ఎర్రవల్లిలో ‘అయుత’ శోభ

22 Dec, 2015 02:03 IST|Sakshi
ఎర్రవల్లిలో ‘అయుత’ శోభ

రేపట్నుంచే మహా క్రతువు ప్రారంభం
యాగ నిర్వహణకు పూర్తయిన ఏర్పాట్లు
 40 ఎకరాల్లో అందంగా  ముస్తాబైన ఆధ్యాత్మిక క్షేత్రం

 
 గజ్వేల్/జగదేవ్‌పూర్: భారీ యాగశాలలు.. హోమ గుండాలు.. రుత్విక్కుల కుటీరాలు.. వీవీఐపీల వసతి గదులు, రకరకాల పూల మొక్కలు, స్వాగత తోరణాలతో ‘నభూతో.. న భవిష్యతి’ అన్న తరహాలో అయుత యాగ క్షేత్రం సిద్ధమైంది. లోక కల్యాణార్థం సీఎం కేసీఆర్ నిర్వహిస్తున్న ఈ మహాక్రతువుకు అంగరంగ వైభవంగా ఏర్పాట్లు చేశారు. ఆధ్యాత్మిక వాతావరణం పరిఢవిల్లేలా ఈ క్షేత్రం అందరినీ ఆకట్టుకుంటోంది.

పూర్తయిన ఏర్పాట్లు..
జగదేవ్‌పూర్ మండలం ఎర్రవల్లిలోని సీఎం ఫామ్‌హౌస్‌లో ఈ నెల 23 నుంచి 27 వరకు నిర్వహించే అయుత చండీయాగానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. 25 రోజుల నుంచి ఈ పనులు చేపడుతున్నారు. సోమవారం సీఎం కేసీఆర్.. కలెక్టర్ రోనాల్డ్‌రాస్, ‘గడా’ ఓఎస్డీ హన్మంతరావులతో కలిసి ఏర్పాట్లను పరిశీలించారు. వివిధ రాష్ట్రాల నుంచి వచ్చే రుత్వికుల కోసం ఏర్పా ట్లు పూర్తి చేశారు. వీవీఐపీ, వీఐపీ, సాధారణ ప్రజల కోసం 14  గ్యాలరీలు, లైటింగ్, బయో మరుగుదొడ్లను ఏర్పాటు చేశారు. శృంగేరీ జగద్గురువులు భారతీ తీర్థ మహాస్వామి ఆశీస్సులతో అయిదు రోజులపాటు అంగరంగ వైభవంగా ఈ యాగం నిర్వహించనున్నారు. యాగానికి రాష్ట్రపతి, గవర్నర్, పలు రాష్ట్రాల సీఎంలు, ప్రముఖులు రానున్నారు.

హోమ గుండాలు సిద్ధం
 చండీయాగంలో భాగంగా మొత్తం 101 హోమ గుండాలను సిద్ధం చేశారు. హోమ చండీ, జప చండీ, తర్పణ చండీ, రుద్ర చండీ యాగాలను నిర్వహించనున్నారు. తెలంగాణతోపాటు కర్ణాటక, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్ నుంచి మొత్తం 1,500 మంది రుత్విక్కులు ఈ యాగాల్లో పాల్గొంటారు. వారికి అన్ని రకాల సదుపాయాలు కల్పించారు. అయిదు రోజుల పాటు సాయంత్రం వేళ భక్తుల కోసం ఆధ్యాత్మిక, హరికథ కార్యక్రమాల నిర్వహించనున్నారు.

4 హెలిప్యాడ్‌లు.. 8 పార్కింగ్ స్థలాలు
యాగానికి వచ్చే ప్రముఖుల కోసం వ్యవసాయ క్షేత్రం సమీపంలోని శివారు వెంకటాపూర్‌లో 4 హెలిప్యాడ్‌లు సిద్ధం చేస్తున్నారు. రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ఇతర రాష్ట్రాల గవర్నర్లు, సీఎంల కోసం వేర్వేరుగా వీటిని ఏర్పాటు చేస్తున్నారు. వీవీఐపీలకు, వీఐపీలకు, భక్తులకు వేర్వేరుగా 8 చోట్ల పార్కింగ్ స్థలాలు ఏర్పాటు చేశారు. వీఐపీల పార్కింగ్‌కు పోలీస్ కంట్రోల్ రూమ్ సమీపంలో ఏర్పాట్లు చేశారు. నర్సన్నపేట సమీపంలో రెండు చోట్ల పార్కింగ్ స్థలాలను ఏర్పాటు చేస్తున్నారు. యాగానికి వెళ్లేందుకు బస్సు సౌకర్యాలను కల్పించనున్నారు. ఐదెకరాల స్థలంలో విశాలమైన భోజనశాలను సిద్ధం చేశారు.

