త్వరలో నిజదర్శన భాగ్యం..

15 Dec, 2018 02:40 IST|Sakshi
భువంగానికి(గడప) పూజలు చేస్తున్న ఈవో, వైటీడీఏ అధికారులు , సప్తతల మహారాజగోపురం

పూర్తవుతున్న యాదాద్రి పనులు 

ఫిబ్రవరిలో స్వామి దర్శనానికి ఏర్పాట్లు 

ప్రధానాలయానికి భువంగం (గడప) అమరిక 

18 తర్వాత సీఎం కేసీఆర్‌ రాక  

పనుల్లో వేగం పెంచిన వైటీడీఏ 

సాక్షి, యాదాద్రి: భక్తులకు స్వయంభువుల నిజదర్శనం కల్పించే శుభ సమయం దగ్గరపడుతోంది. ఫిబ్రవరిలో ప్రధానాలయాన్ని భక్తులకు అందుబాటులోకి తెచ్చేందుకు వైటీడీఏ పనుల్లో వేగం పెంచింది. సెప్టెంబర్‌ లేదా అక్టోబర్‌లో స్వామివారి దర్శనం కల్పిస్తామని చెప్పినప్పటికీ పనుల్లో జాప్యం వల్ల వాయిదా పడింది. కేసీఆర్‌ రెండోసారి సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం యాదగిరిగుట్టకు రానున్న నేపథ్యంలో ఆలయ నిర్మాణ పనుల్లో వేగం పెంచారు. శుక్రవారం ప్రధానాలయ గడప పూజను శాస్త్రోక్తంగా నిర్వహించారు. గురువారం సప్త తల రాజగోపురంపై మహానాసిని ఏర్పాటు చేశారు. ఏడు గోపురాలతో అలరారే విధంగా నిర్మాణ పనులు చేపట్టిన ఈ పుణ్యక్షేత్రంలో మహారాజగోపురం పనులు మరో వారం రోజుల్లో పూర్తి కానున్నాయి.  లక్ష్మీనారసింహస్వామి ఆలయాన్ని అద్భుత శిల్పా కళా నైపుణ్యంతో నిర్మించారు. గర్భా లయంపై గాలి గోపురానికి అవసరమైన టేకు ద్వారాలను తయారు చేసి బిగించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.  

ప్రధానాలయానికి భువంగం (గడప) అమరిక.. 
దేవస్థానంలో ప్రధానాలయానికి కృష్ణ శిలతో ప్రత్యేకంగా తయారు చేసిన భువంగం (గడప) అమర్చారు. శుక్రవారం సప్తమి తిథి మంచిది కావడంతో ఈ కార్యక్రమం నిర్వహించారు. శిల్పం పరి¿భాషలో ఒక ద్వారానికి ఉన్న నాలుగు దిక్కుల్లో పైన ఉన్న దానిని పతంగం, కిందనున్న గడపను భువంగం, ఇరువైపుల ఉన్న వాటిని యోగం, భోగం అని అంటారు. పతంగం, యోగం, భోగం వాటిని గతంలోనే అమర్చగా కింద ఉన్న భువంగాన్ని శుక్రవారం అమర్చారు. అనంతరం గడపకు వైటీడీఏ అధికారులు ప్రత్యేక పూజలు చేశారు. ఈ భువంగానికి కింద నవరత్నాలను వేసి పూజలు నిర్వహించారు.  

18 తర్వాత సీఎం రాక: వైటీడీఏ వైస్‌ చైర్మన్‌ కిషన్‌రావు 
ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఈ నెల 18 తర్వాత యాదాద్రికి వచ్చే అవకాశం ఉంది. కచ్చితమైన తేది ఇంకా నిర్ణయం కాలేదు. ప్రధానాలయం, సప్తగోపురాల్లో చిన్న చిన్న పనులు మిగిలిపోయాయి. వాటిని పూర్తి చేస్తాం. రిటైనింగ్‌ వాల్‌ పూర్తవుతోంది. ఫిబ్రవరిలో మంచి రోజులు ఉన్నందున భక్తులకు స్వామివారి దర్శనాన్ని అందుబాటులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నాం.

పూర్తయిన 90 శాతం పనులు
యాదాద్రి గర్భాలయం, ప్రధానాలయం పనులు 90 శాతం పూర్తయ్యాయి. శిల్పి పనుల్లో భాగంగా అళ్వార్‌ విగ్రహాలు, కాకతీయ స్తంభాలను ఏర్పాటు చేశారు. తూర్పు, ఉత్తరం వైపు ఐదంతస్తుల రాజగోపురాలు పూర్తయ్యాయి. ఏడంతస్తుల రాజగోపురం వారంరోజుల్లో పూర్తికానుంది. మహారాజ గోపురం ముఖ మండపం, విమానగోపురం, ప్రాకారం, అంతర్గత ప్రాకారం, ధ్వజస్తంభ పీఠం పనులు, భక్తుల రాకపోకలకు మెట్లు, క్షేత్ర పాలకుడైన ఆంజనేయస్వామి ఆలయం పనులు 90 శాతం పూర్తయ్యాయి. ఈనెలాఖరులో మొత్తం శిల్పి పనులు పూర్తవుతాయని స్తపతి ఆనందసాయి చెప్పారు.  

మరిన్ని వార్తలు