అద్భుతంగా యాదాద్రి నిర్మాణం

1 Jan, 2019 03:21 IST|Sakshi

గవర్నర్‌ నరసింహన్‌ స్వామివారికి ప్రత్యేక పూజలు 

అనంతరం ఆలయ నిర్మాణ పనుల పరిశీలన 

యాదగిరిగుట్ట: రాష్ట్రంలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయ పునర్నిర్మాణం పనులు అద్భుతంగా జరుగుతున్నాయని గవర్నర్‌ నరసింహన్‌ అన్నారు. యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయాన్ని సోమవారం గవర్నర్‌ నరసింహన్‌ సతీసమేతంగా దర్శించుకున్నారు. అర్చకులు, ఆలయ అధికారులు వారికి పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా గర్భాలయంలోని స్వామి, అమ్మవార్లకు గవర్నర్‌ సువర్ణ పుష్పార్చన నిర్వహించారు. అర్చకులు వేద మంత్రాలతో ఆశీర్వచనం చేశారు.

అనంతరం గవర్నర్‌ ఆలయ పునఃనిర్మాణ పనులు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గర్భాలయాన్ని ఏమాత్రం ముట్టుకోకుండా, స్వయంభూ మూర్తులను కదల్చకుండా ఆలయాన్ని నిర్మిస్తున్నారని పేర్కొన్నారు. ఆలయ నిర్మాణంలో స్థపతులు, అధికారులు బాగా శ్రద్ధ చూపుతున్నారని అన్నారు. యాదాద్రి ఆలయ నిర్మాణం పూర్తయితే చాలా అద్భుతంగా ఉంటుందన్నారు. ప్రధాన ఆలయాన్ని కృష్ణ శిలతో తీర్చిదిద్దుతున్నారని తెలిపారు. ఆయన వెంట కలెక్టర్‌ అనితారామచంద్రన్, వైటీడీఏ వైస్‌ చైర్మన్‌ కిషన్‌రావు, ఆలయ ఈఓ గీతారెడ్డి తదితరులున్నారు.

మరిన్ని వార్తలు