన్‌లైన్‌ కూడా ఎంతో పేరు, ప్రఖ్యాతులు తెచ్చిపెట్టాయి.   

అందరికీ చేరువవ్వాలి  
నాకు చిన్నప్పటి నుంచి కథలు, కవితలు రాయడమంటే చాలా ఇష్టం. నిజ జీవితానికి దగ్గరగా, ప్రతి ఒక్కరి హృదయాన్ని తాకేలా నా రచనలు ఉంటాయి. కొన్ని సినిమా కథలు కూడా సిద్ధం చేసుకున్నాను. బతుకమ్మ, బోనాలకు గ్రామాల్లో ఉండే వాతావరణాన్ని ప్రపంచానికి తెలిసేలా పాటలు రాశాను.–  తంగెళ్ల శ్రీదేవిరెడ్డి, రచయిత్రి

మరిన్ని వార్తలు