సిద్ధమవుతున్న యాదాద్రి ధ్వజస్తంభం

19 Jan, 2019 02:29 IST|Sakshi

మరో 15 రోజుల్లో పనులు పూర్తి  

యాదగిరికొండ: యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం ప్రధానాలయ పునర్నిర్మాణంలో భాగంగా ధ్వజస్తంభం సిద్ధమవుతోంది. ఈ ధ్వజస్తంభంలోనే సమస్త శక్తులు ఇమిడి ఉంటాయనేది పురాణాలు చెబుతున్నాయి. దీనిని ప్రత్యేక శ్రద్ధతో తయారు చేస్తారు. యాదాద్రి ధ్వజస్తంభాన్ని నారవేప కర్రతో తయారు చేస్తున్నారు. మరో 15 రోజుల్లో ఇది పూర్తికానుంది. ప్రధానాలయం మొత్తం ఎత్తు 50 నుంచి 60 అడుగుల మధ్యలో ఉండటంతో ధ్వజస్తంభానికి 40 అడుగుల కర్రను వాడుతున్నారు. దాని ఎత్తు 40 ఫీట్లు ఉంటుంది. ఇంతకుముందు ఆలయంపైన ధ్వజారోహణ చేసేవారు. ఇప్పుడు ఆలయంలోపలే వస్తుండటంతో స్తంభానికి చేసే ప్రతి కార్యక్రమం ఆలయంలోపలే చేయాల్సి ఉంటుంది.  

అందంగా సాలహారం పనులు  
యాదాద్రి క్షేత్రానికి సాలహారం పనులు అమితమైన అందాన్ని తీసుకువస్తున్నాయి. ప్రతి ఆలయానికీ సాలహారం పనులే ఆకర్షణనిస్తాయని స్థపతులు చెబుతున్నారు. ప్రస్తుతం యాదాద్రి క్షేత్రానికి చుట్టూ ఉన్న ఆలయ ప్రాకారాలకు సాలహారం పనులు జరుగుతున్నాయి. ఆలయ ప్రాకారం గోడలకు దండ మాదిరిగా చేసే శిల్పాకృతుల పనులే సాలహారం. ఆలయానికి రానున్న సప్త రాజగోపురాల పనులు మరో వారంలో పూర్తికానున్నాయి. 6 రాజగోపురాల పనులు పూర్తిచేశారు. ఇంకా మిగిలి ఉన్న సప్తతల ప్రధాన రాజగోపురం పనులు మరో రెండు మూడు రోజుల్లో పూర్తిచేయనున్నారు. శివాలయంలో సైతం ప్రధానాలయంతో పోటీ పడి పనులు జరిపిస్తున్నారు.

తోగుట పీఠాధిపతి మాధవానంద స్వామీజీ సూచనల మేరకు ప్రధానాలయం ప్రతిష్ఠలో భాగంగానే శివాలయ ప్రతిష్ఠ కార్యక్రమాలను నిర్వహించాలని భావిస్తున్నారు. చినజీయర్‌ స్వామి సూచించిన తేదీల ప్రకారంగానే 2 ఆలయాల పనులు మార్చిలో పూర్తి చేయాలని వైటీడీఏ అధికారులు కృషిచేస్తున్నారు. శివాలయం ముందు ఐదు అంతస్థుల ప్రధాన ద్వారం పనులు జరుగుతున్నాయి. ఈ పనులు మరో 10 రోజుల్లో పూర్తి చేసి ఫిబ్రవరి నెలాఖరుకల్లా పనులు చేస్తామని పేర్కొంటున్నారు. 

మరిన్ని వార్తలు