‘ఈఓడీబీ’లో రాష్ట్రానికి అన్యాయం

5 Aug, 2018 01:55 IST|Sakshi

ఏపీతో సమానంగా తెలంగాణకు దక్కాల్సిన అగ్రస్థానం

గణనలో కేంద్ర పరిశ్రమల శాఖ అధికారుల తప్పిదాలు

తుది ర్యాంకులపై సమాచారం ఇవ్వాలని అడిగినా స్పందించని వైనం

అందుబాటులో ఉన్న సమాచారంతో గణన.. తప్పులు గుర్తింపు

తప్పులు సవరించి తుది ర్యాంకులు ఇవ్వాలని కోరనున్న రాష్ట్ర ప్రభుత్వం

సాక్షి, హైదరాబాద్‌: ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌ (ఈఓడీబీ) ర్యాంకుల్లో తమకు అన్యాయం జరిగిందని రాష్ట్ర ప్రభుత్వం వాదిస్తోంది. ఈఓడీబీలో మెరుగైన మార్కులు సాధించినా సాంకేతిక కారణాల వల్ల ర్యాంకు మారిపోయిందని ఆరోపిస్తోంది. తెలంగాణతోపాటు ఇతర రాష్ట్రాల ర్యాంకులూ తారుమారైనట్లు అభిప్రాయపడుతోంది. కేంద్ర ప్రభుత్వ అధికారుల తప్పిదాల వల్లే తెలంగాణకు మొదటి ర్యాంకు రాలేదని, ఈ ప్రక్రియ ఈఓడీబీ ర్యాంకుల ప్రామాణికతనే ప్రశ్నార్థకంగా మార్చిందని వాదిస్తోంది. ఈ మేరకు విషయాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్లాలని నిర్ణయించింది.

గణనలో తప్పులు
2017–18కి గాను కేంద్ర పరిశ్రమల శాఖ రాష్ట్రాల వారీగా ఈఓడీబీ ర్యాంకులను జూలై 10న ప్రకటించింది. ఇందులో ఆంధ్రప్రదేశ్‌కు తొలి స్థానం, తెలంగాణకు రెండో స్థానం లభించింది. హరియాణా మూడో స్థానంలో నిలిచింది. ర్యాంకుల ప్రకటనలో 372 సంస్కరణల తాలూకు అంశాలను పరిగణనలోకి తీసుకున్నారు. ఈ 372 అంశాల అమలు, పరిశ్రమ వర్గాల నుంచి ఫీడ్‌ బ్యాక్‌ తీసుకుంటూ ర్యాంకులు ఖరారు చేశారు. అయితే ర్యాంకుల మూల్యాంకనంలో తప్పులు దొర్లాయని, కొన్ని రాష్ట్రాలకు నష్టం జరిగేలా గణన జరిగిందని తెలంగాణ ఆరోపిస్తోంది.

‘ఫీడ్‌బ్యాక్‌’ ఏదీ?
తుది ర్యాంకులు ప్రకటించే ముందు పరిశ్రమల నుంచి వచ్చిన ఫీడ్‌బ్యాక్‌ మార్కులను రాష్ట్ర ప్రభుత్వాలకు తెలుపుతామని కేంద్రం గతంలో ప్రకటించింది. కానీ సమాచారం లేకుండానే ర్యాంకులు ప్రకటించింది. ర్యాంకుల తర్వాత కూడా మూల్యాంకనం తీరుపై సమాచారం ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం తరపున సీఎస్‌ లేఖ రాసినా కేంద్రం స్పందించలేదు.

దీంతో రాష్ట్ర పరిశ్రమల శాఖ కమిషనర్‌ స్వయంగా ఢిల్లీ వెళ్లి కేంద్ర ప్రభుత్వ సంయుక్త కార్యదర్శిని కలిసే ప్రయత్నం చేశారు. కానీ ఆయన సమయం ఇవ్వకపోవడంతో అనుమానం వ్యక్తం చేసిన రాష్ట్ర ప్రభుత్వం.. అందుబాటులో ఉన్న సమాచారంతో కేంద్ర పరిశ్రమల శాఖ మార్గదర్శకాలకు అనుగుణంగా గణన చేసింది. గణనలో ఏపీతోపాటు తెలంగాణకూ అగ్రస్థానం దక్కాల్సినన్ని మార్కులొచ్చాయి.

368 ప్రశ్నలకు వందశాతం మార్కులు
372 ప్రశ్నలకు జరిగిన మూల్యాంకనంలో 368 ప్రశ్నలకు 100 శాతం మార్కులు తెలంగాణకు వచ్చాయి. మిగిలిన 4 ప్రశ్నలు తెలంగాణకు సంబంధించినవి కాకపోవడంతో 100 శాతం మార్కులను జ్యూరీ ప్రకటించింది. ఫీడ్‌బ్యాక్‌కు సంబంధించిన 78 ప్రశ్నల్లోనూ తెలంగాణకు 83.95 శాతం మార్కులొచ్చాయి. సంస్కరణల అమలు మరియు ఫీడ్‌బ్యాక్‌కు సంబంధించిన అంశాలు పరిగణనలోకి తీసుకున్న తర్వాత తెలంగాణకు 98.3 శాతం మార్కులు దక్కాయి.

మరోవైపు ఏపీకి కూడా 372 ప్రశ్నల్లో 368 ప్రశ్నలే మూల్యాంకనం జరిగాయి. మిగిలిన 3 ప్రశ్నలు ఏపీకి సంబంధం లేనివి కాగా ఒక ప్రశ్నకు సంబంధించిన సంస్కరణను అమలు చేయలేకపోయింది. దీంతో తెలంగాణతో సమానంగా ఏపీకీ 368 ప్రశ్నలకు మార్కులొచ్చాయి. ఫీడ్‌బ్యాక్‌ అంశాల్లోనూ 86.5 శాతం మార్కులు లభించాయి. మొత్తంగా ఏపీకీ 98.3 మార్కులొచ్చాయి. ఆ మేరకు ఏపీ, తెలంగాణలకు కలిపి అగ్రస్థానం ఇవ్వాలి. కానీ కేంద్రం తెలంగాణకు 2వ ర్యాంకు కట్టబెడుతూ తుది ర్యాంకులు ప్రకటించింది.

జార్ఖండ్‌కు మూడుకు బదులు నాలుగు
మూల్యాంకనం, మార్కుల గణనలో జరిగిన తప్పులను పరిగణనలోకి తీసుకొని తుది ర్యాంకులు ప్రకటించాల్సిందిగా కేంద్రాన్ని కోరాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. గణనలో లోపాల వల్ల ఇతర రాష్ట్రాల ర్యాంకుల్లోనూ తేడాలొచ్చాయని.. మూడో స్థానంలో ఉండాల్సిన జార్ఖండ్‌ నాలుగో స్థానంలో, ఆరో స్థానంలో నిలవాల్సిన మధ్యప్రదేశ్‌ 7వ స్థానంలో నిలిచిందని రాష్ట్ర ప్రభుత్వం అభిప్రాయపడుతోంది. దీంతో మరిన్ని రాష్ట్రాలు సైతం కేంద్ర పరిశ్రమల శాఖ ర్యాంకుల డొల్లతనంపై విమర్శలు చేస్తున్నాయి.

మరిన్ని వార్తలు