‘వేలు’ పెడితే కోట్లొస్తాయ్‌!  

24 May, 2018 08:55 IST|Sakshi
మూలకు పడిన జిరాక్స్‌ మిషన్‌

నిమ్స్‌ సీసీయూలో మూలనపడిన జిరాక్స్‌ మిషన్‌

పెండింగ్‌లో సుమారు రూ.6 కోట్ల బిల్లులు..?

మరమ్మతులు అదిగో.. ఇదిగో అంటూ కాలక్షేపం

రూ.13 వేల వెచ్చింపునకు అంతులేని కాలయాపన

హైదరాబాద్‌ : నిమ్స్‌ ఆస్పత్రికి రావాల్సిన పెండింగ్‌ బిల్లులు ఓ జిరాక్స్‌ మిషన్‌ కారణంగా ఆగిపోయాయంటే నమ్మగలరా..! కానీ.. నమ్మాల్సిందే.. అక్షరాలా రూ.6 కోట్లు వివిధ సంస్థల నుంచి నిమ్స్‌కు రావాల్సి ఉన్నాయి. ప్రతిష్టాత్మకమైన నిమ్స్‌ ఆస్పత్రిలో చికిత్స కోసం ఈహెచ్‌ ఎస్‌ స్కీం ద్వారా  నిత్యం వివిధ ప్రభుత్వ కార్యాలయాల ఉద్యోగులు వచ్చి చికిత్స పొందుతారు.

ఇలా చికిత్స పొందిన వారిలో ఆర్టీసీ, బీఎస్‌ఎన్‌ఎల్, సీజీహెచ్, సింగరేణి, రైల్వే, ఈఎస్‌ఐతో పాటు అసెంబ్లీ ఉద్యోగులు ఉన్నారు. వారికి అవసరమైన చికిత్స నిర్వహించిన అనంతరం అందు కు సంబంధించిన బిల్లులను నిమ్స్‌ యాజమాన్యం ఆయా సంస్థలకు పంపి వసూలు చేస్తుంది. జిరాక్స్‌ మిషన్‌ను బాగుచేసేందుకు కేవలం రూ.13వేలు మాత్రమే అవుతాయి. కానీ ఆస్పత్రి ఉన్నతాధికారులు పెద్దగా పట్టించుకోకపోవడం తో నాలుగు నెలలుగా అది మూలకు పడింది.   

ఎందుకీ దుస్థితి..  

నిమ్స్‌ స్పెషాలిటీ బ్లాకులో క్రిడెట్‌ కలెక్షన్‌ యూనిట్‌ (సీసీయూ)ఉంది. ఆస్పత్రిలో ఈహెచ్‌ఎస్‌ ద్వారా చికిత్స పొందిన వివిధ ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన బిల్లులను ఆయా సంస్థలకు పంపి వసూలు చేయాలి. అందుకు వారికి వచ్చిన బిల్లులను నకళ్లను తీసి క్లెయిమ్‌ కోసం పంపించాల్సి ఉంటుంది. అందుకోసం 2011లో జిరాక్స్‌ మిషన్‌ను నిమ్స్‌ యాజమాన్యం కొనుగోలు చేసింది.

దీనికి సంబంధిత తయారీ సంస్థ ఇచ్చిన లైఫ్‌ 6 లక్షల కాఫీలకు మాత్రమే. అయితే సుమారు 10 లక్షల కాఫీలను తీసి మిషన్‌ అలసిపోయింది. నాలుగు నెలలుగా జిరాక్స్‌ మిషన్‌ మూలకు పడి ఉంటోంది.  

ఎమ్మార్డీ నుంచి క్రిడెట్‌ కలెక్షన్‌ యూనిట్‌కు రాని బిల్లుల ఫైళ్లు  

ఆస్పత్రిలో చికిత్స పొందిన వారి బిల్లులను ఎమ్మార్డీ యూనిట్‌కు పంపుతారు. అక్కడ నుంచి క్రిడెట్‌ కలెక్షన్‌ యూనిట్‌కు రావాల్సి ఉంది. అయితే చాలా ఫైళ్లు క్రిడెట్‌ కలెక్షన్‌ యూనిట్‌ రావాల్సిఉందని అక్కడ సిబ్బంది చెబుతున్నారు. ఎంతో విలువైన ఫైళ్లను నిర్లక్ష్యంగా సిబ్బంది నేలపై పడేశారు. వాటిలో కోర్టు కేసులకు సంబంధించిన మెడికో లీగల్‌ ఫైళ్లు ఉన్నాయి. అక్కడ ర్యాకులు లేకపోవడంతో.. వర్షం వస్తే ఫైళ్లు తడిసిపోతున్నాయి.  

మరిన్ని వార్తలు