గడ్డ తీస్తామని కిడ్నీ తీశారు

6 Mar, 2019 10:50 IST|Sakshi

యశోద ఆస్పత్రిపై రోగి బంధువుల ఆరోపణ

ఆస్పత్రి ఎదుట ఆందోళన

చాదర్‌ఘాట్‌: చికిత్స కోసం వస్తే గడ్డ తొలగిస్తామని చెప్పిన మలక్‌పేట యశోద ఆసుపత్రి వైద్యులు కిడ్నీ మాయం చేశారని ఆరోపిస్తూ రోగిం బంధువులు ఆస్పత్రి ఎదుట ఆందోళన చేపట్టిన సంఘటన మంగళవారం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. హయత్‌నగర్, తారామతి పేటకు చెందిన శివ ప్రసాద్‌ వారం రోజుల క్రితం కడుపు నొప్పితో బాధపడుతూ చికిత్స నిమిత్తం మలక్‌పేట యశోద ఆసుపత్రిలో చేరాడు. పరీక్షలు నిర్వహించిన వైద్యులు కడుపులో గడ్డ ఉందని దానిని తొలగించేందుకు ఆపరేషన్‌ చేయాలని చెప్పారు.

ఇందుకు గాను రూ. లక్ష అడ్వాన్స్‌గా కట్టించుకుని ఆస్పత్రిలో అడ్మిట్‌ చేసుకున్నారు. అతడికి ఆపరేషన్‌ చేసిన వైద్యులు కడుపులో గడ్డతోపాటు కిడ్నీని కూడా తొలగించారని ఆరోపిస్తూ అతని బంధువులు మంగళవారం ఆసుపత్రి ఎదుట ఆందోళనకు దిగారు. తమకు సమాచారం ఇవ్వకుండానే కిడ్నీని ఎలా తొలగిస్తారని ఆసుపత్రి వర్గాలను నిలదీశారు. కాగా శివప్రసాద్‌ కడుపులో ఉన్నది కేన్సర్‌ గడ్డ అయినందున వ్యాధి కిడ్నీకి కూడా సోకిందని వైద్యులు వారికి వివరించారు. 

చెప్పకుండా ఆపరేషన్‌ చేశారు:రోగి బంధువులు  
శివప్రసాద్‌ కిడ్నీని తొలగింపై తమకు ముందస్తుగా ఎలాంటి సమాచారం ఇవ్వలేదని రోగి బంధువులు ఆరోపించారు.  బాధ్యతారహితంగా వ్యవహరించిన ఆసుపత్రిపై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్‌ చేశారు.

ముందుగానే తెలిపాం:యశోద ఆసుపత్రి వైద్యులు
శివప్రసాద్‌కు కడుపులో గడ్డకు కేన్సర్‌ వ్యాధి సోకిందని, వ్యాధి రెండు కిడ్నీలకు వ్యాపించనందునే కిడ్నీ తొలగించాల్సి వచ్చిందని, దీనిపై రోగి బంధువులకు సమాచారం ఇచ్చిన తర్వాతే ఆపరేషన్‌ చేసినట్లు యశోద ఆసుపత్రి పీఆర్‌ఓ అశోక్‌ వర్మ తెలిపారు. పేషెంట్‌ బంధువుల ఉద్దేశపూర్వకంగానే ఆందోళన చేస్తున్నారన్నారు.

మరిన్ని వార్తలు