ముందుగానే రంజాన్‌ ఎందుకిలా.?

16 May, 2018 10:44 IST|Sakshi

సాక్షి సిటీబ్యూరో: ఈసారి రంజాన్‌ మాసం ముందొచ్చినట్టు అనిపిస్తుంది కదూ! అవును దీనికి ఓ కారణముంది. ఇంగ్లిష్‌ క్యాలెండర్‌తో పోలిస్తే... ఇస్లామిక్‌ క్యాలెండర్‌లో రోజుల సంఖ్య తక్కువ. అందుకే రంజాన్‌ ముందుగానే మొదలవుతుంది. గతేడాది రంజాన్‌ మే 27న ప్రారంభమైంది. ఈసారి ఈ నెల 16న నెలవంక దర్శనమిస్తే... 17న రంజాన్‌ మొదలవుతుంది. అంటే 12 రోజులు ముందుగానే రంజాన్‌ ప్రారంభమవుతుందన్న మాట. ఒక్క రంజాన్‌ మాసమే కాదు... ఇస్లామిక్‌ క్యాలెండర్‌లో అన్ని మాసాలు ముందుగానే వస్తాయి. ఎందుకిలా అంటారా? అయితే చరిత్ర తెలుసుకోవాల్సిందే.

మహ్మద్‌ ప్రవక్త మక్కా నుంచి మదీనా నగరానికి వలస (హిజ్రత్‌) వెళ్తారు. ఇది ఇస్లామిక్‌ చరిత్రలో ఓ ఘట్టం. మదీనాకు చేరుకున్న నాటి నుంచే హిజ్రీ క్యాలెండర్‌ ప్రారంభమైంది. ప్రస్తుతం హిజ్రీ 1439వ సంవత్సరం నడుస్తోంది. ఆంగ్ల సంవత్సరాదిలో ఉన్నట్టే... హిజ్రీ క్యాలెండర్‌లోనూ 12 నెలలు ఉంటాయి. మొదటి నెల మొహరంతో మొదలై వరుసగా సఫర్, రబ్బీల్‌ఆవ్వల్, రబీవుల్‌సానీ, జమాదుల్‌ఆవ్వల్, జమాదుస్సానీ, రజ్జబ్, షాబాన్, రంజాన్, షవ్వాల్, జీఖద్, జిలహజ్‌ ఉంటాయి. ఇందులో రంజాన్‌ తొమ్మిదో నెల.

ప్రతి నెలలో తక్కువే...  
ఇంగ్లిష్‌ క్యాలెండర్‌లో ఒక్క ఫిబ్రవరిని మినహాయిస్తే మిగతా నెలల్లో కొన్నింటిలో 30 రోజులు, మరికొన్నింటిలో 31 రోజులు ఉంటాయి. కానీ ఇస్లామిక్‌ క్యాలెండర్‌లో అలా ఉండదు. కొన్ని నెలల్లో 29 రోజులు , మరికొన్నింటిలో 30 రోజులు ఉంటాయి. ఏ నెలలోనూ 31 రోజులు ఉండవు. అంటే ఇంగ్లిష్‌ క్యాలెండర్‌తో పోలిస్తే ఇస్లామిక్‌ క్యాలెండర్‌లో ఏడాదికి 10–12 రోజులు తగ్గిపోతాయి. అందుకే రంజాన్‌ మాసం 12రోజులు ముందుగానే వస్తోంది.

నెలవంక ఆధారంగా...  
ఆంగ్ల సంవత్సరాది ప్రకారం అర్ధరాత్రి 12గంటలు దాటిన తర్వాత మరుసటి రోజు ప్రారంభమవుతుంది. కానీ ఇస్లామిక్‌లో అలా కాదు. సూర్యాస్తమయంతో మరుసటి రోజు మొదలవుతుంది. నెలలు కూడా అంతే... నెలవంక చూసిన తర్వాత మరుసటి నెల మొదలవుతుంది. అంటే సాయంత్రం వేళ నెలవంక దర్శమిచ్చిన మరుక్షణం నుంచే ఇస్లామిక్‌ నెల ప్రారంభమవుతుంది. సాయంత్రం వేళ నెలవంక దర్శనమిచ్చాకే రంజాన్‌ మాసం ప్రారంభమైందంటూ మసీదుల్లో సైరన్‌ మోగిస్తారు. 

మరిన్ని వార్తలు