కాలక్షేపానికి వస్తున్నారా?

17 Jul, 2014 23:57 IST|Sakshi

షాబాద్: పేదలకు వైద్యం చేయకుండా టైంపాస్ చేస్తున్నారా.. ఏమడిగినా సమాధానం చెప్పడం లేదు.. ఇంతకూ మీరు డాక్టర్లేనా .. మీ పనితీరుపై కలెక్టర్‌కు ఫిర్యాదు చేస్తానంటూ చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య పీహెచ్‌సీ వైద్యురాలు కరీమున్నిసా బేగంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం ఆయన షాబాద్ ప్రాథమిక ఆరోగ్యకేంద్రాన్ని తనిఖీ చేశారు.

 ఆస్పత్రి ఆవరణ అంతా అపరిశుభ్రంగా ఉండడం, దుర్వాసన వెదజల్లుతుండడంతో ఎమ్మెల్యే మండిపడ్డారు. మీ ఇల్లయితే ఇలాగే ఉంచుకుంటారా.. ఆస్పత్రిని శుభ్రం చేయించడం తె లియదా అంటూ ఆగ్రహం వ్యక్తంచేశారు. ఆస్పత్రిలో స్టాఫ్ సక్రమంగా లేరని.. తాను ఒక్కదాన్నే ఏం చేయాలని వైద్యురాలు కరీమున్నిసా బేగం సమాధానమిచ్చారు. దీంతో ఆయన మీపై జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేస్తానని చెప్పారు. వైద్యులు సమయపాలన పాటించడం లేదని రోగులు ఆయనకు మొరపెట్టుకున్నారు.

 వారానికి నాలుగు రోజులు మాత్రమే వస్తారని, 11 గంటలకు వచ్చి ఒంటిగంటకే వెళ్లిపోతారని చెప్పారు. దీంతో ఎమ్మెల్యే ఆస్పత్రిలో సిబ్బందిని నియమించేలా చూస్తానని తెలిపారు. గ్రామాల్లో సబ్‌సెంటర్లు సక్రమంగా నడుస్తున్నాయా అని సూపర్‌వైజర్‌ను అడిగి తెలుసుకున్నారు. ఆస్పత్రి మెయింటెనెన్స్ డబ్బులను ఏం చేశారని ప్రశ్నించారు. ఎవరైనా ప్రమాదంలో చనిపోతే పోస్టుమార్టం కోసం చేవెళ్ల ఆస్పత్రికి తీసుకువెళ్లాల్సిన పరిస్థితి ఉందని, షాబాద్‌లోనే పోస్టుమార్టం చేసేలా చూడాలని గ్రామస్తులు ఎమ్మెల్యేను కోరారు.

ఏడేళ్ల క్రితం లక్షలాది రూపాయాలతో నిర్మించిన ఆస్పత్రి భవనం ప్రారంభానికి నోచుకోలేదని చెప్పారు. అధికారుల నిర్లక్ష్యం వల్లే భవనం అసంపూర్తిగా పడి ఉందన్నారు. రాత్రిపూట రోడ్డు ప్రమాదాలు జరిగితే ఆస్పత్రికి వస్తే ఒక్కరు కూడా ఉండడంలేదని, 24గంటలు ఆస్పత్రిలో వైద్యసిబ్బంది ఉండేలా  చూడాలని ఎమ్మెల్యేను కోరారు. ఆయన వెంట బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు బర్క కృష్ణయాదవ్, వైస్ ఎంపీపీ శివకుమార్, నాయకులు జంగయ్య, సత్యనారాయణ   తది తరులున్నారు.

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా