టార్గెట్‌ ఫిబ్రవరి..!

16 Nov, 2019 08:58 IST|Sakshi

90శాతం పూర్తయిన ప్రధానాలయం

డిసెంబర్‌ నెలాఖరుకు పూర్తికానున్న శిల్పాల పనులు 

సాక్షి, యాదాద్రి : రెండో తిరుమలగా రూపుదిద్దుకుంటున్న యాదాద్రి పుణ్యక్షేత్రం అభివృద్ధి పనులను సీఎం కేసీఆర్‌ ఇచ్చిన ఫిబ్రవరి గడువులోగా పూర్తి చేయడానికి వైటీడీఏ అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టారు. ఇందులో భాగంగా చకచకా పనులు చేపడుతున్నారు. ఫిబ్రవరిలో మహా సుదర్శన యాగంతో స్వామి, అమ్మవార్ల నిజదర్శనం కల్పించాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే. అంటే ఫిబ్రవరి మాసానికి ఇంకా సరిగ్గా 80రోజులు మాత్రమే ఉంది. సుమారుగా వందరోజుల వ్యవధిలో మహోన్నత కార్యక్రమం చేపట్టనున్నారు. ఈనేపథ్యంలో యాదా ద్రి అభివృద్ధి, ఆలయ పునర్నిర్మాణ పనుల్లో వేగం పెరిగింది.

గర్భాలయం, ప్రధానాలయం, శివాలయం, కొండచుట్టూ రింగ్‌రోడ్డు, విద్యుదీకరణ, కింద చేపట్టిన పనులు వేగవంతమయ్యాయి. సీఎం కేసీఆర్‌ ఆగస్టు 17న యాదాద్రికి పర్యటించిన సందర్భంగా ఇచ్చిన ఆదేశాలతో పనుల్లో కొంత పురోగతి కనిపిస్తోంది. ఫిబ్రవరిలో మహాయాగానికి చేపట్టి ప్రధానాలయంలో భక్తులకు స్వామివారి దర్శనాన్ని కల్పించే నిర్ణయం చేసినట్లు ఆయన వెల్లడించిన విషయం తెలిసిందే. దీపావళి సందర్భంగా సీఎం శ్రీశ్రీ త్రిదండి చినజీయర్‌స్వామిని కలిసినప్పుడు కూడా యాదాద్రిని ప్రత్యేకంగా ప్రస్తావించిన విషయం తెలిసిందే. సీఎం ఎప్పటికప్పుడు పనులను పర్యవేక్షించడంతో పాటు అధికారులకు సూచనలు, సలహాలు అందజేస్తున్నారు. 

పనులు ఇలా..
గర్భాలయం ముందు భాగంగా ప్రహ్లాద చరిత్ర, నవనారసింహుల అవతారాలను దివ్యంగా చెక్కారు. ప్రధానాలయం పనుల్లో వేగం పెరిగింది. ఫ్లోరింగ్‌ పనులు జరుగుతున్నాయి. గర్భాలయం, ప్రధానాలయానికి ద్వారాలు బిగించారు. ముఖమండపం, క్షేత్రపాలకుడు ఆంజనేయస్వామి ఆలయం విస్తరణ చేపట్టారు. గరత్మంతుడు, ఆంజనేయస్వామి విగ్రహాల ఏర్పాటు ఆలయ నవీకరణ, ఆలయంలో ఫ్లోరింగ్‌ పనులు, ప్రాకార మండపాల పనులు, మాఢవీధుల్లో ఫ్లోరింగ్‌ పనులు తుదిదశకు చేరుకున్నాయి.

అష్టభుజి మండపాలపై శిల్పాలకు మెరుగుదిద్దడం, పంచతల రాజగోపురాలపై మండపాల ఏర్పాటు, తిరుమాఢవీధుల్లో ఫ్లోరింగ్‌ పనుల వేగం పుంజుకున్నాయి. కొండపైన సత్యనారాయణ వ్రతమండపం, ప్రసాదాల తయారీ భవనం, యజ్ఞశాల,  కల్యాణమండపం, అష్టభుజి ప్రాకారాల తుది మెరుగులు, ఆలయంలో విద్యుదీకరణ పనులు జరుగుతున్నాయి. ఏసీల ఏర్పాటు పనులు ప్రారంభమయ్యాయి. శివాలయం పనుల్లో వేగం పెంచారు. శివాలయంపైన పంచారామక్షేత్ర నమూనాలు సిద్ధం చేస్తున్నారు. రిటైనింగ్‌ వాల్‌ పనులు చురుకుగా సాగుతున్నాయి. 

