యాసంగి జోష్‌! 

21 Dec, 2018 01:38 IST|Sakshi

సాగర్, ఎస్సారెస్పీ కింద యాసంగి పంటలకు త్వరలో సాగునీరు

7–9 లక్షల ఎకరాలకు నీరందించేందుకు ప్రభుత్వం కసరత్తు

సీఎంతో చర్చించి షెడ్యూల్‌ ఖరారుకు అధికారుల నిర్ణయం

కృష్ణా బోర్డును 60 టీఎంసీలు కోరిన ప్రభుత్వం

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో ప్రధాన ప్రాజెక్టులైన నాగార్జునసాగర్, శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టుల కింద పంటల సాగు మొదలుపెట్టిన రైతాంగానికి శుభవార్త. ప్రస్తుతం ఈ ప్రాజెక్టుల్లో లభ్యతగా ఉన్న నీటితో యాసంగిలో కనిష్టంగా 7 లక్షల ఎకరాలకు.. సాధ్యమైతే గరిష్టంగా 9 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీరందించేలా రాష్ట్ర ప్రభుత్వం కార్యాచరణ రూపొంది స్తోంది. ప్రాజెక్టుల్లో లభ్యత నీరు, తాగునీటి అవసరా లకు పక్కనపెట్టగా సాగుకు మిగిలే నీటి వివరాలను సిద్ధం చేసిన నీటిపారుదలశాఖ... యాసంగి పంట లకు నీటి విడుదలకు సానుకూలత వ్యక్తం చేసింది. అయితే నీటిని ఎన్ని విడతలుగా విడుదల చేయాలి? ఎప్పటి నుంచి నీటి విడుదల కొనసాగించాలి? వంటి అంశాలపై ముఖ్యమంత్రితో చర్చించాక నీటి విడుదల షెడ్యూల్‌ ఖరారు చేయాలని నిర్ణయించింది.

ఆయకట్టుకు ఆయువు...
నాగార్జునసాగర్, ఎస్సారెస్పీ ప్రాజెక్టుల పరిధిలో చెప్పుకోదగ్గ స్థాయిలో నీటి లభ్యత ఉన్న దృష్ట్యా అక్కడ తాగునీటి అవసరాలకు తొలి ప్రాధాన్యం ఇస్తూనే మిగతా నీటిని యాసంగి అవసరాలకు ఇవ్వాలని నీటిపారుదల శాఖ నిర్ణ యించి తదనుగుణంగా ప్రణాళిక రచించింది. దాని ప్రకారం సాగర్‌లో ప్రస్తుతం కనీస నీటిమట్టానికి ఎగువన లభ్యతగా ఉన్న 76.13 టీఎంసీల్లో తాగునీటి అవసరాలను పక్కనపెట్టి సాగర్‌ ఎడమ కాల్వ కింద 25 టీఎంసీలను వినియోగించుకోవాలని నిర్ణయించింది. ఈ నీటితో వరి వంటి పంటలకైతే 3 లక్షల ఎకరాల వరకు నీరిచ్చే అవకాశాలు న్నాయి. ఒకవేళ వారా బందీ పద్ధతిన, ఆరుతడి పంటలకు నీళ్లిచ్చిన పక్షంలో 4.50 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీరందించే అవకాశాలు న్నాయి. 2016–17 యాసంగిలో సాగర్‌ కింద 28.94 టీఎంసీల నీటితో 4.14 లక్షల ఎకరాలకు సాగునీరు ఇవ్వగలిగారు.

గతేడాది యాసంగిలో 46.36 టీఎంసీల నీటితో 5.28 లక్షల ఎకరాలకు నీరందించారు. అయితే ప్రస్తుతం సాగర్‌ కాల్వల ఆధునీకరణ వంద శాతం పూర్తయిన నేపథ్యంలో ఒక టీఎంసీ నీటితో 13 వేల ఎకరాల వరకు నీరందించే అవకాశం ఉంటుందని, అలా అయితే 3.25 లక్షల ఎకరాల్లో వరి లాంటి నీటి ఆధారిత పంటలకు నీరివ్వొచ్చని అధికారులు అంచనా వేశారు. అదే ఆరుతడి పంటలయితే 4.50 లక్షల ఎకరాలకు నీరివ్వవచ్చని భావిస్తున్నారు. గతంలో నీటి విడుదల ఆరుతడి పంటల పేరుతో సాగినా రైతులు మాత్రం వరి సాగు చేయడం పరిపాటిగా మారింది. ఈ నేపథ్యంలో ప్రజాప్రతినిధులతో పూర్తి స్థాయిలో చర్చించాకే నీరందించే ఆయకట్టును నిర్ణయించనున్నారు. గతంలో సాగర్‌ కింద నీటి విడుదలను 8 తడుల్లో ఇవ్వగా ప్రస్తుతం ఆయకట్టు విస్తీర్ణాన్నిబట్టి ఎన్ని తడులు ఇచ్చేది నిర్ణయం కానుంది.

