'రెండు రాష్ట్ర ప్రభుత్వాలు మాటలే తప్ప చేతల్లేవు'

15 Feb, 2015 14:29 IST|Sakshi
'రెండు రాష్ట్ర ప్రభుత్వాలు మాటలే తప్ప చేతల్లేవు'

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాలు మాటలే తప్ప చేతల్లేవని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ ఆరోపించారు.  అభివృద్ధి, సంక్షేమం రెండుకళ్లుగా దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి రాష్ట్రాన్ని పాలించారని అన్నారు. ఒక్క రూపాయి కూడా ఛార్జీలు పెంచకుండా ఆయన పాలన సాగించారని ఆమె గుర్తు చేశారు. వైఎస్ ప్రవేశ పెట్టిన సంక్షేమ పథకాలను బతికించుకుందామని... పార్టీని అందరం కలిసి ముందు తీసుకెళ్తామని వైఎస్ విజయమ్మ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.

ఆదివారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలోని తెలంగాణ రాష్ట్ర కార్యాలయాన్ని ఆమె ప్రారంభించారు. అనంతరం వైఎస్ విజయమ్మ మాట్లాడుతూ... ప్రతి నిమిషం ప్రజలకు ఏం చేయాలన్న తపనే వైఎస్ఆర్లో ఉండేదని తెలిపారు. ప్రతి ఒక్కరికి సాయపడాలన్నదే వైఎస్ఆర్ సంకల్పమన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందాలని ఆయన తపించారని చెప్పారు. వైఎస్ఆర్కు కులం, మతం, ప్రాంతం, పార్టీ అన్న తేడాల్లేవని పేర్కొన్నారు. వైఎస్ఆర్ ప్రభుత్వం మన ప్రభుత్వమని ప్రజలందరూ భావించేలా కృషి చేశారని వైఎస్ విజయమ్మ తెలిపారు.

మరిన్ని వార్తలు