రహదారుల విస్తరణ పనులు..
యాదాద్రి ప్రధానాలయానికి నలుదిక్కులా రో డ్ల విస్తరణపై అధికారులు దృష్టిసారించారు. ఇం దుకోసం ప్రభుత్వం రూ.75కోట్లు మంజూరు చేసింది. ప్రస్తుతం ఉన్న రోడ్ల వెడల్పు, మరమ్మతులు చేపడుతున్నారు. కొండచుట్టూ ఉన్న రింగ్‌రోడ్డుకు స్థానిక రోడ్లను అనుసంధానం చేస్తున్నారు. 1.50 ఫీట్ల రోడ్డులో రెండు వైపులా 65ఫీట్ల వెడల్పుతో రోడ్ల మధ్యలో 20ఫీట్ల వెడల్పుతో డివైడర్లు నిర్మించి వాటిలో పచ్చదనాన్ని పర్చనున్నారు.

రాయిగిరి–యాదగిరిగుట్ట విస్తరణలో పాతగుట్ట క్రాస్‌ రో డ్డు నుంచి ప్రధానాలయం వరకు  రోడ్డు వెడ ల్పు చేయడంతోపాటు సెంట్రల్‌ లైటింగ్, ఇ రువైపులా మొక్కలు నాటడం, రోడ్డును తీర్చిదిద్దే పనుల్లో ఉన్నారు. పాతరోడ్లను పూర్తిగా తొలగించి కొత్త రోడ్లను వేస్తున్నారు. ఇటీవల వర్షాల కు దెబ్బతిన్న రోడ్లకు మరమ్మతులు చేస్తున్నారు.   

గోశాలలో సబ్‌స్టేషన్‌ పనులు పూర్తి..
ముందుగా కొండపైనే ఏర్పాటు చేయాలనుకున్న 33/11 కేవీ సబ్‌స్టేషన్‌ను గోశాలలో ఏర్పాటు చేశారు. యాదాద్రి దేవస్థానం, పట్టణానికి 24గంటల నిరంతర విద్యుత్‌ సరఫరా కోసం 132/11 కేవీ సబ్‌స్టేషన్‌ను మల్లాపురం రోడ్డులో చేపట్టారు. గోశాలలో సబ్‌స్టేషన్‌ పూర్తయింది. కొండచుట్టూ చేపట్టే ఔటర్‌రింగ్‌రోడ్డు వెంట విద్యుత్‌ స్తంభాల ఏర్పాటు పనులు జరుగుతున్నాయి. రోడ్డు విస్తరణతో రహదారికి సమాంతరంగా టవర్లు ఏర్పాట్లు చేస్తున్నారు. 

మహాసుదర్శన యాగం ఏర్పాట్లు..
యాదాద్రిలో ఫిబ్రవరిలో 1,008 యజ్ఞగుండాలతో చేపట్టే మహాసుదర్శన యాగానికి సిద్దం అవుతున్నారు. ఇందుకోసం దేశంలోని పీఠాధిపతులను ఆహ్వానించనున్నారు. 3వేలమంది రుత్విక్కులు, వారికి సహాయకులుగా 6వేల మందితో 11రోజుల పాటు యాగాన్ని నిర్వహించనున్నారు. ఇందుకోసం ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే గండి చెరువు సమీపంలో యాగశాలను ఏర్పాటు చేసే పనిలో ఉన్నారు. దేశం నలుమూలల నుంచి వచ్చే ప్రముఖులకు బస ఏర్పాట్లను చేసే పనిలో ఉన్నారు. 

డిసెంబర్‌ చివరి నాటికి పూర్తి?
ప్రధానాలయం శిల్పి పనులను డిసెంబర్‌ చివరి నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. వైటీడీఏ వైస్‌చైర్మన్‌ కిషన్‌రావు, ఆలయ ఈఓ గీతారెడ్డి, ఆర్కిటెక్ట్, స్థపతులు ఆనందసాయి, వేలుతో కూడిన బృందం పనులు పూర్తి చేయించడానికి తీవ్రంగా కృషి చేస్తున్నారు. స్వామివారి ప్రధానాలయం పనుల్లో 90శాతం పూర్తయ్యాయి. మిగతా వాటిని కూడా ఒక యజ్ఞంలా భావించి పూర్తి చేయిస్తున్నారు. ప్రస్తుతం బ్రహ్మోత్సవ మండపం పనులు పూర్తి కావొస్తున్నాయి.  

మరిన్ని వార్తలు