ఎస్సారెస్పీలో 34 టీఎంసీల నీరు...
శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టు పరిధిలో ఈ ఏడాది ఖరీఫ్‌లో 7 లక్షల ఎకరాలకు సాగునీరు అందించగా ప్రస్తుతం యాసంగికి నీటి విడుదల డిమాండ్‌లు మొదలయ్యాయి. ప్రస్తుతం ఎస్సారెస్పీలో 33.55 టీఎంసీల మేర నీటి లభ్యత ఉండగా ఇందులో 4.35 టీఎంసీల నీరు మిషన్‌ భగీరథకు అవసరం కానుంది. ఇవి పోనూ మరో 20 టీఎంసీల మేర నీరు ఎస్సారెస్పీ కింద ఆన్‌అండ్‌ ఆఫ్‌ పద్ధతిన 5 తడుల్లో నీటిని ఇవ్వగలిగితే 3.91 లక్షల ఎకరాలకు సాగునీటిని అందించవచ్చు. దీంతోపాటే మరో 2 టీఎంసీలు అలీసాగర్, గుత్పకు ఇవ్వగలిగితే రెండు తడుల ద్వారా 35 వేల ఎకరాలకు నీరిచ్చే అవకాశాలున్నాయి.

అలాగే లోయర్‌ మానేరు డ్యామ్‌లో ప్రస్తుతం 8.45 టీఎంసీల నీటి లభ్యత ఉండగా ఇందులో 4.10 టీఎంసీలు తాగునీకి పక్కనపెట్టినా మిగతా నీటిలో 2 టీఎంసీలు మిడ్‌మానేరుకు వదిలే అవకాశం ఉంటుంది. అదే జరిగితే మిడ్‌మానేరులో నీటి నిల్వలు 6.72 టీఎంసీలకు పెరగనుండగా అందులో 4.15 టీఎంసీల నీటిని భూగర్భ జలాల ఆధారంగా సాగు చేసిన 1.50 లక్షల ఎకరాల ఆయకట్టుకు రెండు తడులుగా ఇచ్చే అవకాశం ఉందని నీటిపారుదల వర్గాలు తెలిపాయి. ఎటు చూసినా సాగర్, ఎస్సారెస్పీ పరిధిలో కనిష్టంగా 7 లక్షల ఎకరాల నుంచి గరిష్టంగా 9 లక్షల ఎకరాల మేర సాగుకు నీరిచ్చే అవకాశం ఉంది. దీనిపై ఆయకట్టు పరీవాహక నియోజకవర్గ ప్రజాప్రతినిధులతో ముఖ్యమంత్రి చర్చించాక నీటి విడుదలపై తుది నిర్ణయం తీసుకునే అవకాశాలున్నాయి.

60 టీఎంసీలు అవసరం...
కృష్ణా బేసిన్‌లోని శ్రీశైలం, సాగర్‌ ప్రాజెక్టుల్లో లభ్యతగా ఉన్న జలాల్లోంచి రాష్ట్ర అవసరాలకు 60 టీఎంసీలు కేటాయించాలని రాష్ట్ర ప్రభుత్వం కృష్ణా బోర్డును కోరింది. ఈ మేరకు ఈఎన్‌సీ మురళీధర్‌ కృష్ణా బోర్డుకు గురువారం లేఖ రాశారు. ప్రస్తుత లెక్కల ప్రకారం కనీస నీటి మట్టాలకు ఎగువన శ్రీశైలంలో 17.12 టీఎంసీలు, సాగర్‌లో 76.13 టీఎంసీలు కలిపి మొత్తం 93.25 టీఎంసీలు లభ్యతగా ఉన్నాయని తెలిపారు. ఈ నీటిలో నిర్ణీత వాటాల మేరకు తెలంగాణకు 60.39 టీఎంసీలు, ఏపీకి 32.87 టీఎంసీలు దక్కుతాయని వివరించారు. రాష్ట్రానికి దక్కే వాటా నీటిలో శ్రీశైలం పరిధిలో ఆగస్టు వరకు మిషన్‌ భగీరథకు 5 టీఎంసీలు, కల్వకుర్తికి 6 టీఎంసీలు, సాగర్‌ పరిధిలో మిషన్‌ భగీరథకు 9 టీఎంసీలు, హైదరాబాద్‌ తాగునీటి అవసరాలకు 12 టీఎంసీలు, ఏఎంఆర్‌పీ కింద చెరువులు నింపేందుకు 3 టీఎంసీలు, సాగర్‌ కుడి కాల్వ కింద రబీ అవసరాలకు 25 టీఎంసీలు వాడుకుంటామని తెలిపారు. ఈ అవసరాల దృష్ట్యా 60 టీఎంసీల నీటి కేటాయింపునకు అనుకూలంగా ఆదేశాలివ్వాలని కృష్ణా బోర్డును ఈఎన్‌సీ కోరారు. 
 

మరిన్ని వార్తలు