దసరా నుంచి దర్శనభాగ్యం..!

7 Dec, 2017 04:11 IST|Sakshi

     భక్తులను పరవశింపజేయనున్నయాదాద్రి లక్ష్మీనరసింహుడు

     ఒకేసారి ఆలయం మొత్తం పూర్తి.. ప్రారంభం 

     తొలుత గర్భాలయం పూర్తి చేయాలని నిర్ణయం 

     విడతలవారీగా సరికాదన్న చినజీయర్, పండితులు

     వారి సూచన మేరకు సీఎం తాజా ఆదేశం 

     ప్రారంభోత్సవానికి రాష్ట్రపతి, ప్రధాని మోదీ..! 

     దేశంలోని అందరు పీఠాధిపతులకు ఆహ్వానం 

సాక్షి, హైదరాబాద్‌: మహాక్షేత్రంగా రూపుదిద్దుకుంటున్న యాదాద్రి దివ్యాలయంలో వచ్చే దసరా నుంచి స్వయంభూ లక్ష్మీ నరసింహస్వామి భక్తకోటికి దర్శనమివ్వనున్నాడు. యాదగిరిగుట్ట అన్ని వసతులతో సర్వాంగసుందరంగా రూపుదిద్దుకుని యాదాద్రిగా భక్తజనాన్ని పరవశింపజేయనుంది. తెలంగాణ తిరుమలగా అన్ని హంగులతో కొత్తరూపు సంతరించుకుంటున్న ఈ దివ్యక్షేత్రం.. అలనాటి నిర్మాణం తరహాలో భారీ హంగులతో సిద్ధమవుతున్న విషయం తెలిసిందే. ఫిబ్రవరిలో జరిగే లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాల నాటికి గర్భాలయాన్ని సిద్ధం చేసి.. ప్రస్తుతం బాలాలయంలో ఉన్న ఉత్సవమూర్తులను ప్రధాన మందిరంలో పునః ప్రతిష్టించి భక్తులకు దర్శనభాగ్యం కల్పించాలని తొలుత నిర్ణయించారు. అయితే మహాక్షేత్రంగా కొత్త రూపు సంతరించుకుంటున్న ఆలయం అసంపూర్తిగా తిరిగి ప్రారంభమవడం సరికాదని ఆగమశాస్త్ర పండితులు సహా.. తొలి నుంచీ ఆలయ పనులు పర్యవేక్షిస్తున్న చినజీయర్‌ స్వామి విడతలవారీ పనిని వ్యతిరేకించారు. దీంతో జోక్యం చేసుకున్న ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు.. ఆలయ అభివృద్ధి ప్రాధికార సంస్థకు తాజాగా స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. పనుల వేగాన్ని పెంచి, వీలైనంత త్వరగా ఆలయం మొత్తాన్ని ఒకేసారి పూర్తిచేసి భక్తులకు దర్శనభాగ్యం కల్పించాలని ఆదేశించారు.  

పనులు.. పరుగులు.. 
ఆలయ పనులు ప్రారంభించిన ఏడాదిలో పూర్తవకుంటే.. ప్రారంభం విషయంలో మరింత జాప్యమవుతుందని, ఆగమశాస్త్రం ప్రకారం అలాంటి నిబంధనలున్నందున గడువులోనే పనులు పూర్తిచేసి ప్రారంభించాలని ఇటీవల పండితులు సీఎం దృష్టికి తీసుకెళ్లారు. ఈ మేరకు ఇటీవల ఆలయ పనులను స్వయంగా పరిశీలించిన సీఎం.. అధికారులకు స్పష్టమైన ఆదేశాలిచ్చి దసరాను ముహూర్తంగా ఖరారు చేశారు. ఈ నేపథ్యంలో ఫిబ్రవరిలో జరగాల్సిన బ్రహ్మోత్సవాలను ప్రస్తుతం ఉత్సవమూర్తులు కొలువైన బాలాలయంలోనే జరపనున్నారు. అయితే గర్భాలయాన్ని ప్రారంభించాలని తొలుత నిర్ణయించినందున ఆ ప్రకారమే ఇప్పటి వరకు పనుల పురోగతి సాగించారు. దీంతో మిగిలిన పనుల్లో తీవ్ర జాప్యం నెలకొంది. ఇప్పుడు సీఎం తాజా ఆదేశాలతో అన్ని పనులూ ఒకేసారి పూర్తిచేసే దిశగా ప్రణాళిక మార్చుకున్నారు. దసరా నాటికి అన్ని పనులు పూర్తి చేసి గర్భాలయంలోని మూలవిరాట్‌ దర్శనాన్ని భక్తులకు కలిగించేదిశగా పనులను పరుగెత్తిస్తున్నారు.   

ప్రారంభోత్సవానికి రాష్ట్రపతి, ప్రధాని?
ఆంధ్రప్రదేశ్‌లోని తిరుమలకు దేశవ్యాప్తంగా ప్రత్యేక స్థానం ఉంది. దేశ నలుమూలల నుంచి భక్తులు తిరుమలేశుని దర్శనానికి వస్తుంటారు. ఇప్పుడు యాదాద్రినీ ఆ కోవలోకి చేర్చేలా సర్కారు చర్యలు తీసుకుంటోంది. దేశంలోని గొప్ప క్షేత్రాల సరసన నిలిచేలా యాదాద్రిని అభివృద్ధి చేస్తున్నందున ఆలయ ప్రారంభోత్సవానికి ప్రధాని నరేంద్రమోదీని ఆహ్వానించాలని సీఎం కేసీఆర్‌ భావిస్తున్నారు. ఆయనకు కుదరని పక్షంలో రాష్ట్రపతిని ఆహ్వానించాలని, కుదిరితే ఇద్దరూ హాజరయ్యేలా చూడాలని యోచిస్తున్నారు. అలాగే దేశంలోని అన్ని ప్రధాన పీఠాల స్వామీజీలనూ ప్రారంభోత్సవానికి ఆహ్వానించనున్నారు. వెరసి దేశమంతా యాదాద్రి లక్ష్మీనరసింహుడి ప్రత్యేకత చేరేలా సర్కారు ప్రణాళిక రూపొందిస్తోంది.

మరిన్ని వార్తలు