లిమ్కా రికార్డ్స్‌లోకి కరీంనగర్ జిల్లా వాసి

1 Sep, 2014 03:31 IST|Sakshi
లిమ్కా రికార్డ్స్‌లోకి కరీంనగర్ జిల్లా వాసి

గోదావరిఖని: ప్రపంచంలోనే అతిపెద్ద ఇంగ్లిష్ పాలిన్‌డ్రోమ్ (ముందు నుంచి వెనక్కి, వెనుక నుంచి ముందుకు చదివే వీలున్న వాక్యం) తయారు చేసిన కరీంనగర్ జిల్లా గోదావరిఖని యైటింక్లయిన్‌కాలనీకి చెందిన యార్లగడ్డ పోలీస్ లిమ్కా బుక్‌ఆఫ్ రికార్డుల్లోకి ఎక్కారు. ముఖ్యమైన 3,663 పదాలతో ఆయన తయారు చేసిన వాక్యం అతిపెద్ద పాలిన్‌డ్రోమ్‌గా ప్రపంచ రికార్డు సాధించింది.
 
వాడిన పదం వాడకుండా వాక్య నిర్మాణం చేయడం దీని ప్రత్యేకత. ఎంఏ ఇంగ్లిష్ లిటరేచర్, ఎంఏ సోషియూలజీ చదివి, ఆర్జీ-2 జీఎం కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న ఈయన ఈ పాలిన్‌డ్రోమ్ తయారు చేయడానికి ఐదేళ్లు పట్టింది. దీన్ని జూలైలో లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్‌కు పంపించగా వారు గుర్తిస్తూ ఆగస్టు 29న సర్టిఫికెట్ పంపించారు. గిన్నిస్ బుక్ దరఖాస్తు పరిశీలనలో ఉందని, మూడు నెలల పరిశీలన తర్వాత అందులోనూ నమోదయ్యే అవకాశముందని పోలీస్ తెలిపారు.

మరిన్ని వార్తలు