పాస్‌బుక్ జిరాక్స్ ఇతరులకు ఇచ్చాడని..

11 Jul, 2015 02:47 IST|Sakshi
పాస్‌బుక్ జిరాక్స్ ఇతరులకు ఇచ్చాడని..

- బ్యాంక్ మేనేజర్‌పై చేయి చేసుకున్న రైతు  
- పోలీసులకు ఫిర్యాదు  
- ఆందోళనకు దిగిన అన్నదాతలు
- క్షమాపణ చెప్పిన మేనేజర్
- నవాబుపేటలో ఘటన
నవాబుపేట:
బ్యాంకులోని తన పాస్‌పుస్తకం జిరాక్స్ ఇతరులకు ఎందుకిచ్చారని ఆగ్రహానికి గురైన ఓ రైతు మేనేజర్‌పై చెప్పుతో దాడిచేశాడు. మేనేజర్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో రైతులు ఆందోళనకు దిగారు. అనంతరం మేనేజర్ క్షమాపణ కోరడంతో సమస్య సద్దుమణిగింది. ఈ సంఘటన శుక్రవారం నవాబుపేటలో చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మండల కేంద్రం లో దాతాపూర్ గ్రామానికి చెందిన రైతు బాల్‌రెడ్డికి కొంతపొలం ఉంది. అందులోని 200 గజాలను యావాపూర్‌కు చెందిన శ్రీశైలంకు విక్రయించాడు.

సదరు భూమిలో శ్రీశైలం ఇటీవల ఓ భవనం నిర్మించి ఎస్‌బీహెచ్‌కు అద్దెకు ఇచ్చాడు. ఇదిలా ఉండగా, బాల్‌రెడ్డి తన పట్టా పాస్‌పుస్తకాన్ని తనఖా పెట్టి బ్యాంకులో పంట రుణం తీసుకున్నాడు. ఈ నెల4న బాల్‌రెడ్డి పాస్‌బుక్ జిరాక్స్ కాపీని బ్యాంకు మేనేజర్ శ్రీనివాస్ యావాపూర్ గ్రామానికి చెందిన కావలి నర్సింలుకు ఇచ్చా డు. ఇటీవల ఈ విషయం బాల్‌రెడ్డికి తెలిసిం ది. ఈవిషయాన్ని తేల్చుకునేందుకు ఆయన రెండు రోజులుగా బ్యాంకుకు వెళ్లినా మేనేజర్ విధులకు రాలేదు. దీంతో బాల్‌రెడ్డి తిరిగి శుక్రవారం బ్యాంకుకు వెళ్లి తనకు తెలియకుండా తన పాసుపుస్తకం జిరాక్సు ఇతరులకు ఎందుకిచ్చారని మేనేజర్ శ్రీనివాస్‌ను నిలదీశాడు. ఈ విషయమై ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. ఆగ్రహానికి గురైన బాల్‌రెడ్డి మేనేజర్‌పై చెప్పుతో దాడి చేశాడు. వెంటనే మేనేజర్ సమాచారంతో పోలీసులు అక్కడికి చేరుకున్నారు.

బ్యాంకు వద్దే ఉన్న సుమారు 50 మంది రైతులు, ఖాతాదారులు రైతుకు మద్దతుగా నిలిచారు. రైతుకు తెలియకుండా పాస్‌బుక్ జిరాక్స్ కాపీని ఇతరులకు ఎందుకు ఇచ్చారని నిలదీసి తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. మేనేజర్ శ్రీనివాస్‌కు రైతులంటే చులకన, ఆయన బ్యాంకుకు వచ్చే వారిని ఇబ్బందులకు గురిచేస్తున్నాడని ఆరోపించారు. పోలీసులు రైతులను సముదాయించినా ఫలితం లేకుండా పోయింది. మేనేజర్ ఇక్కడ పనిచేసేందుకు వీలు లేదని, ఆయనను తక్షణమే సస్పెండ్ చేసి కొత్త మేనేజర్‌ను నియమించాలని డిమాండు చేశారు.

దీంతో మేనేజర్ శ్రీనివాస్ ఆందోళన చేస్తున్న రైతులు, ఖాతాదారులను సముదాయించారు. పొరపాటు జరిగింది క్షమించాలని కోరాడు. బాల్‌రెడ్డికి తెలియకుండా ఆయన పాసుపుస్తకం జిరాక్సు కాపీని ఇతరులకు ఇవ్వడం పొరపాటేనని అంగీకరించారు. దీంతో రైతులు, ఖాతాదారులు ఆందోళన విరమించి అక్కడి నుంచి వెళ్లిపోయారు. కాగా, ఇరువర్గాల వారు పోలీసులకు మొదట ఫిర్యాదు చేశారు. అనంతరం రాజీకి వచ్చారు.

మరిన్ని వార్తలు