ప్రముఖులకు ఏసీ గదులు
చండీయాగానికి వచ్చే ప్రముఖుల కోసం ఆరు ఏసీ గదులను ఏర్పాటు చేశారు. రాష్ట్రపతి, గవర్నర్లకు ప్రత్యేకంగా గదులు కేటాయించనున్నారు. వేద పండితుల కోసం మరో 2 గదులను కేటాయించారు. మరొకటి ఇతర రాష్ట్రాల సీఎంలు, వీవీఐపీలకు కేటాయిస్తారు. వీటిని పర్ణశాలల ఆకారంలో అందంగా తీర్చిదిద్దారు. గదుల చుట్టూ వివిధ రకాల డిజైన్ చెట్లను పెట్టారు. యాగానికి వచ్చే అన్ని దారులు కాంతులు విరజిమ్మేలా లైటింగ్ ఏర్పాటు చేశారు. వీటి కోసం ఫాంహౌస్ చుట్టూ కొత్తగా 6 ట్రాన్స్‌ఫార్మర్లు బిగించారు.
 
 వైదిక పూజలు ప్రారంభం
 
పాల్గొన్న సీఎం దంపతులు

జగదేవ్‌పూర్: అయుత యాగశాలలో సోమవారం వైదిక కార్యక్రమాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు నిర్వహించిన ఈ పూజల్లో సీఎం దంపతులు పాల్గొన్నా రు. సీఎం కేసీఆర్ ఎర్ర అంచు పంచె ధరించగా.. సీఎం సతీమణి శోభ పట్టుచీర ధరించి గణపతి పూజలో పాల్గొన్నారు. 5 గంటల పాటు 18 రకాల పూజలు నిర్వహించారు. శృంగేరీ పురోహితులు పురాణం మహేశ్వశర్మ, ఫణిశాశంక్‌శర్మ, గోపాలకృష్ణశర్మ, 15 మంది రుత్విక్కులు పూజలు చేశారు. గురుప్రార్థన, గణపతి పూజ, దేవనాంది, అంకుర్పాణం, ప్రాశనం, గోపూజ, యాగశాల ప్రవేశం, యాగశాల సంస్కారం, అఖండ దీపారాధన, మహాసంకల్పం, సహస్రమోదక మహాగణపతి హోమం, మహామంగళ హారతి, ప్రార్థన, ప్రసాద వితరణం, సాయంకాలవాస్తు రాక్షోఘ్న హోమం, అఘెరాస్ట్ర హోమం వంటి కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం ఎర్రవల్లిలో సీఎం దంపతులు గ్రామ దేవతలకు పూజలు నిర్వహించారు. పురోహితులు పోచమ్మ, మైసమ్మ ఆలయాల వద్ద అమ్మవార్లకు వారితో పూజలు చేయించారు. వ్యవసాయక్షేత్రం చుట్టూ ఉన్న ఎర్రవల్లి, నర్సన్నపేట, శివారువెంకటాపూర్, దారమకుంట, ఇటిక్యాల, వర్ధరాజ్‌పూర్, పాండురంగ ఆశ్రమంలోని గ్రామ దేవతలకు కూడా సీఎం పూజా సామగ్రిని అందించారు. గ్రామస్తులు ఉదయమే దేవతలకు పూజలు చేశారు.
 
సకల సౌకర్యాలు..
వీవీఐపీలకు, వీఐపీలకు, భక్తులకు నిరంతరం వైద్య సేవలు అందించేందుకు హెల్త్‌క్యాంపు ఏర్పాటు చేస్తున్నారు.రాకపోకలకు అనుగుణంగా 50 బస్సులు ఏర్పాటు చేశారు. వంద మంది వలంటీర్లు సేవలందించనున్నారు.  చండీయాగం వివరాలు మీడియాకు ఎప్పటికప్పుడు అందుబాటులో ఉంచేం దుకు ప్రత్యేక వైబ్‌సైట్‌ను ప్రారంభించనున్నారు. వైఫై సౌకర్యాన్ని కల్పించారు.
 
24న చంద్రబాబు, 27న రాష్ట్రపతి ప్రణబ్ యాగానికి హాజరు కానున్నారు. భక్తుల కోసం ఇప్పటికే లక్షకు పైగా లడ్డూలు తయారు చేశారు. రోజూ 20 వేల నుంచి 50 వేల మంది భోజనాలకు వీలుగా ఏర్పాట్లు చేశారు. సుమారు 5 వేల మంది పోలీసులు బందోబస్తుకు తరలివచ్చారు. యాగానికి వెళ్లే స్వాగత తోరణం ముం దు పోలీస్ కంట్రోల్‌రూం ఏర్పాటు చేశారు.
 
 

మరిన్ని వార్తలు