చినజీయర్ సూచనలతో మాస్టర్‌ప్లాన్

28 Feb, 2015 01:30 IST|Sakshi
చినజీయర్ సూచనలతో మాస్టర్‌ప్లాన్

భువనగిరి/యాదగిరికొండ: యాదగిరిగుట్ట అభివృద్ధి కోసం త్రిదండి చినజీయర్ స్వామి సలహాలు, సూచనలతో మాస్టర్‌ప్లాన్ రూపొం దించనున్నట్లు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు తెలిపారు. ఇందుకోసం వారం రోజుల్లో ఆయనతో కలిసి పుణ్యక్షేత్రానికి మళ్లీ రానున్నట్లు చెప్పారు. యాదగిరిగుట్ట బ్రహ్మోత్సవాల్లో ప్రధాన ఘట్టమైన యాదగిరీశుడి కల్యాణోత్సవం సందర్భంగా ఆయన శుక్రవారం సతీసమేతంగా వచ్చి స్వామి, అమ్మవార్లకు పట్టువస్త్రాలు, పసుపుకుంకుమలు సమర్పించారు.

రాత్రి కల్యాణం ఉండగా కేసీఆర్ దంపతులు ఉదయం 11:25 గంటలకు ఆలయానికి చేరుకున్నారు. దేవాదాయ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి, విద్యుత్ శాఖ మంత్రి జగదీష్‌రెడ్డి, విప్ గొంగిడి సునీత, పలువురు ఎమ్మెల్యేలు వారి వెంట వచ్చారు. ఆలయ ముఖద్వారం వద్ద అర్చకులు పూర్ణ కుంభ స్వాగతం పలికారు.
 
 గర్భాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ ఆవరణలో అర్చకులు, వేద పండితులు వేదమంత్రాలతో సీఎం దంపతులకు ఆశీర్వచనం అందజేశారు. అనంతరం మధ్యాహ్నం 12:30 గంటలకు స్వామివారి హనుమంత వాహనసేవలోని స్వామి, అమ్మవారి ఉత్సవమూర్తులను వారు దర్శించుకున్నారు. అక్కడే స్వామివారికి పట్టువస్త్రాలు, అమ్మవారికి పువ్వులు, పసుపుకుంకుమ, గాజులను సమర్పించారు. అనంతరం ఆలయ ప్రధానార్చకులతో కలిసి సీఎం కేసీఆర్ మరోమారు ఆలయ ప్రాంగణంలో కలియదిరిగారు. కొండపైనుంచి యాదగిరిగుట్ట గ్రామంతోపాటు, పరిసర కొండలను పరిశీలించారు. వాటికి సంబంధించిన వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు.
 
 భూసేకరణను వేగవంతం చేయాలని ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్‌ను కేసీఆర్ ఆదేశించారు. వారంలోగా జీయర్‌స్వామితో కలిసి వచ్చి మాస్టర్‌ప్లాన్ కోసం సలహాలు, సూచనలు తీసుకుంటానని అర్చకులతో చెప్పారు. అనంతరం ఆండాళ్ నిలయంలో మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులతో సమీక్ష నిర్వహించారు. 25న కూడా గుట్టకు వచ్చిన సీఎం అన్ని ప్రాంతాలను పరిశీలించి పలు పనులకు ఆదేశాలిచ్చిన సంగతి తెలిసిందే. ఆగమశాస్త్ర నియమాల ప్రకారమే అన్ని పనులు చేపట్టాలని సూచించారు. కొండపై చేపట్టాల్సిన అభివృద్ధి పనులపై ఆయన తాజాగా మళ్లీ సమీక్ష జరిపారు.
 
 కాగా, సీఎం రాకతో గుట్టపై భక్తులు, మీడియా ప్రతినిధులు, పూజారులు, దేవస్థానం ఉద్యోగులు మరోసారి పోలీసుల నిర్బంధాన్ని ఎదుర్కొన్నారు. కేసీఆర్ వెంట మంత్రులు జగదీశ్‌రెడ్డి, ఇంద్రకరణ్‌రెడ్డి, పార్టీ విప్ గొంగిడి సునీతారెడ్డి, ఎమ్మెల్యేలు పైళ్ల శేఖర్‌రెడ్డి, ఎన్‌వీఎస్ ప్రభాకర్, వేముల వీరేశం, దేవస్థానం ఈవో గీతారెడ్డి తదితరులు ఉన్నారు.

మరిన్ని వార్తలు